ఆర్థిక సంక్షోభంలోనూ రుణమాఫీ చేశాం:కేటీఆర్‌

కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం నెలకొన్నప్పటికీ రైతులకు రూ. 1,200 కోట్ల మేర రుణమాఫీ చేశామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి

Updated : 26 May 2020 15:08 IST

ముస్తాబాద్‌ (సిరిసిల్ల): కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం నెలకొన్నప్పటికీ రైతులకు రూ. 1,200 కోట్ల మేర రుణమాఫీ చేశామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రులు నిరంజన్‌ రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌తో కలిసి కేటీఆర్‌ పర్యటించారు. జిల్లాలోని ముస్తాబాద్‌లో రైతువేదిక, రాచర్లగొల్లపల్లిలో వ్యవసాయ గోదాం నిర్మాణానికి వారు శంకుస్థాపన చేశారు. అనంతరం కేటీఆర్‌ ప్రసంగిస్తూ.. మార్చి, ఏప్రిల్‌ నెలలలో రాష్ట్ర ఆదాయం 95 శాతం మేర తగ్గిందన్నారు. వానాకాలం సాగు కోసం విత్తనాలు అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. ప్రజల కష్టాలు తెలిసిన నేత కేసీఆర్‌ అని.. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వారి కష్టాలు తీర్చారన్నారు. వ్యవసాయానికి రాష్ట్రంలో 24 గంటల నిరంతర విద్యుత్‌ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని కేటీఆర్‌ తెలిపారు. ఎరువులు, విత్తనాలు ముందస్తుగా తీసుకొచ్చి రైతులు క్యూలైన్లలో నిలబడే అవసరం లేకుండా చర్యలు తీసుకున్నట్లు కేటీఆర్‌ తెలిపారు. 

‘‘రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2.5 లక్షల ఎకరాలకు దసరా నాటికి కాల్వల ద్వారా నీరందిస్తాం. పిల్ల కాల్వల ద్వారా గ్రామాల్లో పదెకరాల భూమి పోతుంది. పది మంది రైతులు భూమి కోల్పోతే వంద మంది అన్నదాతలకు ప్రయోజనం చేకూరుతుంది. రైతులందరికీ న్యాయం చేస్తాం. గోదావరి జలాలతో సిరిసిల్లను సుందర పట్టణంగా తీర్చిదిద్దుతాం. మద్దతు ధర లేని పంటలు వేయొద్దని సీఎం చెబుతున్నారు. మద్దతు ధర వచ్చే పంటలు వేస్తేనే రైతులు బాగుపడతారన్నదే సీఎం ఆకాంక్ష. ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ధాన్యం కొంటున్నాం. గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. సిరిసిల్ల జిల్లాలో 6 మీటర్ల మేర భూగర్భజలాలు పెరిగాయి’’ అని కేటీఆర్ వివరించారు.

కాంగ్రెస్‌ నేతలది అనవసర రాద్ధాంతం..

‘‘కాంగ్రెస్‌ నేతలు పోతిరెడ్డిపాడుపై గగ్గోలు పెడుతున్నారు.  పోతిరెడ్డిపాడు జీవో ఇచ్చింది రాజశేఖర్‌ రెడ్డి ప్రభుత్వం కాదా? ఆ రోజు కళ్లప్పగించి చూసింది ఈ కాంగ్రెస్‌ నేతులు కాదా?ఈ రోజున పోతిరెడ్డిపాడుపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. ప్రపంచంలో అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం. ఎండాకాలంలో నీళ్లు అందిస్తున్న కాళేశ్వరంపైనా విమర్శలు చేస్తున్నారు. రైతులకు అన్యాయం చేసే పని సీఎం కేసీఆర్ చేయరు.. ఎవరినీ చేయనివ్వరు. రైతులను రాజు చేయాలన్నదే కేసీఆర్‌ ఆలోచన. విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినప్పుడు మొదట విమర్శిస్తారు. మనమంతా సంఘటితమై విజయం సాధిస్తే అందరూ మనవెంటే వస్తారు’’ అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని