వికీపీడియాలో కొత్తగా ప్రవర్తన నియమావళి

ప్రముఖ ఆన్‌లైన్‌ ఎన్‌సైక్లోపీడియా ‘వికీపీడియా’ తొలిసారిగా యూనివర్సల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌(ప్రవర్తన నియమావళి)ని అమల్లోకి తెచ్చింది. వికీపీడియాను కొందరు దుర్వినియోగం చేస్తున్న నేపథ్యంలో కొత్త

Published : 04 Feb 2021 01:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఆన్‌లైన్‌ ఎన్‌సైక్లోపీడియా ‘వికీపీడియా’ తొలిసారిగా యూనివర్సల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌(ప్రవర్తన నియమావళి)ని అమల్లోకి తెచ్చింది. వికీపీడియాను కొందరు దుర్వినియోగం చేస్తున్న నేపథ్యంలో కొత్త ప్రమాణాలను తీసుకురావాలని వీకీపీడియా మాతృ సంస్థ వికీమీడియా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న పాలసీలకు అదనంగా ఈ నియమావళిని జతచేస్తున్నట్లు పేర్కొంది.

వికీపీడియా.. సమస్త సమాచారం లభించే వెబ్‌సైట్‌. నెటిజన్లు దేని గురించి తెలుసుకోవాలన్నా ముందుగా వికీపీడియానే ఆశ్రయిస్తుంటారు. వివిధ భాషల్లో లక్షల సంఖ్యలో ఆర్టికల్స్‌ ఇందులో పొందుపర్చి ఉన్నాయి. యూజర్లకు విశ్వసనీయమైన సమాచారం అందించడానికి ప్రపంచవ్యాప్తంగా వేలమంది స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు. ఈ వికీపీడియాలో ఒక ఆర్టికల్‌లో తప్పులుంటే సరిచేయడానికి, అదనపు సమాచారం జతచేయడానికి నెటిజన్లందరికీ అవకాశం ఉంటుంది. అయితే, దీన్ని అవకాశంగా చేసుకొని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. వ్యక్తిగత దూషణలు చేయడం, ఒకరి గౌరవానికి భంగం కలిగేలా ఆర్టికల్స్‌లో మార్పులు చేయడం, తప్పుడు సమాచారాన్ని పొందుపర్చడం, రెచ్చగొట్టే.. వివాదాస్పద వ్యాఖ్యలు రాయడం వంటివి జరుగుతున్నాయి. వీటికి అడ్డుకట్ట వేసేందుకే వికీమీడియా ప్రవర్తన నియమావళిని తీసుకొచ్చింది. వికీమీడియా సంస్థలో పనిచేసేవారితోపాటు.. స్వచ్ఛందంగా పనిచేసే.. చేయాలనుకుంటున్న వారందరికీ ఈ నియమావళి వర్తించనుంది.

వికీమీడియా తీసుకొచ్చిన యూనివర్సల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ రెండు రకాలుగా ఉంటుందని తెలుస్తోంది. వికీపీడియాను దుర్వినియోగం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవడం ఒకటైతే.. కంటెంట్‌ను నిర్మాణాత్మకంగా ఎడిట్‌ చేయడం, ఒకరినొకరు గౌరవించుకోవడం, ఎడిటింగ్‌లో.. వికీమీడియా ఇతర ప్రాజెక్టుల్లో పనిచేసేవారికి సహాయం అందించడం రెండోది. ఐదు ఖండాలు, 30 భాషలకు ప్రాతినిథ్యం వహిస్తున్న 1,500పైగా వికీపీడియా వాలంటీర్లు ఈ యూనివర్సల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ రూపకల్పనలో పాలుపంచుకున్నారని వికీమీడియా వెల్లడించింది. ఈ ఏడాది చివరి నాటికి ఈ నియమావళి పూర్తిగా అమల్లోకి వస్తుందని సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని