Loksabha: కడప స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు సాధ్యం కాదు.. లోక్‌సభలో కేంద్రం వెల్లడి

విభజన సమస్యలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే పరిష్కరించుకోవచ్చని, తాము మధ్యవర్తిగా మాత్రమే వ్యవహరిస్తామని కేంద్ర హోంశాఖ మరోసారి స్పష్టం చేసింది.

Updated : 25 Jul 2023 16:45 IST

దిల్లీ: విభజన సమస్యలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే పరిష్కరించుకోవచ్చని, తాము మధ్యవర్తిగా మాత్రమే వ్యవహరిస్తామని కేంద్ర హోంశాఖ మరోసారి స్పష్టం చేసింది. విభజన చట్టంలోని వివిధ అంశాలపై తెదేపా ఎంపీలు రామ్మోహన్‌నాయుడు, కేశినేని నాని లోక్‌సభలో అడిగిన వివిధ ప్రశ్నలకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ లిఖితపూర్వకంగా జవాబిచ్చారు. మౌలిక వసతుల ప్రాజెక్టులు, ఉన్నత విద్యాసంస్థలు దీర్ఘకాలిక ప్రాజెక్టులని వెల్లడించారు. రూ.106 కోట్లతో సౌత్‌ కోస్ట్‌ రైల్వేజోన్‌ కార్యాలయం నిర్మిస్తామని, ఇందుకోసం 2023-24లో రూ.10కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. దుగరాజపట్నం పోర్టు ఏర్పాటు ప్రతిపాదన ఆచరణ సాధ్యం కాలేదన్నారు. సమీప పోర్టుల నుంచి ఉన్న తీవ్ర పోటీ వల్ల ఇది ఆచరణ సాధ్యం కాలేదన్నారు. రామాయపట్నం పోర్టును అభివృద్ధి చేయాలని ఏపీ ప్రభుత్వం సూచించిందన్నారు.

రామాయపట్నం నాన్‌- మేజర్‌ పోర్టుగా ఇప్పటికే నోటిఫై చేశారన్న కేంద్రం.. రామాయపట్నం మైనర్‌ పోర్టును డి-నోటిఫై చేయాలని ఏపీకి చెప్పామని కేంద్రం వెల్లడించింది. రామాయపట్నం వద్దంటే మేజర్‌పోర్టుకు మరో ప్రదేశం గుర్తించాలని కేంద్రం సూచించింది. కడప జిల్లాలో స్టీల్‌ప్లాంట్‌ సాంకేతికంగా, ఆర్థికంగా లాభదాయకం కాదని పేర్కొన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ఉక్కుశాఖ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసిందన్నారు. వర్సిటీలు, పోలవరం, రాజధానికి రూ. 21,154 కోట్లు ఇచ్చామని కేంద్రం స్పష్టం చేసింది. ఐఐటీకి రూ.1,022 కోట్లు, ఐసర్‌కు రూ.1,184 కోట్లు విడుదల చేశామని నివేదికలో పేర్కొంది. ఎయిమ్స్‌కు రూ.1,319 కోట్లు, గిరిజన వర్సిటీకి రూ.24కోట్లు, వ్యవసాయ వర్సిటీకి రూ.135 కోట్లు, రాజధాని నిర్మాణానికి రూ.2,500 కోట్లు, పోలవరానికి రూ.14,969 కోట్లు విడుదల చేశామని స్పష్టం చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని