Venkaiah Naidu: మీ అంకిత భావమే.. నా విజయాలకు కారణం: వెంకయ్యనాయుడు

50 ఏళ్ల ప్రజా జీవితంలో తనతోపాటు వివిధ హోదాల్లో కలిసి పని చేసిన వారందరితో కలిసి భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విశాఖలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 

Published : 23 Jun 2023 17:46 IST

విశాఖపట్నం: భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టారు. తన 50 ఏళ్ల ప్రజా జీవన ప్రస్థానాన్ని పురస్కరించుకొని.. గతంలో తన దగ్గర వివిధ హోదాల్లో సేవలు అందించిన వారితో ప్రత్యేక ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అటెండర్ నుంచి ఐఏఎస్‌ అధికారి వరకూ అందర్నీ సత్కరించారు. విశాఖపట్నంలోని ఏ-1 కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గతంలో ఆయన దగ్గర పని చేసిన వ్యక్తిగత సహాయకుల నుంచి ప్రభుత్వాధికారుల వరకు అందరూ హాజరయ్యారు. ప్రతి ఒక్కరినీ పేరుపేరునా పలకరించిన వెంకయ్యనాయుడు.. కార్యక్రమానికి వచ్చిన వారందర్నీ ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. గత 50 ఏళ్లుగా తన సతీమణి ఉష సహకారంతో పాటు.. వివిధ హోదాల్లో తనతో పాటు కలిసి పని చేసిన సిబ్బంది అంకితభావమే తన విజయాలకు కారణమని పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు, వివిధ వృత్తుల్లో స్థిరపడిన వారెవరైనా సేవాభావంతో ముందుకు సాగాలని ఆయన అన్నారు. సమయపాలన, క్రమశిక్షణ, బృంద స్ఫూర్తి, సేవాభావం, అంకితభావం, పరిపూర్ణ దృష్టి, నీతి, రీతి తదితర ఎనిమిది గుణాలు జీవితంలో ఉన్నతిని కల్పిస్తాయని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఏ రంగంలో ఉన్నా, ఏ స్థాయిలోఉన్నా.. సేవా భావాన్ని మాత్రం మరవకూడదని సూచించారు. సమావేశానికి వచ్చిన వారందరికీ భారతీయ సంప్రదాయం ప్రకారం..నూతన వస్త్రాలు అందజేశారు. అనంతరం తెలుగువారి సంప్రదాయ వంటకాలతో వారికి ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారి మనవడు, మనువరాళ్లు కలిసి వెంకయ్యనాయుడు జీవిత విశేషాలతో రూపకల్పన చేసిన యాప్, వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు.

అంతకుముందు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. తాను వెంకయ్యనాయుడి ప్రియ శిష్యుడినని గుర్తు చేసుకున్నారు. ఆయన దగ్గర పని చేస్తే, జీవితంలో ఏదైనా సాధించవచ్చని, ఆయన తర్ఫీదు అలా ఉంటుందని కొనియాడారు. వెంకయ్యనాయుడు దంపతులు తనను ఓ కొడుకులా చూసుకునే వారని, వాళ్ల పుత్రవాత్సల్యం మరువలేనిదని అన్నారు. తాను అనారోగ్యానికి గురైనప్పుడు వారు అండగా ఉన్న విషయాన్ని గుర్తు చేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని కార్యక్రమంలో పాల్గొన్న వారంతా హర్షం వ్యక్తం చేశారు. ఆయన ప్రేరణతో సేవాభావాన్ని కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వెంకయ్యనాయుడి కుటుంబ సభ్యులతో పాటు భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్, ఐఏఎస్‌ అధికారులు ఐవీ సుబ్బారావు, రజత్ భార్గవ్, కృష్ణ కిశోర్, సురేష్, యువరాజ్, ప్రశాంత్ కుమార్ రెడ్డి, రాజ్యసభలో సేవలందించిన రామాచార్యులు, ఎ.ఎ.రావు సహా పలువురు ప్రభుత్వ అధికారులు, వెంకయ్యనాయుడి పూర్వ, ప్రస్తుత వ్యక్తిగత సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని