Hyderabad: ఫార్మా రంగం సవాళ్లను అర్థం చేసుకోగలను: సీఎం రేవంత్‌రెడ్డి

రాష్ట్ర రాజధానిలో 21వ బయో ఆసియా - 2024 సదస్సు మంగళవారం ప్రారంభమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సదస్సులో పాల్గొన్నారు.

Updated : 27 Feb 2024 20:37 IST

హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో 21వ బయో ఆసియా - 2024 సదస్సు మంగళవారం ప్రారంభమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సదస్సులో పాల్గొన్నారు. జీవవైవిధ్య, సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులపై ఇందులో చర్చించనున్నారు. పరిశోధనలు చేస్తున్న అంకుర సంస్థలకు ప్రోత్సాహకాలు, చేయూతపై నిర్ణయాలు తీసుకోనున్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్‌ ఐటీ, సాఫ్ట్‌వేర్‌ రంగాల్లో అగ్రగామిగా ఉంది. కొవిడ్‌ అనంతరం ప్రజలు ఆరోగ్యంపై దృష్టి సారించారు. లైఫ్‌సైన్సెస్‌ రాజధాని మన నగరం అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచంలో మూడు కొవిడ్‌ వ్యాక్సిన్‌లు వచ్చాయి. వాటిలో ఒక వ్యాక్సిన్‌ను అందించిన ఘనత హైదరాబాద్‌కు దక్కింది. ఎన్నో పరిశోధనలకు నిలయంగా ఉంది మన భాగ్యనగరం. జాతీయ, అంతర్జాతీయ, స్టార్టప్‌ కంపెనీలకు ప్రోత్సాహం అందించడంతో పాటు ఎంఎస్‌ఎంఈలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఫార్మా రంగంలో సవాళ్లను నేను అర్థం చేసుకోగలను. ఇటీవల కొంత మంది ఫార్మా రంగ ప్రతినిధులతో సమావేశమయ్యా. ఈ రంగానికి బాసటగా నిలుస్తాం’’ అని భరోసా ఇచ్చారు.

 

పారిశ్రామికవేత్తలను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తాం: శ్రీధర్‌బాబు

ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణకు రూ.40వేల కోట్లకుపైగా పెట్టుబడులు వచ్చాయన్నారు. కొత్త ప్రభుత్వంపై పెట్టుబడిదారులకు ఉన్న నమ్మకానికి ఇదే నిదర్శనమని చెప్పారు. ‘‘పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సాహం అందిస్తుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా కొత్త జీవ వైద్య విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తాం. కేవలం పరిశ్రమల స్థాపనే కాకుండా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని ఉద్యోగాల కల్పన చేసే విధంగా పాలసీలను రూపొందిస్తాం. విద్యార్థులకు చదువుతోపాటు ఆయా రంగాల్లో నైపుణ్యం సాధించేలా తగిన శిక్షణ ఇచ్చే విధానం తెస్తాం. రాష్ట్రాన్ని నైపుణ్య శిక్షణ కేంద్రంగా మార్చేలా సీఎం రేవంత్‌రెడ్డి ప్రణాళిక సిద్ధం చేశారు

ఈ బయో ఆసియా సదస్సులో ఒక విదేశీ కంపెనీ, బయోలాజికల్‌ ఈ సంస్థ మధ్య ఒప్పందం కుదిరింది. 50 మిలియన్‌ డోసుల డెంగ్యూ వ్యాక్సిన్‌ కోసం ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. సోమవారం మరో రెండు ఫార్మా కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఐటీ రంగ అభివృద్ధికి తోడ్పడుతున్నట్లుగానే ఫార్మా, ఎంఎస్‌ఎంఈల అభివృద్ధికి కృషి చేస్తాం. ఫార్మా క్లస్టర్లు, ఫార్మా యూనిట్ల ఏర్పాటుకు సంసిద్ధంగా ఉన్నాం. ఒక్కోటి వెయ్యి నుంచి 2వేల ఎకరాల్లో 10 ఫార్మాక్లస్టర్లు ఏర్పాటు చేస్తాం. ఐటీ రంగంలో మారుతున్న పరిణామాలకు అనుగుణంగా లైఫ్‌ సైన్సెస్‌ పాలసీ తీసుకొస్తాం. మనకు మానవ వనరుల కొదువ లేదు. రాబోయే రోజుల్లో తెలంగాణ హ్యుమన్‌ రిసోర్స్‌ సెంటర్‌గా మారనుంది ’’అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని