Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 25 Jan 2023 20:55 IST

1. మన హక్కులను కాలరాసే ఎవరినైనా ఎదుర్కోవాల్సిందే: పవన్‌ కల్యాణ్‌

వ్యక్తి ఆరాధన ఎంత మంచిదో.. అంతే ప్రమాదకరమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘‘వివక్షకు గురయ్యే కులాలను మనం అర్థం చేసుకోవాలి. ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో వివక్షకు గురవుతారు. వివక్షకు గురైనప్పుడే దాని గురించి తెలుస్తుంది. సమాజాన్ని కొన్ని కోణాల్లోనే కాదు.. సమగ్రంగా చూడాలి’’ అని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. సీఎం కేసీఆర్‌ ఘర్షణాత్మక వైఖరి కోరుకుంటున్నారు: కిషన్‌రెడ్డి

గణతంత్ర దినోత్సవాన్ని జరపాలని ప్రజలు కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి తెలంగాణలో ఏర్పడిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. బుధవారం దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ చేసే పనుల వల్ల రాష్ట్రం పరువుపోతోందన్నారు. కేటీఆర్‌ సీఎం అవ్వరేమోనన్న భయంతో కేసీఆర్‌ ఘర్షణాత్మక వైఖరి కోరుకుంటున్నారని ఆరోపించారు. అధికారంలో ఎవరున్నా కొన్ని నిబంధనలు పాటించాల్సిందేనని, రాజ్యాంగేతర శక్తులకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. జగిత్యాల మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ రాజీనామా.. ఎమ్మెల్యేతో ప్రాణహాని ఉందని ఆరోపణ

తెరాస జగిత్యాల పురపాలక ఛైర్‌పర్సన్‌ బోగ శ్రావణి తన పదవికి రాజీనామా చేశారు. స్థానిక ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ వేధింపులు భరించలేక పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. బుధవారం జగిత్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రావణి మాట్లాడుతూ.. ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి కంటతడిపెట్టారు. ప్రశ్నించడంతోనే ఎమ్మెల్యే అడుగడుగునా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. స్థిరాస్తి వ్యాపారులకు ఊరట.. జీవో 145 నిలిపివేస్తూ ఉత్తర్వులు

ప్రైవేటు లే అవుట్‌లలో 5శాతం భూమిని ప్రభుత్వానికి కేటాయించే విధానాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈమేరకు సవరణ జీవో నెంబరు 145ను నిలుపుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పట్టణ ప్రాంతాల్లోని లే అవుట్లలో 5శాతం పేదల ఇళ్ల నిర్మాణానికి ఇవ్వాలంటూ గతంలో రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబరు 145 ను జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. రాజమౌళి.. ఈ కుర్చీ మీ కోసమే: సుకుమార్‌

తన సినిమాలతోనేకాదు వేదికలపై ఇచ్చే స్పీచ్‌తోనూ, సోషల్‌ మీడియాలో పెట్టే పోస్ట్‌లతోనూ దర్శకుడు సుకుమార్‌ (Sukumar) వావ్ అనిపిస్తుంటారు. రాజమౌళికి తనదైన శైలిలో అభినందనలు తెలియజేసి, నెటిజన్లను మరోసారి తనవైపు తిప్పుకున్నారు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR)లోని ‘నాటు నాటు’ (Naatu Naatu) గీతం ప్రఖ్యాత ఆస్కార్‌కు నామినేట్‌ అయిన సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అతడు ఫామ్‌లో ఉంటే కట్టడి చేయడం ఎవరికైనా కష్టమే: ఇర్ఫాన్‌ పఠాన్‌

‘‘ఫామ్‌లో ఉన్నప్పుడు హార్దిక్‌ పాండ్యను ఎవరూ కట్టడి చేయలేరు. అతడి షాట్లను గమనిస్తే క్రికెట్‌ మైదానంలో టెన్నిస్‌ ఆడుతున్నాడా అనే సందేహం కలుగుతుంది’’ అని అన్నాడు భారత మాజీ ఆటగాడు ఇర్ఫాన్‌ పఠాన్‌. న్యూజిలాండ్‌పై మూడో వన్డేలో హార్దిక్‌ పాండ్య ప్రదర్శనపై ఇర్ఫాన్‌ ప్రశంసలు కురిపించాడు. ఇలాంటి ఆటగాళ్లు చాలా అరుదుగా ఉంటారన్న ఇర్ఫాన్‌... పాండ్య బౌలింగ్‌ గురించి, వైవిధ్యం గురించి మాట్లాడాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఐసీసీ టీ20 క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్ 2022గా సూర్యకుమార్‌ యాదవ్‌

ఎప్పుడు వచ్చామన్నది కాదు అన్నయ్యా.. బుల్లెట్‌ దిగిందా లేదా అనేది ముఖ్యం అనే డైలాగ్‌ని మనలో చాలామంది వినే ఉంటాం. ఈ డైలాగ్‌ టీమ్‌ఇండియా క్రికెటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav)కు కూడా సరిగ్గా సూటవుతుంది. ఎందుకంటే అతడు 30 ఏళ్ల వయసులో జట్టులోకి వచ్చినా యువ ఆటగాళ్లతో పోటీపడుతూ పరుగులు రాబడుతున్నాడు. ముఖ్యంగా టీ20ల్లో పరుగుల వరద పారిస్తున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మైక్‌ టైసన్‌పై అత్యాచారం ఆరోపణలు : న్యూయార్క్‌ మహిళ దావా

ప్రపంచ మాజీ హెవీ వెయిట్‌ ఛాంపియన్‌ మైక్‌ టైసన్‌ (Mike Tyson) పై మరోసారి అత్యాచారం ఆరోపణలు వచ్చాయి. 1990ల్లో తనపై టైసన్‌ అత్యాచారం చేశారంటూ ఆరోపిస్తూ ఓ మహిళ న్యూయార్క్‌ న్యాయస్థానంలో దావా వేశారు. న్యూయార్క్‌ ఆల్బనీలోని ఓ నైట్‌ క్లబ్బులో మైక్‌ టైసన్‌ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని.. అప్పటి నుంచి కొన్నేళ్లపాటు తాను శారీరకంగా, మానసికంగా ఎంతగానో వేదనకు గురైనట్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. పాక్‌లో ముదురుతున్న సంక్షోభం.. మంత్రులపై వేటు, ఉద్యోగాల్లో కోత..!

దాయాది దేశం పాకిస్థాన్‌ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. మూడు వారాలకు సరిపడా విదేశీ మారకద్రవ్యం మాత్రమే అందుబాటులో ఉంది. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఈ క్రమంలో ఖర్చులు తగ్గించుకునే దిశగా షెహబాజ్‌ షరీఫ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.  ఈ మేరకు ప్రధాని షరీఫ్ ఏర్పాటు చేసిన జాతీయ పొదుపు కమిటీ కొన్ని పరిశీలనలు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ‘తూర్పు లద్దాఖ్‌ వద్ద 26 గస్తీ పాయింట్లను కోల్పోయాం’

భారత్‌(India) తూర్పు లద్దాఖ్‌లోని మొత్తం 65 గస్తీ పాయింట్లలో 26 కోల్పోయిందని అక్కడి సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు ప్రభుత్వానికి గత వారం నివేదిక ఇచ్చారు. ఈ విషయాన్ని జాతీయ మీడియా సంస్థలు తమ కథనాల్లో పేర్కొన్నాయి. ‘‘ప్రస్తుతం అక్కడ (తూర్పు లద్దాఖ్‌) కారాకోరం పాస్‌ నుంచి చుమూర్‌ వరకు మొత్తం 65 పెట్రోలింగ్‌ పాయింట్లు ఉన్నాయి. వీటిల్లో భారత్‌ సాయుధ బలగాలు క్రమం తప్పకుండా గస్తీ నిర్వహించాలి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని