అమెరికాకు యథేచ్ఛగా బర్మా టేకు

మయన్మార్‌లో పౌర ప్రభుత్వాన్ని కూల్చివేసి అధికార పగ్గాలు చేపట్టిన సైన్యాన్ని ఆంక్షల పిడికిలిలో బిగించడంలో అమెరికా విఫలమవుతోంది.

Published : 12 Jan 2022 11:24 IST

సైనిక సర్కారుకు అగ్రరాజ్య కంపెనీల నిధులు

దిల్లీ: మయన్మార్‌లో పౌర ప్రభుత్వాన్ని కూల్చివేసి అధికార పగ్గాలు చేపట్టిన సైన్యాన్ని ఆంక్షల పిడికిలిలో బిగించడంలో అమెరికా విఫలమవుతోంది. ఆ దేశంతో వ్యాపార లావాదేవీలు జరపకుండా తమ సంస్థలను నిలువరించలేకపోతోంది. ప్రధానంగా మయన్మార్‌ నుంచి అగ్రరాజ్యానికి టేకు దిగుమతులు యథేచ్ఛగా కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆ ఎగుమతుల ద్వారా భారీగా సొమ్ము దక్కుతుండటంతో సైనిక ప్రభుత్వం ధీమాగా ఉంటోందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ప్రపంచంలోకెల్లా అత్యుత్తమ టేకు మయన్మార్‌లో దొరుకుతుందని చెబుతుంటారు. అమెరికాలో విహార నౌకల నిర్మాణంలో ఈ బర్మా టేకును ఎక్కువగా వినియోగిస్తుంటారు. అయితే- మయన్మార్‌లో గత ఏడాది ఫిబ్రవరి 1న సైన్యం అధికార పగ్గాలు చేపట్టాక.. దేశంలో అంతర్యుద్ధం తరహా పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నందుకుగాను మయన్మార్‌ సైనిక సర్కారుపై అమెరికా గత ఏడాది ఏప్రిల్‌ 21న ఆంక్షలు ప్రకటించింది. ఆ దేశంతో తమ వాణిజ్య సంబంధాలను స్తంభింపజేయనున్నట్లు స్పష్టం చేసింది. కానీ ఆ మాటలు నీటి మీద రాతలుగానే మిగిలిపోతున్నాయని ‘జస్టిస్‌ ఫర్‌ మయన్మార్‌’ అనే సంస్థ తాజాగా పేర్కొంది. ఆ సంస్థ చెబుతున్న వివరాల ప్రకారం.. గత ఏడాది ఫిబ్రవరి 1 నుంచి నవంబరు 30 వరకు అగ్రరాజ్య కంపెనీలు 1,600 టన్నుల మేర బర్మా టేకును తెప్పించుకున్నాయి. వాస్తవానికి మయన్మార్‌లో టేకు విక్రయాలను ప్రభుత్వరంగ సంస్థ అయిన ‘మయన్మార్‌ టింబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (ఎంటీఈ)’ చూసుకుంటుంది. ప్రైవేటు కంపెనీలకు కలపను అదే అమ్ముతుంది. అమెరికా కంపెనీలు ఎంటీఈని నేరుగా సంప్రదించకుండా.. మధ్యవర్తుల ద్వారా టేకును తెప్పించుకుంటున్నాయి. తద్వారా అక్కడి సైనిక ప్రభుత్వానికి నిధులు సమకూరుస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని