Updated : 10 Sep 2020 12:33 IST

నిజంగా మద్యం ఏరులై పారిందట.. తెలుసా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాధారణంగా ఏ ప్రాంతంలోనైనా మద్యం అమ్మకాలు బాగా పెరిగితేనో.. ఎన్నికల సమయంలో ఓటర్లకు భారీగా పంచితేనో.. మద్యం ఏరులై పారుతోందని అనడం సహజం. వినడమే గానీ.. ఇలాంటిది ఎప్పటికి జరిగేనో అని అనుకోవద్దు. ఎందుకంటే నిజంగానే ఓ సారి లండన్‌ నగరంలో మద్యం ఏరులై పారిందట. వరదగా మారి.. నగరంలోని పలు వీధులను ముంచెత్తిందట. పైగా భారీగానే ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చిందట. ఆ ఘటనను ‘లండన్‌ బీర్‌ ఫ్లడ్’గా ఇప్పటికీ అక్కడి ప్రజలు కథలుగా చెప్పుకుంటారు. అసలేం జరిగిందంటే?

అది 19వ శతాబ్దం ప్రారంభం. లండన్‌లో మెక్స్‌ అనే అతి పెద్ద మద్యం తయారీ కంపెనీ ఉండేది. 1809లో లండన్‌లోని టోటెన్‌హాం, ఆక్స్‌ఫర్డ్‌ వీధుల కూడలిలో ఉన్న హార్స్‌ షూ మద్యం తయారీ కంపెనీని.. హెన్రీ మెక్స్‌ కొనుగోలు చేశాడు. కలపతో 22 అడుగుల అతిపెద్ద మద్యం స్టోరేజీ ట్యాంక్‌ను ఏర్పాటు చేశాడు. మద్యం బరువు తట్టుకునేలా ట్యాంక్‌ చుట్టూ ఇనుప కడ్డీలను పెట్టించాడు. మెక్స్‌ తయారు చేసే మద్యం లండన్‌లో చాలా ఫేమస్‌. దీంతో భారీ మొత్తంలో మద్యం తయారు చేస్తుండేవారు. నాణ్యత కోసం ఎక్కువకాలం స్టోరేజీ ట్యాంకుల్లో నిలువ ఉంచేవారు. అయితే 1814 అక్టోబర్‌ 17న సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ట్యాంక్‌ చుట్టూ ఉంచిన ఇనుప కడ్డీల్లో ఒకటి జారీ ట్యాంక్‌కు లీకేజ్‌ ఏర్పడింది. కాసేపటికే ట్యాంక్‌ పేలడం, అందులోని మద్యం ఉద్ధృతికి కంపెనీలోని మరికొన్ని ట్యాంకులు కుప్పకూలడంతో దాదాపు 12లక్షల లీటర్ల మద్యం ఉవ్వెత్తున ఎగిసిపడింది. కంపెనీ గోడలు బద్దలు కొట్టుకొని 15 అడుగుల ఎత్తు అలలతో స్థానిక వీధుల్ని ముంచెత్తింది. 

మద్యం ధాటికి వీధుల్లోని పదుల సంఖ్యలో ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే వీధుల్లోని మద్యం ఏరులా ప్రవహించడం చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ఉచితంగా దొరుకుతోంది కదా అని అందరూ బకెట్లు, గిన్నెల్లో మద్యాన్ని నింపుకొని తాగడం, దాచుకోవడం చేశారు. దీంతో మరుసటి రోజునే అనేక మంది అస్వస్థతకు గురయ్యారు. ఒకరు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇందుకు వీధుల్లో ప్రవహించిన మద్యం విషపూరితంగా మారడమే కారణమట. ఈ ఘటనపై కేసు నమోదై.. కోర్టులో విచారణ జరిగింది. అయితే కోర్టు దీనిని ‘యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌’గా ప్రకటించి.. బాధితులకు కంపెనీ యాజమాన్యం ఎలాంటి నష్టపరిహారం ఇవ్వనక్కర్లేదని తీర్పు వెల్లడించింది. అంతేకాదు.. కంపెనీకి భారీగా నష్టం కలగడంతో స్థానిక ప్రభుత్వం కంపెనీ యాజమాన్యానికి ఆర్థిక సాయం చేయడం గమనార్హం.

ఆ తర్వాత కొద్ది రోజులకే మెక్స్‌ కంపెనీ తిరిగి మద్యం తయారీని ప్రారంభించింది. కానీ, 1921లో ఆ కంపెనీని మూసివేసి వేరే చోట ఏర్పాటు చేశారు. అయితే ఈ ఘటన తర్వాతే మద్యం తయారీ కంపెనీల్లో కలపతో చేసిన ట్యాంక్‌లకు బదులు కాంక్రీట్‌ ట్యాంక్‌లు ఏర్పాటు చేయడం మొదలుపెట్టారట.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని