MLAs Bribery case: నందూ, సింహయాజీతో కలిసి ఎక్కడెక్కడ తిరిగారు?: శ్రీనివాస్‌ను ప్రశ్నించిన సిట్‌

ఎమ్మెల్యేలకు ఎర కేసు వ్యవహారంలో సిట్‌ దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగా నందకుమార్‌, సింహయాజీతో కలిసి ఎక్కడెక్కడ ప్రయాణం చేశారో చెప్పాలని న్యాయవాది శ్రీనివాస్‌కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు.

Updated : 24 Nov 2022 19:31 IST

హైదరాబాద్‌: ఎమ్మెల్యేలకు ఎర కేసు వ్యవహారంలో న్యాయవాది శ్రీనివాస్‌ను విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) అతనికి నోటీసులు జారీ చేసింది. నందకుమార్‌, సింహయాజీతో కలిసి ఎక్కడెక్కడ ప్రయాణం చేశారో చెప్పాలని సిట్ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. నందకుమార్‌ వద్ద శ్రీనివాస్‌ రూ.55 లక్షలు అప్పు తీసుకున్నట్లు తెలిపిన సిట్‌ అధికారులు.. ఆ అప్పుకు సంబంధించి నెలకు రూ.1.10 లక్షలు వడ్డీ చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. వడ్డీ చెల్లించడానికి వాడిన గూగుల్‌ పే, ఫోన్‌ పే వివరాలు సమర్పించాలని ఆదేశించారు. ఎక్కడికి వెళ్లినా తనకు నందూనే టికెట్లు బుక్‌ చేస్తారని శ్రీనివాస్‌ చెప్పగా.. నందూ, సింహయాజితో ఎక్కడెక్కడ ప్రయాణించారో చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నందకుమార్‌ బుక్‌ చేసిన విమాన టికెట్ల వివరాలు ఇవ్వాలన్నారు. రేపు విచారణకు హాజరుకావాలని.. వచ్చేటప్పుడు పలు వివరాలు తీసుకురావాలని సిట్‌ అధికారులు ఆదేశించారు. 

ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఈనెల 21, 22న న్యాయవాది శ్రీనివాస్‌ సిట్ విచారణకు హాజరయ్యారు. ఈనెల 21న తన శాంసంగ్ ఫోన్‌ను సిట్ అధికారులకు అప్పగించారు. జులై వరకు వాడిన మరో ఫోన్‌ అప్పగించాలని శ్రీనివాస్‌కు స్పష్టం చేశారు. పాత ఫోన్‌ పగిలినందున జూన్‌ 1న కొత్త ఫోన్‌ కొన్నట్టు సిట్‌ అధికారులకు తెలిపారు. ఓ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా విమాన టికెట్లు బుక్‌ చేసినట్లు పేర్కొన్నారు. సిట్‌కు అప్పగించిన మొబైల్‌ ఫోన్లోనే ట్రావెల్ ఏజెన్సీ వివరాలు ఉన్నాయని తెలిపారు. శ్రీనివాస్‌, ఆయన భార్య బ్యాంకు ఖాతాల వివరాలు, పాస్‌ పోర్టు ఇవ్వాలని సిట్‌ అధికారులు ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని