‘సమ్మె’ చేయడం అలా మొదలైంది

పారిశ్రామీకరణ జరిగిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా శ్రామిక వర్గం భారీగా పెరిగింది. ఒకప్పుడు శ్రమ దోపిడీ ఎక్కువగా జరిగేది. కానీ, కాలం మారుతోంది. కార్మికులు సంఘాలుగా ఏర్పడి వారి డిమాండ్లను యాజమాన్యంతో చర్చించి నెరువేర్చుకుంటున్నారు. ఒకవేళ చర్చలు విఫలమైతే

Updated : 09 Sep 2020 14:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పారిశ్రామీకరణ జరిగిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా శ్రామిక వర్గం భారీగా పెరిగింది. ఒకప్పుడు శ్రమ దోపిడీ ఎక్కువగా జరిగేది. కానీ, కాలం మారుతోంది. కార్మికులు సంఘాలుగా ఏర్పడి వారి డిమాండ్లను యాజమాన్యంతో చర్చించి నెరువేర్చుకుంటున్నారు. ఒకవేళ చర్చలు విఫలమైతే సమ్మెకు దిగుతుంటారు. పనులను ఎక్కడికక్కడ నిలిపివేసి యాజమాన్యం దిగివచ్చే వరకు ఆందోళన చేస్తుంటారు. తమ డిమాండ్‌ను నెరవేర్చుకోవడం కోసం కార్మికులు చేసే ‘సమ్మె’ అసలు ఎక్కడ మొదలైంది. కార్మికులకు ఆయుధంగా ఎలా మారింది? 

క్రీస్తుపూర్వమే ఈ సమ్మె చేసే విధానం ఆరంభమైంది. ప్రాచీన ఈజిప్టులో క్రీ.పూ 1186-1155 మధ్య రామ్సెస్‌ III పాలన సాగింది. 1152లో డీర్‌ ఎల్‌ మెదీనా ప్రాంతంలో రామ్సెస్‌ IIIకొన్ని సమాధులు, రహస్య నేల మాళిగలను నిర్మించాడు. అయితే అదే సమయంలో వాటిని నిర్మిస్తున్న కార్మికులు తమకు తక్కువ వేతనం ఇస్తున్నారంటూ భారీగా జరుగుతున్న నిర్మాణ పనుల్ని మధ్యలో ఆపేసి నిరసన వ్యక్తం చేశారు. తగిన వేతనం ఇచ్చే వరకు పని చేయమని భీష్మించుకొని కూర్చుకున్నారు. సాధారణంగా ఆ కాలంలో అయితే ఎదురు తిరిగిన కార్మికులను చంపేసేవారు కానీ, అప్పటి రాజు కార్మికులతో చర్చించి వారికి వేతనం పెంచేశాడట. చరిత్రలో నమోదైన తొలి సమ్మె ఇదేనని చరిత్రకారులు చెబుతున్నారు.

అయితే సామాజిక.. ఆర్థిక పరిస్థితులు మారుస్తూ క్రీస్తుశకం 18వ శతాబ్దంలో యూరప్‌.. అమెరికాలో పారిశ్రామీకరణ మొదలైంది. అక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. 1830లో తొలిసారిగా పెద్ద ఎత్తున ప్రజలు పారిశ్రామిక కార్మికవర్గాల్లో సభ్యులుగా మారారు. 1838-1857 మధ్య కార్మికులంతా కలిసి తగిన వేతనం, ఓటు హక్కు, రాజకీయాల్లో అవకాశం కల్పించడంతో పాటు బ్రిటన్‌ రాజకీయాల్లో సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. కార్మికులు వారి బలమేంటో తెలిసిన తర్వాత వేతనం ఎక్కడ ఎక్కువ ఇస్తే అక్కడ పనిచేయడం మొదలుపెట్టారు. అయితే  1842లో పనికి తగ్గ వేతనం ఇవ్వాలంటూ ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశ్రమల్లో కార్మికులు సమ్మె చేశారట. అదే ఆధునిక పారిశ్రామీకరణలో తొలి సమ్మెగా చరిత్రకారులు అభివర్ణిస్తున్నారు. 19వ శతాబ్దం నాటికి సమ్మె పరిశ్రమల రంగంలో భాగమైంది. కార్మికులంతా సంఘాలుగా ఏర్పడి వారి యాజమాన్యంతో తమ డిమాండ్లపై చర్చించి పరిష్కరించుకుంటున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని