Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 12 Mar 2024 21:01 IST

1. కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేస్తాం: రేవంత్‌రెడ్డి

తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఆడబిడ్డల ఆశీర్వాదం వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో ‘మహాలక్ష్మి స్వశక్తి మహిళ’ పథకాన్ని సీఎం ప్రారంభించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కాంగ్రెస్‌ పాలన చూస్తే సమైక్య పాలకులే నయమనిపిస్తోంది: కేసీఆర్‌

భారాస తెలంగాణ బలం.. తెలంగాణ గళం అని ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ అన్నారు. ‘కరీంనగర్‌ కదన భేరి’ సభతో  ఎన్నికల ప్రచారానికి ఆ పార్టీ శ్రీకారం చుట్టింది. ‘‘రైతుల దయనీయ పరిస్థితి చూస్తే కన్నీళ్లు వస్తున్నాయి. పంటలు ఎండిపోతున్నా పాలకులకు దయరావట్లేదు. మూడు నెలల్లో పాలకులు రాష్ట్రాన్ని ఆగం చేశారు. కాంగ్రెస్‌ పాలన చూస్తే సమైక్య పాలకులే నయమనిపిస్తోంది’’అని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. భీమవరం వదులుకోను.. నాదే : పవన్‌ కల్యాణ్‌

రాజకీయాల్లో యుద్ధమే ఉంటుంది.. బంధుత్వాలు ఉండవని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు జనసేన పార్టీలో చేరిన సందర్భంగా మాట్లాడుతూ ‘‘భీమవరం వదలను.. నాదే. అక్కడి నుంచి రౌడీయిజం పోవాలి. జనసేన గెలిస్తే భీమవరంలో డంపింగ్‌ యార్డ్‌ను సరిచేస్తాం’’అని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. హోలీకి 18 ప్రత్యేక రైళ్లు.. వివరాలివే..

హోలీ వేడుకల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేసింది. మార్చి 25న హోలీ పండగ నేపథ్యంలో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, కాచిగూడ నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు 18 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. శరత్‌ కుమార్‌ కీలక నిర్ణయం.. భాజపాలో ఏఐఎస్‌ఎంకే విలీనం

లోక్‌సభ ఎన్నికల ముంగిట తమిళనాట కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ తమిళ సినీనటుడు ఆర్‌.శరత్‌ కుమార్‌ తన పార్టీ ఆల్‌ ఇండియా సమతువ మక్కల్‌ కట్చి(AISMK)ని భాజపాలో విలీనం చేశారు.  తన పార్టీ ఆఫీస్‌ బేరర్లతో పాటు తమిళనాడు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై సమక్షంలో కాషాయ పార్టీలో విలీనం చేసిన విషయాన్ని ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. కాంగ్రెస్‌ రెండో జాబితా.. బరిలో మాజీ సీఎంల తనయులు

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్‌ పార్టీ (Congress) మరో జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే 39 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించిన ఆ పార్టీ.. తాజాగా మరో 43 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. అసోం, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, ఉత్తరాఖండ్‌, దమన్‌దీవ్‌ పరిధిలోని పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

7. భారీ భద్రత మధ్య గ్యాంగ్‌స్టర్ల పెళ్లి.. దృశ్యాలు వైరల్‌

కట్టుదిట్టమైన భద్రత మధ్య గ్యాంగ్‌స్టర్ల జంట వివాహం చేసుకుంది. హరియాణాకు చెందిన సందీప్‌ అలియాస్‌ కాలా జథేడీ, రాజస్థాన్‌కు చెందిన అనురాధా చౌధరి అలియాస్‌ మేడమ్‌ మింజ్‌ పెళ్లి.. దిలోని ఒక బాంక్వెట్‌ హాల్‌లో జరిగింది. అందరి దృష్టిని ఆకర్షించిన ఈ వేడుక దృశ్యాలు తాజాగా వైరల్ అవుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. స్థిరంగా రిటైల్‌ ద్రవ్యోల్బణం.. ఫిబ్రవరిలో 5.09%

వినియోగదారు ధరల సూచీ (CPI) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం ఫిబ్రవరి నెలలో 5.09 శాతంగా నమోదైంది. అంతకుముందు నెలలో 5.1 శాతంగా నమోదైంది. అంటే రిటైల్‌ ద్రవ్యోల్బణంలో పెద్దగా మార్పు లేదు. 2023 ఫిబ్రవరి నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.44 శాతంగా ఉందని కేంద్ర గణాంక కార్యాలయం (NSO) ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఆచరణ సాధ్యం కాదనుకున్న కార్డు.. ‘చిరునామా’కు మారుపేరుగా నిలిచి!

ఓటరు కార్డుకు 1957లోనే రూపకల్పన చేసినప్పటికీ.. పూర్తిస్థాయిలో అది కార్యరూపం దాల్చేందుకు దాదాపు మూడు దశాబ్దాలు పట్టింది. ఒకరికి బదులు మరొకరు ఓటు వేయకుండా నిరోధించడంలో కీలకమైన ఈ ఓటరు కార్డును 1993లో అందుబాటులోకి తేగా.. ప్రస్తుతం అది ఓటరు గుర్తింపుగానే కాకుండా వ్యక్తుల చిరునామా ధ్రువీకరణ పత్రాల్లో ఒకటిగా నిలుస్తోంది. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

10. మాల్దీవుల రక్షణకు మద్దతిస్తాం: చైనా

మాల్దీవుల రక్షణకు ఆ దేశానికి పూర్తి మద్దతిస్తామని చైనా ప్రకటించింది. ఈమేరకు ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ (Wang Wenbin) మంగళవారం వెల్లడించారు. మాల్దీవుల నుంచి భారత్‌ బలగాలు వెనక్కివచ్చిన కొద్ది గంటల వ్యవధిలోనే ఆయన ఈ ప్రకటన చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని