వెంకన్న కొండనూ వదల్లేదు!

పెదకూరపాడు నియోజకవర్గంలో మట్టి అక్రమ తవ్వకాలకు అడ్డూ అదుపులేకుండా పోయింది. ఎక్కడ మట్టి ఉంటే అక్కడ ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధి అండతో

Updated : 29 Mar 2023 05:49 IST

అమరావతి, న్యూస్‌టుడే

కొండను తవ్వేశారిలా..

పెదకూరపాడు నియోజకవర్గంలో మట్టి అక్రమ తవ్వకాలకు అడ్డూ అదుపులేకుండా పోయింది. ఎక్కడ మట్టి ఉంటే అక్కడ ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధి అండతో అనుచరులు నిన్నటి వరకు కృష్ణమ్మ నదీ గర్భంలో తవ్వకాలు జరిపి ఇసుక రీచ్‌లకు బాటలు వేయగా.. ఇప్పుడు కలియుగ వైకుంఠవాసుడు స్వయంభూగా కొలువై భక్తులచే పూజలందుకుంటున్న వైకుంఠపురంలోని వెంకన్న కొండనూ కొల్లగొడుతున్నారు. వైకుంఠపురం ఇసుక రీచ్‌లో బాటలు వేసేందుకు మట్టి తరలిస్తున్నారు. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే కొండను తవ్వేస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు. అధికార పార్టీ నాయకుల తీరుపైనా తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

కొండ మట్టితోనే బాటలు, వంతెనలు

ఉత్తర వాహిణిగా పేరుగాంచిన కృష్ణానది చెంతన కొండకు పశ్చిమ దిక్కులో సుమారు 100 అడుగుల లోతు, 200 అడుగుల మేర వెడల్పులో రాత్రివేళల్లో పొక్లెయిన్‌తో తవ్వి వందల సంఖ్యలో లారీల్లో  మట్టిని ఇసుక రీచ్‌కు తరలిస్తున్నారు. మట్టి తవ్వకాల సందర్భంగా కొండ నుంచి వచ్చిన పెద్ద బండలను కృష్ణానదిలోకి నెట్టి వేస్తున్నారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా యథేచ్ఛగా కొండను తవ్వి, నదిలో సుమారు మూడు కిలోమీటర్ల మేర బాటలు, మట్టి వంతెన నిర్మించడానికి మట్టిని ఉపయోగిస్తున్నారు. ఈ బాటలు, వంతెనల మీదుగా భారీ వాహనాల్లో ఇసుక తరలిస్తున్నారు.

కొండ నుంచి తవ్విన మట్టితో కృష్ణానదిపై నిర్మించిన  వంతెనపై వెళుతున్న ఇసుక లారీలు


గ్రామస్థుల భయాందోళన

దేవుడి కొండను తవ్వడంపై గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తవ్వకాలను అడ్డుకుంటే అక్రమ కేసులు బనాయిస్తారన్న భయంతో నోరు మెదపలేక పోతున్నామని వారు పేర్కొంటున్నారు. కృష్ణానదికి వచ్చే వరదల నుంచి కొన్ని వందల గ్రామాలను ఈ కొండ కాపాడుతుందని, దాన్ని కరిగిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయని చెబుతున్నారు. ఈ విషయమై ఆర్డీఓ రాజకుమారిని ‘న్యూస్‌టుడే’ వివరణ అడగ్గా ఏ కొండకు మట్టి తవ్వాలన్నా రెవెన్యూ అనుమతి తప్పనిసరి అన్నారు. తహసీల్దార్‌ అనుమతి ఇచ్చారేమో తెలుసుకుంటామన్నారు. అనుమతి లేకపోతే తవ్వకాలను అడ్డుకుంటామని ఆమె పేర్కొన్నారు. దీనిపై తహసీల్దారు విజయశ్రీని అడగ్గా మట్టి తవ్వకానికి ఎలాంటి అనుమతి ఇవ్వలేదని, విచారించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని