Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Published : 05 Dec 2021 20:56 IST

1.కరీంనగర్‌లో కరోనా కలకలం.. 46 మంది వైద్య విద్యార్థులకు కొవిడ్‌

కరీంనగర్‌ రూరల్‌ మండలం బొమ్మకల్‌లోని ఓ ప్రైవేటు వైద్య కళాశాలలో కరోనా కలకలం రేపింది. ఇప్పటి వరకు కళాశాలలోని 46 మంది విద్యార్థులకు కొవిడ్ నిర్ధారణ అయింది. కొవిడ్‌ పరీక్షలు కొనసాగుతున్నాయి. దీంతో యాజమాన్యం కళాశాలకు సెలవు ప్రకటించింది. కళాశాలలో వారం రోజుల క్రితం స్నాతకోత్సవం జరిగింది.

2.వరదలను చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు: అంబటి

కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగడంపై కేంద్ర జల వనరులశాఖ మంత్రి షెకావత్‌ చెప్పింది వాస్తవం కాదని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు వాయిస్‌ను పార్లమెంట్‌లో వినిపించే ప్రయత్నం చేశారని విమర్శించారు. కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించి ఏం చెప్పిందో షెకావత్‌ తెలుసుకోవాలని సూచించారు.

3.దేశంలో 21కి చేరిన ఒమిక్రాన్‌ కేసులు.. రాజస్థాన్‌లో కొత్తగా మరో 9

దేశంలో కొత్తగా మరో 16 ఒమిక్రాన్‌ వేరియంట్‌ కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా మహారాష్ట్రలో 7, రాజస్థాన్‌లో 9 కేసులు వెలుగుచూశాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 21కి చేరింది. ఇప్పటికే కర్ణాటకలో రెండు, గుజరాత్‌లో ఒకటి, దిల్లీలో ఒకటి, ముంబయిలో ఒకటి చొప్పున కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

4.పాక్‌ కొరివితో తలగోక్కున్న వేళ ..!

భారత్‌ ఎదుట తన బలాన్ని అతిగా ఊహించుకొంటే ఏమవుతుందో పాకిస్థాన్‌కు 1971లో తెలిసొచ్చింది. 1967లో అరబ్‌ దేశాల పై ‘ఆపరేషన్‌ ఫోకస్‌’ పేరిట ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలతో దాడిచేసి గెలవడాన్ని చూసిన పాక్‌ తాను కూడా అలానే భారత్‌ను ఓడించాలని కలలుగన్నది. అందుకోసం ప్రయత్నించే క్రమంలో కొరివితో తలగోక్కుంది.

5.ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం లేదు.. రాజస్థాన్‌లో వచ్చేది మేమే: అమిత్‌షా

రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా యత్నిస్తోందంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ గతంలో చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తాజాగా బదులిచ్చారు. తాము ప్రభుత్వాన్ని కూల్చబోమని, కానీ 2023లో వచ్చేది మాత్రం తామేనని చెప్పారు. మూడింట రెండొంతుల మెజారిటీ సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు. 

6.భారత్‌ విడిచివెళ్లేందుకు నటి ప్రయత్నం.. విమానాశ్రయంలో అడ్డుకున్న అధికారులు!

మనీలాండరింగ్‌ కేసులో విచారణ ఎదుర్కొంటున్న బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ భారత్‌ నుంచి విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ముంబయి విమానాశ్రయం చేరుకున్న ఆమెను అక్కడి అధికారులు అడ్డుకున్నారు.మనీలాండరింగ్‌ కేసులో విచారణ జరుపుతోన్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఆమెపై లుక్‌అవుట్‌ నోటీసులు జారీచేసిన నేపథ్యంలోనే జాక్వెలిన్‌ను విమానాశ్రయ అధికారులు అడ్డుకున్నట్లు సమాచారం.

7.తాలిబన్‌.. ఆ హత్యలు ఆపండి..!

అఫ్గానిస్థాన్‌ పౌర ప్రభుత్వం హయాంలో పనిచేసిన భద్రతా సిబ్బందిని తాలిబన్లు వేటాడి చంపడాన్ని వెంటనే ఆపేయాలని 22 దేశాలు డిమాండ్‌ చేశాయి. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని సూచించాయి. ‘‘వేటాడి మరీ హత్యలు చేయడాలు, వ్యక్తుల అదృశ్యాలపై అఫ్గానిస్థాన్‌ నుంచి వస్తున్న నివేదికలు ఆందోళనకు గురి చేస్తున్నాయి’’ అని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి.

8.మెట్రో బ్రాండ్స్‌, ఇన్‌స్పిరా ఐపీఓ.. ఎప్పుడంటే?

ప్రముఖ ఫుట్‌వేర్‌ రిటైలర్‌ ‘మెట్రో బ్రాండ్స్‌ లిమిటెడ్‌’ ఐపీఓ డిసెంబరు 10న ప్రారంభం కానుంది. నాలుగు రోజుల పాటు సాగే ఈ పబ్లిక్‌ ఇష్యూ డిసెంబరు 14న ముగియనుంది. రూ.295 కోట్లు విలువ చేసే తాజా షేర్లతో పాటు 2.14 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. ఈ ఐపీఓ ద్వారా ప్రమోటర్లు 10 శాతం వాటాను వదులుకునేందుకు సిద్ధమయ్యారు. దీంతో కంపెనీలో వీరి వాటా 75 శాతానికి రానుంది. 

9.ఇంకా ఐదే మిగిలాయి.. లంచ్ లోపే ముగించేస్తారా?

భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసింది. 540 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌ ఆట ముగిసేసమయానికి రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. క్రీజ్‌లో హెన్రీ నికోల్స్‌ (36*), రచిన్‌ రవీంద్ర (2*) ఉన్నారు. కివీస్‌ కెప్టెన్‌, ఓపెనర్‌ టామ్‌ లేథమ్ (6), రాస్ టేలర్‌ (6), టామ్‌ బ్లండెల్‌ (0) మరోసారి విఫలమయ్యారు.

10.ఫొటోలు, వీడియోలు దాచేందుకు గూగుల్ ఫొటోస్‌ కొత్త ఫీచర్‌

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ వాడే ప్రతి యూజర్ కోరుకునేది డేటా ప్రైవసీ. ముఖ్యంగా ఫొటోలు, వీడియోలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వంటి వాటితోపాటు వ్యక్తిగత సమాచారం ఇతరుల చేతికి చిక్కకుండా ఎన్నో జాగ్రత్తలు పాటిస్తాం. ఈ నేపథ్యంలోనే గూగుల్ ఫొటోస్ (Google Photos) యూజర్స్‌కు మరో కొత్త ప్రైవసీ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు