Corona: నిబంధనలు పాటిస్తేనే మూడో దశ కట్టడి..

దేశంలో కరోనా కేసుల తీవ్రత తగ్గుముఖం పడుతుండటంతో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ నిబంధనలను సడలిస్తున్నాయి. దీంతో మార్కెట్లు, వాణిజ్య సముదాయాలలో సందడి మొదలైంది.

Published : 21 Jun 2021 00:41 IST

దిల్లీ: దేశంలో కరోనా కేసుల తీవ్రత తగ్గుముఖం పడుతుండటంతో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ నిబంధనలను సడలిస్తున్నాయి. దీంతో మార్కెట్లు, వాణిజ్య సముదాయాలలో సందడి మొదలైంది. ఈ నేపథ్యంలో భౌతిక దూరం, మాస్కు ధరించడం వంటి కొవిడ్‌ నిబంధనలు పాటించకపోతే రాబోయే రోజుల్లో వైరస్‌ ఉత్పరివర్తనాల వ్యాప్తిని అడ్డుకోలేమని ఎయిమ్స్‌ వైద్యులు డాక్టర్‌ నీరజ్‌ నిశ్చల్ చెప్పారు. ప్రస్తుత సంక్షోభం వైరస్‌ సంబంధమైన, మానవ సంబంధమైన అనే రెండు ముఖ్యమైన అంశాలపై ఆధారపడి ఉందని అన్నారు. వైరస్‌లో ఉత్పతరివర్తనాల అంశం ఎవరి చేతుల్లో లేదని, సరైన నిబంధనలు పాటించడం ద్వారానే కరోనా కేసులు తగ్గించగలమని డాక్టర్ నీరజ్‌ తెలిపారు.  

‘‘ప్రస్తుతం ఉన్న వైరస్ ఉత్పరివర్తనాలు త్వరగా వ్యాప్తిచెందగలవు. వాటిని నియంత్రిచడం సాధ్యంకాదు. అయితే సరైన నిబంధనలు పాటిస్తే వాటిని మన శరీరాల్లో ఉత్పరివర్తనం చెందకుండా అడ్డుకోవచ్చు. మన ప్రవర్తన ద్వారానే దానిని నియంత్రిచగలం. గత 15-16 నెలలుగా కొవిడ్‌-19 ప్రవర్తన నియమావళి గురించి మనం మాట్లాడుతున్నాం. అందరం కలిసికట్టుగా మాత్రమే ఈ మహమ్మారి అడ్డుకోగలం. రెండో దశలో కూడా ఇదే జరిగింది’’ అని డాక్టర్‌ నీరజ్‌ తెలిపారు.   

లాక్‌డౌన్‌ విధించి, ప్రతిఒక్కరు కొవిడ్‌-19 నిబంధనలు పాటించేలా చేయడం ద్వారానే రెండో దశ వ్యాప్తిని అడ్డుకున్నట్లు వెల్లడించారు. అలానే టీకా ప్రక్రియ కూడా వైరస్‌ వ్యాప్తి, తీవ్రత నుంచి రక్షణ కల్పించగలదని అన్నారు. ఆదివారం నాటికి దేశంలో 58 వేల కరోనా కేసుల నమోదయ్యాయి. 81 రోజుల తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో కేసులు నమోదకావడం ఇదే తొలిసారి. శనివారంనాడు ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్‌ గులేరియా మాట్లాడుతూ కొవిడ్‌-19 నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తే వైరస్‌ మూడో దశ ప్రభావం ఆరు నుంచి ఎనిమిది వారాలు ఉంటుందని అన్నారు. ఇందుకోసం మనమంతా కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని