Jignesh Mevani: మహిళా పోలీసుపై దాడి కేసు.. జిగ్నేశ్‌ మేవానీకి బెయిల్‌

అస్సాంలో ఓ మహిళా పోలీసుపై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలపై అరెస్టయిన గుజరాత్‌ స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేశ్‌ మేవానీకి ఊరట లభించింది. ఈ కేసులో ఆయన అస్సాంలో బార్పేట్‌ స్థానిక కోర్టు బెయిల్‌ మంజూరు

Published : 29 Apr 2022 20:00 IST

గువాహటి: అస్సాంలో ఓ మహిళా పోలీసుపై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలపై అరెస్టయిన గుజరాత్‌ స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేశ్‌ మేవానీకి ఊరట లభించింది. ఈ కేసులో ఆయన అస్సాంలో బార్పేట్‌ స్థానిక కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ సాయంత్రం జిగ్నేశ్‌ జైలు నుంచి విడుదల కానున్నారు.

కాగా.. ప్రధాని మోదీపై అనుచిత ట్వీట్‌ చేసిన కేసులో ఇటీవల జిగ్నేశ్‌ అస్సాంలో అరెస్టయి బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ జిగ్నేశ్‌ ఈ నెల 18న చేసిన ట్వీట్‌ చేశారు. జాతిపిత మహాత్మా గాంధీని కాల్చి చంపిన నాథూరాం గాడ్సే పేరును ప్రస్తావిస్తూ మోదీపై ఆయన చేసిన ట్వీట్‌పై  కోక్రాఝర్‌ ప్రాంతంలో భాజపా నేత అరూప్‌ కుమార్‌ డే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీంతో ఈ నెల 19న గుజరాత్‌లోని పాలన్‌పూర్‌లో జిగ్నేశ్‌ను అస్సాం పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయన్ను విచారణ నిమిత్తం పోలీసు కస్టడీకి తరలించారు. ఈ కేసులో బెయిల్‌ కోసం ఆయన కోక్రాఝర్‌ కోర్టును ఆశ్రయించగా.. ఏప్రిల్‌ 25న న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది.

అయితే బెయిల్‌పై విడుదలైన కొద్ది సేపటికే జిగ్నేశ్‌ను బార్పేట్‌ పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు. కోర్టుకు తరలిస్తున్న సమయంలో ఓ మహిళా పోలీసుపై దాడి చేశారని, అమర్యాదగా ప్రవర్తించారన్న ఆరోపణలపై పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుపై ఆయన కోర్టును ఆశ్రయించగా.. నేడు బెయిల్‌ మంజూరైంది.

తన అరెస్టుపై జిగ్నేశ్‌ విలేకర్లతో మాట్లాడుతూ.. ప్రధాని కార్యాలయం ప్రతీకార రాజకీయాల్లో భాగంగానే తన అరెస్టు జరిగిందన్నారు. తన అరెస్టు భాజపా, ఆరెస్సెస్‌ కుట్రగా పేర్కొన్నారు. జిగ్నేశ్‌ గుజరాత్‌లోని వడగాం నియోజకవర్గం నుంచి స్వతంత్ర ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని