KCR: కాంగ్రెస్‌ పాలన చూస్తే సమైక్య పాలకులే నయమనిపిస్తోంది: కేసీఆర్‌

భారాస తెలంగాణ బలం.. తెలంగాణ గళం అని ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ అన్నారు. ‘కరీంనగర్‌ కదన భేరి’ సభతో  ఎన్నికల ప్రచారానికి ఆ పార్టీ శ్రీకారం చుట్టింది.

Updated : 15 Mar 2024 16:53 IST

కరీనంగర్‌: భారాస తెలంగాణ బలం.. తెలంగాణ గళం అని ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ అన్నారు. ‘కరీంనగర్‌ కదన భేరి’ సభతో  ఎన్నికల ప్రచారానికి ఆ పార్టీ శ్రీకారం చుట్టింది. ‘‘రైతుల దయనీయ పరిస్థితి చూస్తే కన్నీళ్లు వస్తున్నాయి. పంటలు ఎండిపోతున్నా పాలకులకు దయరావట్లేదు. మూడు నెలల్లో పాలకులు రాష్ట్రాన్ని ఆగం చేశారు. కాంగ్రెస్‌ పాలన చూస్తే సమైక్య పాలకులే నయమనిపిస్తోంది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దిల్లీకి తాకట్టు పెడుతున్నారు.

తెలంగాణలో మొన్న నేను గెలిచి ఉంటే.. దేశాన్ని చైతన్యం చేసేవాణ్ణి. కేసీఆర్‌ దిగిపోగానే కరెంట్‌, రైతు బంధు కట్‌ అయ్యాయి. ఈ ప్రభుత్వం కరెంటు, రైతు బంధు ఇవ్వలేకపోతోంది. పోలీసులకు రాజకీయాలు ఎందుకు?  సోషల్‌ మీడియాలో పోస్టులు పెడితే అరెస్టులు చేస్తున్నారు. గ్రామాల్లో చిచ్చు పెట్టొద్దు. మేం అలా చేస్తే కాంగ్రెసోళ్లు మిగిలేవారా? ఒక పన్ను వదులైతే మొత్తం రాలగొట్టుకుంటామా? కాళేశ్వరంలో ఇసుక జారి రెండు పిల్లర్లు కుంగితే దేశమే మునిగిపోతోందని రచ్చ చేస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో టీవీలో వస్తా.. కాళేశ్వరంపై వివరిస్తా. ముఖ్యమంత్రిని ఆరు గ్యారంటీలు అడిగితే.. పండబెట్టి తొక్కుతా, పేగులు మెడలో వేసుకుంటా, మానవ బాంబు అవుతా అంటున్నారు. ఉద్యమ సమయంలో నేనూ పరుషంగా మాట్లాడా.. కానీ, సీఎం అయిన తర్వాత అలా మాట్లాడలేదు. తమాషాకు ఓటేయొద్దు.. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కరీంనగర్‌లో వినోద్‌ను గెలిపించాలి’’ అని కేసీఆర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని