Healthy Morning: లేవగానే ఇవి చేస్తే.. లైఫ్‌ ఫుల్ ఆరోగ్యం!

ఉదయాన్నే కొన్ని పనులను ప్రతిరోజూ అనివార్యంగా చేస్తే మన స్వల్ప, దీర్ఘకాలిక ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావం చూపుతా..

Updated : 20 Feb 2022 11:43 IST

ఉదయం ఎలా గడిస్తే రోజంతా అలాగే ఉంటుందన్నది చిన్నప్పటి నుంచి వింటున్న మాటే. అందువల్లే మన పెద్దలు సూర్యోదయానికి ముందే పనులన్నీ చక్కబెట్టే వారు. అయితే, ఉదయాన్నే కొన్ని పనులను ప్రతిరోజూ అనివార్యంగా చేస్తే మన స్వల్ప, దీర్ఘకాలిక ఆరోగ్యంపై మంచి ప్రభావం చూపుతాయంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..!

వాటర్‌తో వండర్స్‌: ఉదయాన్నే ఒకటి లేదా రెండు గ్లాసుల నీళ్లు తాగటం చిన్న అలవాటే. కానీ, ఆరోగ్యం విషయంలో ఇది ప్రభావంతమైనది. శరీరంలో హైడ్రేషన్‌ పెంచే నీటితో రోజువారీ జీవక్రియను ప్రారంభిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అదనపు శక్తిని పెంచుకోవడానికి అప్పుడప్పుడు నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగితే మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయి.

ధ్యానంతో సృజన: రోజు ధ్యానానికి ఓ 10 నిమిషాలు కేటాయించడం ద్వారా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. మరింత సృజనాత్మకతను పెంచుకోవడానికి ధ్యానం, ప్రాణాయామం ప్రతిఒక్కరికీ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీర్ఘశ్వాస తీసుకోవడం వంటి ప్రాణాయామంతో గుండె ఆరోగ్యాన్నీ కాపాడుకోవచ్చు. ధాన్యమే కాకుండా మానసిక ప్రశాంతత కోసం డైరీ రాయడం అలవాటు చేసుకోండి. ఇవాళ ఏం చేయాలనుకుంటున్నారో ఆ పనులను ముందే షెడ్యూల్‌ చేసుకుంటే.. లక్ష్య సాధనలో ముందుంటారు. మరి ముఖ్యంగా ఉదయం సూర్యరశ్మి తగిలేలా చూసుకోండి.

వ్యాయామం: శరీరానికి శ్రమను తప్పనిసరిగా అలవాటు చేయాలి. ఇందుకు వ్యాయామమే చక్కటి మార్గం. పొద్దున్నే భారీ బరువులు ఎత్తేయకుండా ఆహారానికి తగ్గ వ్యాయామం చేయండి. శరీరంలో రక్త ప్రసరణ పెరిగేలా స్ట్రెచింగ్‌ ఎక్సర్సైజ్‌లు చేయాలి. పైగా వ్యాయామం మనం ఏ పనినైనా చేయగలమనే ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది.

అల్పాహారంతో స్థూలకాయానికి చెక్‌: ఉదయం ప్రోటీన్స్‌తో నిండిన అల్పాహారం తీసుకుంటే స్థూలకాయానికి గురయ్యే అవకాశం తక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అల్పాహారం రోజంతటికి శక్తినివ్వడమే కాకుండా జీవక్రియను నిలకడగా పనిచేసేలా చూస్తుంది. కాబట్టి తప్పనిసరిగా బ్రేక్‌ఫాస్ట్‌ తినడం అలవాటు చేసుకోవాలి. మరోవైపు లంచ్‌ బాక్స్‌ను స్వయంగా ప్యాక్‌ చేసుకోవడం ద్వారా ఆహార నియంత్రణ పాటించవచ్చు. తద్వారా ఆహార వృథాను అరికట్టవచ్చు. 

కొంచం ఇష్టంగా: ఇష్టపడే వ్యక్తులతో కొంత సమయాన్ని ఉదయంపూట గడపడం మరి మంచిది. ఈ మేరకు కుటుంబంతో కలిసి టిఫిన్‌ తినడం, స్నేహితులతో కలిసి వ్యాయామం ప్లాన్ చేసుకోవడం, నవ్వించే వ్యక్తులతో ఇంటరాక్ట్ అవ్వడం చేయవచ్చు. అలాగే వృత్తిపరంగా ఏ పని చేస్తున్నా ప్రతిఒక్కరిలో ఎదో ఒక అభిరుచి దాగే ఉంటుంది. బొమ్మలు గీయడం, రాయడం, చదవడం, కొత్తవి నేర్చుకోవడం వంటి అభిరుచులను పొద్దున్నే పెట్టుకుంటే మీకూ ఉల్లాసంగా ఉంటుంది. రోజు కొత్త విషయాలు తెలుసుకోవడానికి పేపర్‌ చదవడం మంచి అలవాటు.

లేవగానే ఎందుకు?: నిద్ర లేవగానే ముందుగా మొబైల్‌ను పట్టుకోవడం అందరికీ ఇప్పుడు పరిపాటిగా మారింది. ఉదయాన్నే ఇతరుల స్టేటస్‌, టెక్స్ట్‌లు చూడటం వల్ల మీరు ఒత్తిడికి గురయ్యే అవకాశం చాలా ఎక్కువ. పైగా ఇతరుల ఆలోచనలు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. మీ వ్యక్తిగత అభిప్రాయాలు, ఆలోచనలు పక్కదారి పడతాయి. కాబట్టే ఉదయం వీళైనంత సమయం మొబైల్‌కు దూరంగా ఉండండి.  

మరిన్ని: ప్రతికూల ఆలోచనల (నెగెటివ్ థాట్స్‌)తో రోజును అసలు ప్రారంభించవద్దు. ఏదైనా చేయగలమనే దృక్పథంతోనే ఉండండి. లేవగానే దుప్పటి మడత పెట్టి, బెడ్ సరి చేయండి. తద్వారా బద్ధకాన్ని పడక వద్దే వదిలిన వారవుతారు.

ఇక చివరగా: లైఫ్‌లో సక్సెస్‌కు ఉదయం నిద్ర లేవడం కూడా ఓ కారణమే. కాబట్టి మీ షెడ్యూల్‌కు అనుగుణంగా తొందరగా నిద్ర లేవడం అలవాటు చేసుకోండి. పై పనులన్నింటినీ ఉదయం 8 గంటలలోపే చేస్తే.. మీ ఆరోగ్య విజయాన్ని, లక్ష్యాలను ఎవరూ ఆపలేరు. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని