logo

Telangana News: గోనెసంచి తెచ్చిన తంటా.. 24 గంటల పాటు అంధకారంలో గోపాల్‌పేట

ఓ గోనెసంచి ఏకంగా గోపాల్‌పేట పట్టణాన్ని రాత్రంతా అంధకారంలోకి నెట్టింది. 24 గంటల పాటు విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగించింది. చదవడానికి ఇది ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. మండల కేంద్రమైన

Updated : 24 Apr 2022 08:13 IST

విద్యుత్తు స్తంభంపై లేచిన మంటలు

గోపాల్‌పేట, న్యూస్‌టుడే : ఓ గోనెసంచి ఏకంగా గోపాల్‌పేట పట్టణాన్ని రాత్రంతా అంధకారంలోకి నెట్టింది. 24 గంటల పాటు విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగించింది. చదవడానికి ఇది ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. మండల కేంద్రమైన గోపాల్‌పేటలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం వరకు విద్యుత్తు సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనికి ముందు సాయంత్రం నుంచి ఈదురుగాలులు వీచాయి. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. అనంతరం సరఫరాను పునరుద్ధరించారు. అయితే రాత్రి సుమారు 12 గంటల సమయంలో మళ్లీ గాలిదుమారంతో విద్యుత్తు సరఫరా ఒక్కసారిగా నిలిచిపోయింది. ఫ్యాన్లు తిరగక.. ఏసీలు పనిచేయకపోవడంతో పలువురు మేల్కొన్నారు. కరెంటు ఎందుకుపోయిందో ట్రాన్స్‌కో సిబ్బందికి కూడా అర్థం కాలేదు. అదే సమయంలో బస్టాండు ప్రాంతం నుంచి సిబ్బందికి ఫోన్‌ వచ్చింది. విద్యుత్తు తీగలపై గోనెసంచి పడి మంటలు లేస్తున్నాయని కొందరు చెప్పారు. బస్టాండు సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం పిల్లరుకు చుట్టిన గోనెసంచి గాలిలో ఎగిరివచ్చి పక్కనే ఉన్న విద్యుత్తు తీగలపై పడింది. ఆ వెంటనే తీగల నుంచి మంటలు లేచాయి. అవి తెగిపడ్డాయి. ఫలితంగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. సిబ్బంది వచ్చి సరిచేయాలని ప్రయత్నించినా రాత్రి కావడంతో సాధ్యం కాలేదు. శనివారం తెల్లవారుజాము నుంచే మరమ్మతు పనులు ప్రారంభించి ఉదయం 10 గంటలకు సరఫరాను పునరుద్ధరించారు. ఒక గంటసేపు ఉన్న కరెంటు మళ్లీ పోయింది. ఓ గంటకు మళ్లీ వచ్చింది. కొద్దిసేపటి తర్వాత మళ్లీ సరఫరా నిలిచిపోయింది. ఇలా నాలుగైదుసార్లు కరెంటు రావడం.. పోవడంతో స్థానికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. రాత్రంతా విద్యుత్తు లేక నిద్రపోలేదు. ఇంట్లో నీళ్లు లేవు, మోటర్లు వేద్దామంటే కరెంటు లేదు. అంటూ విద్యుత్తు సిబ్బందికి ఫోన్లు వచ్చాయి. ఇలా సాయంత్రం 4 గంటల వరకు కరెంటు కష్టాలు ఎదురయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని