KTR: రానున్న రోజుల్లో ప్రపంచదేశాలకు భారత్‌ దిక్సూచి: కేటీఆర్

విభిన్న మతాలు, కులాలు, సంప్రదాయాల కలయికగా ఉన్న భారత్‌ దేశభక్తి విషయంలో అంతా ఐక్యంగా ఉంటారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు.

Published : 14 Aug 2022 18:58 IST

హైదరాబాద్‌: విభిన్న మతాలు, కులాలు, సంప్రదాయాల కలయికగా ఉన్న భారత్‌లో.. దేశభక్తి విషయంలో అంతా ఐక్యంగా ఉంటారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించిన భారత్‌.. రానున్న రోజుల్లో ప్రపంచదేశాలకు దిక్సూచిగా ఉంటుందని ఆకాంక్షించారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సబ్‌ ఏరియా హెడ్‌ క్వార్టర్స్‌ సైనికులు రెండు రోజులపాటు నిర్వహించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాలి నొప్పితో బాధపడుతున్న కేటీఆర్.. మూడు వారాల తర్వాత ఈ కార్యక్రమానికి హాజరై సుమారు గంటన్నరపాటు గడిపారు. దేశభక్తి గీతాలకు సైనిక బృందాల నృత్యాలు, సాంస్కృతిక వేడుకలను వీక్షించారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అమరులైన సైనికుల కుటుంబాలకు మహావీర్ పురస్కారాలను అందజేసి గౌరవించారు.

దేశ, రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ 75వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వివిధ దేశాల పర్యటనలో తరచూ తనకు ఎదురయ్యే ప్రశ్నను గుర్తుచేస్తూ భారత్ ప్రపంచ దేశాలకు ఏ మాత్రం తీసుపోనిదన్నారు. ప్రపంచ దేశాలతో మనదేశాన్ని పోల్చలేమని పేర్కొన్న కేటీఆర్.. భారత్ గొప్ప దేశమని కొనియాడారు. దక్షిణ భారత్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ లెప్టినెంట్ జనరల్ ఎ.అరుణ్, తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ సబ్ ఏరియా కమాండర్ రంజిత్ సింగ్ మన్రాల్, స్టేషన్ కమాండర్ కంటోన్మెంట్ బ్రిగేడియర్ సోమశేఖర్‌లు ఈ సందర్భంగా కేటీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు