Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీ కోసం.. 

Updated : 29 Apr 2022 21:11 IST

1. ఒక ప్రత్యేక యూనివర్సిటీ కిందకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు: సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌లో టీచింగ్‌ స్టాఫ్‌ నియామకాల్లో సిఫార్సులకు అవకాశం లేదని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. సమర్థులు, ప్రతిభ ఉన్న వారినే టీచింగ్‌ స్టాఫ్‌గా తీసుకోవాలన్నారు. ఈ మేరకు ఉన్నత విద్యపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్‌.. అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. పరీక్షలు నిర్వహించి టీచింగ్‌ స్టాఫ్‌ను ఎంపిక చేయాలన్నారు. విశ్వవిద్యాలయాల్లో క్రమశిక్షణ, పారదర్శకత చాలా ముఖ్యమని సీఎం పేర్కొన్నారు

2. మైనార్టీల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది: కేసీఆర్‌

రంజాన్‌ సందర్భంగా ముస్లింలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్‌ వింద్‌ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో  ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ... మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మైనార్టీల పిల్లలకు పాఠశాలలు, వసతి గృహాలు నిర్మించామన్నారు. 

వరి కొనకపోతే..ఉరి తీస్తాం!: రేవంత్‌రెడ్డి

3. కేటీఆర్‌ గారు.. మీ ఫ్రెండ్‌ చెప్పింది తప్పు: ఏపీ మంత్రి రోజా

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల పరిస్థితిపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా స్పందించారు. సీఎం కేసీఆర్‌ను కలిసిన అనంతరం ప్రగతి భవన్‌ వద్ద మీడియాతో మాట్లాడారు. పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మర్యాద పూర్వకంగా సీఎం కేసీఆర్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నట్టు తెలిపారు. ఏపీ విషయంలో మంత్రి కేటీఆర్‌ను ఎవరో తప్పుదోవ పట్టించారని అర్థమవుతోందన్నారు.

4. మే 5న ఐదు మండల పరిషత్‌లకు అధ్యక్ష ఎన్నికలు: ఎస్‌ఈసీ

ఆంధ్రప్రదేశ్‌లోని 5 జిల్లాల్లోని 5 వేర్వేరు మండల పరిషత్‌లకు అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం, కృష్ణా జిల్లా ఉంగుటూరు, పల్నాడు జిల్లాలోని పెదకూరపాడు, నెల్లూరు జిల్లా పొదలకూరు మండల పరిషత్‌ అధ్యక్ష ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. కోనసీమ జిల్లా రాయవరం మండల పరిషత్‌కు ఇద్దరు ఉపాధ్యక్షుల ఎన్నికకు నోటిఫికేషన్‌ ఇచ్చారు.

రేషన్‌ కార్డుల ఏరివేత ప్రాతిపదిక ఏంటి?

5. యాదగిరిగుట్టలో కూలిన భవనం.. నలుగురి మృతి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో రెండంతస్తుల భవనం కుప్పకూలింది. ప్రధాన రహదారికి పక్కనే ఉన్న శ్రీరాంనగర్లో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు నలుగురు మృతి చెందారు. శిథిలాల కింద మరో ఆరుగురు చిక్కుకున్నట్లు సమాచారం. కూలిన భవనంలో ముందు భాగంలో రెండు దుకాణాలు నిర్వహిస్తుండగా, వెనుక భాగంలో రెండు కుటుంబాలు నివసిస్తున్నాయి.

6. సచివాలయంలో ఏపీ సీఎస్‌ను కలిసిన ఏబీ వెంకటేశ్వరరావు

తనకు పోస్టింగ్ ఇవ్వాలని కోరుతూ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సచివాలయానికి వచ్చారు. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో సీఎస్ సమీర్ శర్మను కలిసి సుప్రీంకోర్టు ఆదేశాలను అందజేశారు. పోలీసు డైరెక్టర్ జనరల్ హోదాలో ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు యూనిఫాం ధరించి సచివాలయంలో సీఎస్‌ను కలిశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల రీత్యా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రిపోర్టు చేసేందుకు సచివాలయానికి వచ్చినట్లు ఏబీవీ స్పష్టం చేశారు.

హైపో థైరాయిడ్‌తో బాధపడుతున్నారా?

7. మహిళా పోలీసుపై దాడి కేసు.. జిగ్నేశ్‌ మేవానీకి బెయిల్‌

అస్సాంలో ఓ మహిళా పోలీసుపై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలపై అరెస్టయిన గుజరాత్‌ స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేశ్‌ మేవానీకి ఊరట లభించింది. ఈ కేసులో ఆయన అస్సాంలో బార్పేట్‌ స్థానిక కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ సాయంత్రం జిగ్నేశ్‌ జైలు నుంచి విడుదల కానున్నారు. కాగా.. ప్రధాని మోదీపై అనుచిత ట్వీట్‌ చేసిన కేసులో ఇటీవల జిగ్నేశ్‌ అస్సాంలో అరెస్టయి బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే.

8. కోహ్లీ, రోహిత్‌పై నమ్మకముంది.. త్వరలోనే రాణిస్తారు: గంగూలీ

టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ త్వరలోనే రాణిస్తారని, వారిద్దరిపై తనకు పూర్తి నమ్మకం ఉందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం జరుగుతోన్న మెగా టీ20 లీగ్‌లో కోహ్లీ 9 మ్యాచ్‌ల్లో 16 సగటుతో 129 పరుగులు చేయగా.. రోహిత్‌ 8 మ్యాచ్‌ల్లో 19.13 సగటుతో 153 పరుగులే చేశాడు. దీంతో వీరిద్దరూ ఫామ్‌ కోల్పోయి సతమతమవుతున్నారు.

9. ప్రధాని మార్పునకు శ్రీలంక అధ్యక్షుడు ఓకే.. త్వరలో మధ్యంతర ప్రభుత్వం?

ఆర్థిక, ఆహార, ఇంధన సంక్షోభాలతో వణికిపోతోన్న శ్రీలంకలో ఆందోళనలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. ముఖ్యంగా అధ్యక్షుడు గొటబాయ, ప్రధానమంత్రి మహిందలు వారి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు ఉద్ధృతం అవుతున్నాయి. అయితే, ప్రధానమంత్రి మహింద రాజపక్సను తొలగించి.. ఆయన స్థానంలో వేరొకరిని నియమించేందుకు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అంగీకరించారు. ఈ విషయాన్ని శ్రీలంక మాజీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన వెల్లడించారు.

10. మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలను రాజకీయం చేయదల్చుకోలేదు: సజ్జల

ఆంధ్రప్రదేశ్‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించారు. ‘‘ కేటీఆర్‌ అయినా, ఎవరైనా ముందు వాళ్ల రాష్ట్రం గురించి మాట్లాడాలి. రాష్ట్ర విభజన తర్వాత ఆస్తుల పంపకాలు ఇంకా పూర్తిగా జరగలేదు. అధిక వర్షాల వల్లే రాష్ట్రంలో రోడ్లు దెబ్బతిన్నాయి. కేటీఆర్‌ వ్యాఖ్యలను రాజకీయం చేయదల్చుకోలేదు. తెలంగాణలోనూ రోడ్లు బాగాలేవు. మొన్నటి వరకు తెలంగాణలో విద్యుత్‌ కోతలు ఉన్నాయి’ అని సజ్జల వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని