Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి

Published : 24 Oct 2021 17:02 IST

1.బద్వేల్‌ ఉపఎన్నిక.. కోడ్‌ ఉల్లంఘనపై ఈసీకి భాజపా ఫిర్యాదు

కడప జిల్లా బద్వేల్‌ ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. నియోజకవర్గం పరిధిలోని పోరుమామిళ్ల, బి.కోడూరులో ఆశా వర్కర్లకు ఫోన్లు, వాచీలు పంపిణీ చేస్తున్నారంటూ ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.

2. భవిష్యత్తులోనూ తెరాస విజయ పరంపర: పువ్వాడ అజయ్‌

తెలంగాణ నినాదం ఇతర పార్టీలకు రాజకీయ అంశంలా ఉందని.. తెరాసకు మాత్రం రాష్ట్ర అభివృద్ధే లక్ష్యం అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ అన్నారు. ఆదివారం మంత్రి పువ్వాడ అజయ్‌ మీడియాతో మాట్లాడారు. తెరాస విజయ పరంపర భవిష్యత్తులోనూ కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.

3.హీరోయిన్లపై అభ్యంతరకర వీడియోలు పెడితే ఉపేక్షించం: విష్ణు

కథానాయికలపై అభ్యంతరకర వీడియోలు పెడితే ఉపేక్షించేది లేదని నటుడు, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు హెచ్చరించారు. తెలుగు ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ సన్మాన కార్యక్రమంలో మీడియాను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లు నటుల పట్ల దారుణంగా ప్రవరిస్తున్నాయని, అసభ్యకరంగా వ్యవహరించే అలాంటి ఛానళ్లపై చర్యలు తప్పవన్నారు.

4.డీజీపీ స్పందించకపోవడం పోలీస్‌శాఖ ప్రతిష్ఠకే మాయని మచ్చ: సోమిరెడ్డి

ఏపీ పోలీసు వ్యవస్థపై హైకోర్టు తీవ్రమైన అభిశంసన చేసిందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి తెలిపారు. సీఎంకు ఒకటి, హైకోర్టు న్యాయమూర్తులకు మరో చట్టమా అనే ప్రశ్నను లేవనెత్తిందని గుర్తు చేశారు. పోలీస్‌ వ్యవస్థపై హైకోర్టు నమ్మకం కోల్పోయిందని తెలిపారు. ఈ క్రమంలో పోలీసు వ్యవస్థకు విలువేముంటుందన్నారు.

5.వ్యాక్సినేషన్‌ విజయవంతం.. కొత్త ఉత్సాహంలో దేశం

‘100 కోట్ల డోసులు పూర్తయిన క్రమంలో దేశం సరికొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. వ్యాక్సినేషన్‌ కార్యక్రమ సఫలత మన దేశ సామర్థ్యాన్ని చూపుతోంది. ప్రతి ఒక్కరి ప్రయత్నాల ఫలితాన్ని ఇది ప్రతిబింబిస్తోంది. ఆరోగ్య కార్తకర్తల కృషితో ఇది సాధ్యమైంది’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఆదివారం ప్రధాని ‘మన్ కీ బాత్’ 82వ ప్రసంగం చేశారు.

6.హైదరాబాద్‌లో దమ్‌ బిర్యానీ ఒక్కటేనా..

హైదరాబాద్‌ అనగానే గరం.. గరం దమ్‌ బిర్యానీ గుర్తొస్తుంది. హైదరాబాదీలు కనీసం వారంలో ఒకసారైనా అయినా బిర్యానీ తినకుండా ఉండలేరు. అందుకే, బావర్చీ.. ప్యారడైజ్‌సహా భాగ్యనగర వ్యాప్తంగా ప్రతీ గల్లీలోనూ బిర్యానీ హోటళ్లు దర్శనమిస్తాయి. అయితే, ఎప్పుడూ ఈ హైదరాబాద్‌ దమ్‌కీ బిర్యానీయేనా.. కొత్తగా ఏదైనా ట్రై చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? ఆ అవకాశమూ ఉంది.

7.లఖింపుర్‌ కేసులో ప్రధాన నిందితుడు ఆశిష్‌ మిశ్రాకు డెంగీ

లఖింపుర్‌ ఖేరి హింసాత్మక ఘటనలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రాకు డెంగీ సోకినట్లుగా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం పోలీసుల రిమాండులో ఉన్న ఆయన్ని చికిత్స నిమిత్తం కట్టుదిట్టమైన భద్రత నడుమ స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆయనకు మధుమేహ సమస్య కూడా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

8.కొలంబియా మోస్ట్‌వాంటెడ్‌ పట్టివేత..!

కొలంబియా మోస్ట్‌వాంటెడ్‌ మాదకద్రవ్యాల సరఫరాదారు డైరో అంటోనియో సుగా(ఒటోనియల్‌)ను అధికారులు అరెస్టు చేశారు. కొలంబియా అధ్యక్షుడు ఇవాన్‌ డ్యూక్‌  ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అతన్ని అదుపులోకి తీసుకోవడానికి సైన్యం , వాయుసేన సంయుక్తంగా ఆపరేషన్‌ నిర్వహించాల్సి వచ్చింది. అతనిపై ప్రభుత్వం 8లక్షల డాలర్ల  బహుమతిని ప్రకటించింది.

9.ఆర్యన్‌ ఖాన్‌ కేసులో ట్విస్ట్‌: సంచలన ఆరోపణలు చేసిన సాక్షి!

ముంబయి డ్రగ్స్‌ వ్యవహారం కొత్తమలుపులు తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ ఆపరేషన్‌కు నేతృత్వం వహించిన ఎన్‌సీబీ అధికారి సమీర్‌ వాంఖడేను టార్గెట్‌ చేస్తూ మహారాష్ట్ర మంత్రులు ఇప్పటికే ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై వాంఖడే ఇదివరకే దీటుగా బదులిచ్చారు. తాజాగా ఈ వ్యవహారంలో సాక్షిగా ఉన్న ప్రభాకర్‌ సెయిల్‌ అనే వ్యక్తి దర్యాప్తు సంస్థ ఎన్‌సీబీపైనే సంచలన ఆరోపణలు చేశారు.

10.మ్యాచ్‌ టైమ్‌ సమీపిస్తుందనగా ... అక్తర్‌ ట్వీట్‌

టీ20 ప్రపంచకప్‌లో మరికాసేపట్లో టీమ్‌ఇండియా-పాకిస్థాన్‌ జట్లు పోటీపడుతున్నాయి. అయితే, కీలక పోరుకుముందు పాక్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ తమ జట్టు సారథి బాబర్‌ అజామ్‌కు ఓ విలువైన సూచన చేశాడు. ‘‘బాబర్‌ నీకో ముఖ్య విషయం చెప్పాలి. కోహ్లీసేనతో బరిలోకి దిగినప్పుడు నువ్వు అస్సలు భయపడకూడదు, ధైర్యంగా ఆడు’’ అని చెప్పాడు.

అతనో సంపన్న క్రికెటర్ల సృష్టికర్త..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని