YouTube: ‘వెల్లుల్లితో క్యాన్సర్‌ నయం’.. ఇటువంటి అసత్య వీడియోలు ఇక మాయం!

‘వెల్లుల్లితో క్యాన్సర్‌ నయం’ (Garlic cures Cancer) వంటి తప్పుదోవ పట్టించే వీడియోలను తొలగిస్తామని ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌ వేదిక యూట్యూబ్‌ (YouTube) వెల్లడించింది.

Updated : 16 Aug 2023 18:19 IST

దిల్లీ: తప్పుదోవ పట్టించే (Misinformation) వీడియోలకు సంబంధించి ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌ వేదిక యూట్యూబ్‌ (YouTube) కీలక ప్రకటన చేసింది. పలు ఆరోగ్య సమస్యలు, చికిత్సలు, ఔషధాలపై అసత్య సమాచారంపై తమ విధానాలను క్రమబద్ధీకరిస్తామని తెలిపింది. వైద్యాధికారులతోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్న కంటెంటును తొలగిస్తామని పేర్కొంది. ముఖ్యంగా ‘వెల్లుల్లితో క్యాన్సర్‌ నయం’ (Garlic cures Cancer) వంటి వీడియోలను తొలగిస్తామని యూట్యూబ్‌ స్పష్టం చేసింది.

‘తప్పుదోవ పట్టించే కంటెంటుపై దీర్ఘకాలిక వ్యూహాలు అమలు చేయడంపై దృష్టి సారించాం. వైద్యపరమైన అంశాల్లో నిర్మూలన, చికిత్స, నిరాకరణకు సంబంధించి ఇప్పటివరకు తమ వద్ద ఉన్న డజన్ల కొద్ది విధానాలను క్రమబద్ధీకరిస్తున్నాం. ఈ మూడు విభాగాల్లో తప్పుడు సమాచారంపై స్థానిక వైద్యాధికారులు లేదా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్న కంటెంటును విశ్లేషించి వాటిని తొలగిస్తాం’ అని యూట్యూబ్‌ తన బ్లాగ్‌లో పేర్కొంది. కచ్చితమైన చికిత్స ఉన్నప్పటికీ.. అందుకు బదులుగా నిరాధారమైన చికిత్సను ప్రోత్సహించే వీడియోలు, హానికలిగించే వీడియోలు ఇక ఉండవని తెలిపింది. ఉదాహరణకు ‘వెల్లుల్లితో క్యాన్సర్‌ నయం’ లేదా రేడియేషన్‌ థెరపీకి బదులు సీ విటమిన్‌ తీసుకోండి’ అంటూ ఉన్న వీడియోలను తొలగిస్తామని యూట్యూబ్‌ ప్రకటన చేసింది.

క్లోమ క్యాన్సర్‌కు టీకా

‘అసమర్థమైన, హానికలిగించే క్యాన్సర్‌ చికిత్సలతోపాటు వైద్య చికిత్స తీసుకోకుండా వీక్షకులను ప్రోత్సహించే కంటెంటును తొలగించే ప్రక్రియను నేటి నుంచే ప్రారంభిస్తున్నాం. మరికొన్ని వారాల్లో వీటిని మరింత విస్తృతం చేస్తాం. క్యాన్సర్‌ బారినపడిన వ్యక్తి లేదా వారి కుటుంబ సభ్యులు.. వ్యాధి లక్షణాలు, చికిత్స వంటి అంశాలను తెలుసుకునేందుకు ఆన్‌లైన్‌లో పరిశోధిస్తారు. అటువంటి వారికి అత్యంత నాణ్యమైన కంటెంటును అందించడమే తమ లక్ష్యం’ అని యూట్యూబ్‌ వెల్లడించింది. అయితే, వైద్యశాస్త్రంలో వస్తోన్న పురోగతిపై చర్చలు ఎంతో కీలకమైనందున అటువంటి అధ్యయనాలకు సంబంధించి ఆధారాలను వెల్లడించే, ఫలితాలపై చర్చించే కంటెంటును మాత్రం వీటినుంచి మినహాయింపు ఉంటుందని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని