Krishnapatnam: పరిశీలనకు వైద్యుల బృందం!

కృష్ణపట్నంలోని ఆనందయ్య కరోనా మందును స్వయంగా పరిశీలించేందుకు కేంద్ర ఆయుర్వేదిక్‌ పరిశోధనాసంస్థ వైద్యులు సిద్ధమయ్యారు

Published : 23 May 2021 01:29 IST

నెల్లూరు: కృష్ణపట్నంలోని ఆనందయ్య కరోనా మందును స్వయంగా పరిశీలించేందుకు కేంద్ర ఆయుర్వేదిక్‌ పరిశోధనా సంస్థ వైద్యులు సిద్ధమయ్యారు. సోమవారం వైద్యుల బృందం కృష్ణపట్నంలో పర్యటించనుంది. మరోవైపు, ఆనందయ్యకు అదనపు భద్రత కల్పించారు. ఆయన వైద్యంపై గ్రామస్థులు పూర్తి విశ్వాసం ప్రకటించారు. సక్రమంగా వాడితే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు. శాస్త్రీయంగా ఆమోద ముద్ర లభించేవరకూ ఓపిక పట్టాలని జన విజ్ఞానవేదిక, ప్రజా ఆరోగ్య వేదిక సూచిస్తున్నాయి.

సంచలనంగా మారిన నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందును ఆయుష్‌ శాఖ, ఐసీఎంఆర్‌ పరిశోధనలు చేస్తున్నాయి. ఈ మందుపై శాస్త్రీయ నిర్ధారణ కోసం కేంద్ర ఆయుర్వేదిక్‌ పరిశోధనా సంస్థ వైద్యులు సోమవారం కృష్ణపట్నం వస్తున్నారు. వారు స్వయంగా మందును పరిశీలించి అధ్యయనం చేసి ఇచ్చిన నివేదిక ఆధారంగా కరోనా మందును పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం మందు పంపిణీ పూర్తిగా ఆగిపోయింది.

ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేదం మందుపై పూర్తి నమ్మకం ఉందని గ్రామస్థులు మరోసారి స్పష్టంచేశారు. తమ గ్రామంలో కరోనా లేదని, ఆనందయ్య మందువల్లే సాధ్యమైందని చెబుతున్నారు. ప్రభుత్వం అనుమతిస్తే ప్రజలందరికీ పంపిణీ చేస్తామని అంటున్నారు. మరోవైపు, శాస్త్రీయత, సామర్థ్యం నిరూపణ అయ్యేంతవరకు కృష్ణపట్నం ఔషధ పంపిణీని నిలిపివేయాలని జన విజ్ఞాన వేదిక, ప్రజా ఆరోగ్య వేదిక సభ్యులు కోరారు. నిబంధనలు పాటించకుండా మందు పంపిణీ చేసి కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారని ఆరోపిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని