Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీ కోసం..

Updated : 12 Jan 2022 21:04 IST

1. పీఆర్‌సీ ఆమోదయోగ్యంగా లేదు: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం

ఉద్యోగులకు ఏపీ సర్కార్‌ ప్రకటించిన పీఆర్‌సీ ఆమోదయోగ్యంగా లేదంటూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు తెలిపారు. ఉద్యోగ సంఘాలతో పలు దఫాలుగా ప్రభుత్వం చర్చలు జరిపినప్పటికీ ఉద్యోగులకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకోలేదని పేర్కొన్నారు. అశుతోష్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికను ఉద్యోగ సంఘాలకు ఇచ్చి ఉండాల్సిందని వారు అభిప్రాయపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏమిటి?

మార్గశిర మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని సర్వేకాదశి/ వైకుంఠ ఏకాదశి/ ముక్కోటి ఏకాదశి అంటారు. ఈసారి గురువారం (జనవరి 13) ఏకాదశి వచ్చింది. ఆ రోజంతా ఉంటుంది. అశ్వనీ నక్షత్రమని పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. పుణ్యతిథి కావడం వల్ల దీన్ని మోక్షద ఏకాదశిగా పిలుస్తారు. ఇది సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. బుమ్రా పాంచ్‌ పటాకా.. దక్షిణాఫ్రికా ఆలౌట్‌

కీలకమైన మూడో టెస్టు మ్యాచ్‌లో టీమ్‌ఇండియా బౌలర్‌ బుమ్రా (5/42) సూపర్‌ స్పెల్‌ వేశాడు. దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌లో 210 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌కు 13 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. కీగన్‌ పీటర్సెన్‌ (72: 166 బంతుల్లో) అర్ధ శతకంతో రాణించగా.. టెంబా బవుమా (28), కేశవ్‌ మహరాజ్‌ (25), డస్సెన్ (21) ఫర్వాలేదనించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. సినీ నటుడు సిద్ధార్థ్‌పై హైదరాబాద్‌లో కేసు నమోదు

సినీ నటుడు సిద్ధార్థ్‌పై హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి  సైనా నెహ్వాల్‌ చేసిన ఓ ట్వీట్‌కు స్పందిస్తూ సిద్ధార్థ్‌ అభ్యంతరకరంగా కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిద్ధార్థ్‌పై సామాజిక కార్యకర్త ప్రేరణ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సిద్ధార్థ్‌పై  సెక్షన్‌ 67 యాక్టు, ఐపీసీ 509 సెక్షన్‌ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. స్టూడెంట్ లీడర్‌ అనుభవంతోనే రాజకీయాల్లో ఎదిగా: చంద్రబాబు

నేటి యువత, నిపుణులు రాజకీయాల్లోకి రావాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. తెదేపాలో ఇంటర్న్ షిప్ పూర్తి చేసిన 28 మంది విద్యార్థులు, నిపుణులు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆయనను కలిశారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాల పట్ల యువత ఆసక్తి చూపడం లేదు. నాకు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదు. యూనివర్సిటీ స్థాయిలో స్టూడెంట్ లీడర్‌గా పనిచేసిన అనుభవంతోనే రాజకీయాల్లో ఎదిగాను’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. సంక్రాంతి సందర్భంగా 8 ప్రత్యేక రైళ్లు: దక్షిణ మధ్య రైల్వే

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 8 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈనెల 14న నర్సాపూర్‌-విజయవాడ డెమూ, 13న విజయవాడ- నర్సాపూర్‌ డెమూ, మచిలీపట్నం- గుడివాడ మెమూ, గుడివాడ- మచిలీపట్నం మెమూ, 14న మచిలీపట్నం- గుడివాడ మెమూ, గుడివాడ- మచిలీపట్నం మెమూ, 13న విజయవాడ- మచిలీపట్నం మెమూ, 14న మచిలీపట్నం-విజయవాడ మెమూ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. తెలంగాణలో కొత్తగా 2,319 కొవిడ్ కేసులు

తెలంగాణలో కొవిడ్‌ బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 90,021 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 2,319 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,00,094కి చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. 24 గంటల్లో యోగి ప్రభుత్వానికి మరో షాక్‌..!

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో యూపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి 24 గంటల వ్యవధిలోనే మరో షాక్ తగిలింది. కేబినెట్ మంత్రి దారా సింగ్ చౌహాన్‌ పదవి నుంచి వైదొలిగారు. నిన్న బీసీ వర్గంలో బలమైన నేత  స్వామి ప్రసాద్‌ మౌర్య మంత్రి పదవి రాజీనామా చేయగా.. ఇప్పుడు చౌహాన్ ఆ వరుసలో చేరారు. ఈయన కూడా బీసీ వర్గంలో కీలక నేతనే కావడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. సీఎం అభ్యర్థిని ప్రకటించకుంటే ఓడినట్లే..!

అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తోన్న వేళ.. పంజాబ్‌ కాంగ్రెస్‌కు మరిన్ని కష్టాలు తప్పేటట్లు కనిపించడం లేదు. ముఖ్యంగా సీఎం అభ్యర్థిపై ముఖ్యమంత్రి చన్నీ, పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ చేస్తోన్న వ్యాఖ్యలు కాంగ్రెస్‌లోనే మరింత వేడిని రాజేస్తున్నాయి. ఓవైపు ఎన్నికల ముందే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలని పంజాబ్‌ సీఎం చరణ్‌జిత్‌ చన్నీ అధిష్ఠానానికి స్పష్టం చేయగా, పంజాబ్‌ సీఎం ఎవరనేది రానున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలే నిర్ణయిస్తారని.. కాంగ్రెస్‌ అధిష్ఠానం కాదని పీసీసీ అధ్యక్షుడు నవజోత్‌సింగ్‌ సిద్ధూ పేర్కొన్నారు. సీఎం అభ్యర్థిని ప్రకటించని ప్రతిసారి పార్టీ ఓడిపోయిన విషయాన్ని ఇరువురు నేతలు గుర్తుచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ‘భారత్‌లో మొదటి డోసే బూస్టర్‌ డోసు’

భారత్‌లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మొదలయ్యే కంటే ముందే అనేక మంది కొవిడ్‌ బారిన పడ్డారని, వారిలో అప్పటికే సహజరీతిలో యాంటీబాడీలు వృద్ధి చెందాయని ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్‌ జయప్రకాశ్‌ ములియిల్‌ పేర్కొన్నారు. గతేడాది జనవరి 16 నుంచి దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మొదలైందని.. అప్పటి నుంచి టీకా మొదటి డోసు తీసుకున్నవారు కూడా బూస్టర్‌ డోసు తీసుకున్న దానితో సమానమన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని