Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 09 Dec 2022 21:03 IST

1. ‘వారాహి’ రంగు వివాదం.. నిబంధనలన్నీ నా కోసమేనా?: పవన్‌

జనసేన పార్టీ ఎన్నికల ప్రచార రథం ‘వారాహి’ రంగుపై వైకాపా నేతలు చేసిన విమర్శలపై పవన్‌ కల్యాణ్‌ ట్విటర్‌ వేదికగా మరోసారి స్పందించారు. నిబంధనలు ఒక్క పవన్‌కల్యాణ్‌ కోసమేనా? అని ప్రశ్నించారు. ‘వారాహి’ వాహనం మాదిరిగా ఆలీవ్‌ గ్రీన్‌ కలర్‌లో ఉన్న వాహనాల ఫొటోలను ఆయన ట్విటర్‌లో పోస్టు చేశారు. ‘‘అసూయతో వైకాపా ఎముకలు రోజురోజుకూ కుళ్లిపోతున్నాయి. ఏపీలో లంచాలు, వాటాల వేధింపుల వల్ల ‘కారు నుంచి కట్‌ డ్రాయర్‌ కంపెనీల’ దాకా పక్క రాష్ట్రానికి తరలిపోయాయి’’ అని పవన్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. 1,392 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలో 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్‌ విద్య కమిషనరేట్‌లో 91 ఫిజికల్‌ డైరెక్టర్, 40 లైబ్రేరియన్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడింది. ఈనెల 16 నుంచి జనవరి 6 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. తరుముకొస్తున్న మాండౌస్‌ తుపాను.. దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు

తీవ్ర తుపానుగా మారిన మాండౌస్‌ దక్షిణ కోస్తా, రాయలసీమలో ప్రభావం చూపిస్తోంది. నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ తుపాను తీవ్రతను అంచనా వేస్తున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో ముందుజాగ్రత్తలు తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో ముందుకే: దీపమ్‌ కార్యదర్శి

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ (Vizag Steel plant) విక్రయించే విషయంలో కేంద్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదని మరోసారి తేలింది. ఈ ప్లాంట్‌ వ్యూహాత్మక విక్రయానికి సంబంధించి అడుగులు పడుతున్నాయని, అందులో భాగంగా లావాదేవీ నిర్మాణం ఎలా అనేదానిపై పనిచేస్తున్నామని దీపమ్‌ (DIPAM) కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే తెలిపారు. ఈ మేరకు సీఐఐ గ్లోబల్‌ ఎకనమిక్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. భారత టీ20 లీగ్‌ గురించి ఆలోచించడం మానేయండి: డానిష్‌ కనేరియా

బంగ్లాదేశ్‌(Bangladesh)తో సిరీస్ నేపథ్యంలో భారత ఆటగాళ్లపై పాకిస్థాన్‌(Pakistan) మాజీ స్పిన్నర్‌ డానిష్‌ కనేరియా(Danish kaneria) విమర్శలు గుప్పించాడు. భారత టీ20 లీగ్‌(T20 league) గురించి ఆలోచించడం మాని అంతర్జాతీయ క్రికెట్‌పై వారు దృష్టి సారించాలని అన్నాడు. సిరీస్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన టీమ్‌ఇండియా బంగ్లా ఆటగాళ్ల ధాటికి రాణించలేకపోయిన విషయం తెలిసిందే. దీంతో టెస్టు సిరీస్‌లోనైనా విజయాన్ని కైవసం చేసుకోవాలనే టీమ్ఇండియా పట్టుదలతో ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మస్క్‌ వస్తానంటే స్వాగతిస్తాం..కానీ, : గడ్కరీ

టెస్లా అధినేత, ట్విటర్‌ను హస్తగతం చేసుకున్న ఎలాన్‌ మస్క్‌ ఎలక్ట్రిక్‌ కార్ల విక్రయాన్ని భారత్‌లో ప్రారంభిస్తానంటే కచ్చితంగా స్వాగతిస్తామని కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ అన్నారు. కానీ, భారత్‌లోనే తయారు చేయాలని షరతుపెట్టారు. చైనాలోనో లేదంటే వేరే దేశంలోనో తయారు చేసి ఇక్కడ విక్రయిస్తామంటే కుదరదన్నారు. ‘అజెండా ఆజ్‌తక్‌’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మస్క్‌ భారత్‌లోని ఏ రాష్ట్రంలో తయారీ యూనిట్లను నెలకొల్పినా కేంద్రం సహకరిస్తుందని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. టాప్‌-500 కంపెనీల్లో భారత్‌ నుంచి 20.. రిలయన్స్‌దే అగ్రస్థానం

ప్రపంచంలో అత్యంత విలువైన 500 కంపెనీల (Most Valuable Companies) జాబితాలో ఈసారి భారత్‌ నుంచి 20 కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. వీటి విలువ 202 బిలియన్‌ డాలర్లు. ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (Reliance Industries) భారత్‌లో అత్యంత విలువైన సంస్థగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 34వ స్థానంలో ఉంది. ఈ జాబితాలో 2.4 ట్రిలియన్‌ డాలర్లతో యాపిల్‌ (Apple) అగ్రస్థానాన్ని దక్కించుకుంది. తర్వాత మైక్రోసాఫ్ట్‌ 1.8 ట్రిలియన్‌ డాలర్లతో రెండోస్థానంలో ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మాస్కోలో భారీ అగ్ని ప్రమాదం.. బాంబుపేలుళ్లని అనుమానం..!

రష్యా (Russia) రాజధాని మాస్కో(moscow) శివార్లలోని ఖిమ్కీ మెగా షాపింగ్‌ సెంటర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. దాదాపు 7,000 చదరపు మీటర్లు ఉన్న షాపింగ్‌ కాంప్లెక్స్‌లో పేలుళ్ల చప్పుళ్లు కూడా వినిపించాయి. ఆ తర్వాత భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. రష్యా(Russia)లోని అగ్నిమాపక సిబ్బంది వీటిని ఆర్పేందుకు కష్టపడుతున్నారు. ఉక్రెయిన్‌ యుద్ధం  ప్రారంభానికి ఈ కాంప్లెక్సులో పశ్చిమ దేశాలకు చెందిన బ్రాండ్లను విక్రయించేవారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ‘రానున్న మూడు వారాల్లో 500 పాస్‌పోర్ట్‌ మేళాలు!’

కేంద్రంలో 2014లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాస్‌పోర్ట్‌ సేవల్లో(Passport Services) దాదాపు 500 శాతం మెరుగుదల నమోదైందని కేంద్ర విదేశాంగశాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ వెల్లడించారు. పాస్‌పోర్ట్‌ల జారీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు విదేశీ వ్యవహారాలశాఖ(MEA) నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో పాస్‌పోర్ట్‌ మేళాలపై అడిగిన ఓ ప్రశ్నకు ఆయన ఈ మేరకు వివరాలు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. జియో ‘గంగా’నా.. ‘హోలీ’నా? ఫీచర్లు మారలేదు, పేర్లు మారాయి!

దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్‌ జియో మరో సంచలనానికి సిద్ధమైంది. త్వరలో బడ్జెట్‌ ధరలో 5జీ ఫోన్‌ను తీసుకురానుంది. గతేడాది తక్కువ ధరకు జియో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన జియో, ఈ ఏడాది అక్టోబరులో జియో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా బడ్జెట్‌ ధరకే 5జీ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఈ మేరకు జియో 5జీ ఫోన్‌ గీక్‌బెంచ్‌ లిస్టింగ్‌ (ఫోన్‌ పనితీరును విశ్లేషించి స్కోరింగ్ ఇచ్చే సంస్థ)కు వచ్చినట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

ఇవీ చదవండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు