Warangal: ప్రీతి ఆత్మహత్య కేసు.. పారదర్శకంగానే దర్యాప్తు: తండ్రి నరేందర్‌

వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కేసు దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుందని ఆమె తండ్రి నరేందర్‌ తెలిపారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని సీపీని కలిసి  కోరానని చెప్పారు.

Published : 22 Apr 2023 16:48 IST

వరంగల్‌: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాకతీయ వైద్య కళాశాల విద్యార్థిని డాక్టర్‌ ధారావత్‌ ప్రీతి ఆత్మహత్య కేసుపై పూర్తి నమ్మకం కలిగిందని ఆమె తండ్రి నరేందర్‌ తెలిపారు. ఈ మేరకు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ రంగనాథ్‌ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసుపై నెలకొన్న సందేహాలను నివృత్తి చేసుకున్నానన్నారు. పోస్టుమార్టం నివేదికపై వివరాలను సీపీని అడిగి తెలుసుకున్నానని చెప్పారు. కేసు దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుందన్నారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని సీపీని కోరినట్లు నరేందర్‌ తెలిపారు.

‘‘కేసుపై ఉన్న సందేహలను సీపీని అడిగి తెలుసుకున్నాను. ప్రీతిది ఆత్మహత్యే అని చెబుతున్నారు. దీనికి సంబంధించి కొన్ని ఆధారాలను కూడా చూపించారు. త్వరలో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేస్తామని చెప్పారు’’ అని ప్రీతి తండ్రి నరేందర్‌ మీడియాకు వెల్లడించారు.

ప్రీతి మృతి కేసులో కీలకమైన పోస్టుమార్టం నివేదిక వివరాలను వరంగల్‌ సీపీ ఏవీ రంగనాథ్‌ శుక్రవారం వెల్లడించారు. గతంలో ప్రీతి రక్తనమూనాల్లో కూడా ఎలాంటి ఆనవాళ్లు కనిపించకపోవడంతో ఆమె మృతిపై ఇన్నాళ్లూ స్పష్టత రాలేదు. 50 రోజుల తర్వాత పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ప్రీతిది ఆత్మహత్యేనని పోలీసులు స్పష్టం చేశారు. కాగా తాజా నివేదికను రుజువుగా చూపి సైఫ్‌ వేధింపుల వల్లే ప్రీతి బలవన్మరణానికి పాల్పడిందనే కోణంలో పోలీసులు న్యాయస్థానంలో త్వరలో అభియోగ పత్రం (ఛార్జ్‌షీట్) దాఖలు చేయనున్నారు. ఇటీవల నిందితుడు సైఫ్‌కు బెయిల్‌ మంజూరైన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని