క్లోమ క్యాన్సర్‌కు టీకా

ప్రాణాంతక క్యాన్సర్లలో క్లోమగ్రంథి (పాంక్రియాస్‌) క్యాన్సర్‌ ఒకటి. దీని బారినపడ్డవారిలో చికిత్స అనంతరం కేవలం 12% మందే ఐదేళ్ల వరకు జీవిస్తున్నారు.

Published : 15 Aug 2023 01:21 IST

ప్రాణాంతక క్యాన్సర్లలో క్లోమగ్రంథి (పాంక్రియాస్‌) క్యాన్సర్‌ ఒకటి. దీని బారినపడ్డవారిలో చికిత్స అనంతరం కేవలం 12% మందే ఐదేళ్ల వరకు జీవిస్తున్నారు. దీన్ని ఎదుర్కోవటానికి శాస్త్రవేత్తలు రూపొందించిన వినూత్న టీకా కొంతవరకు విజయవంతం కావటం కొత్త ఆశలు రేపుతోంది. కొవిడ్‌-19కు ఎంఆర్‌ఎన్‌ఏ టీకాను రూపొందించిన బయోఎన్‌టెక్‌ కంపెనీ శాస్త్రవేత్తలు అదే పరిజ్ఞానంతో ఈ క్యాన్సర్‌ టీకానూ రూపొందించారు. క్లోమక్యాన్సర్‌ బారినపడ్డ 19 మంది నుంచి తొలగించిన కణితుల  నమూనాలను తీసుకొని, వాటికి తగినట్టు వేర్వేరుగా, 20 వరకు ప్రొటీన్లకు జన్యు సూచనలు ఇచ్చేలా టీకాలను తయారుచేశారు. క్యాన్సర్‌ కణాలను రోగనిరోధక వ్యవస్థ గుర్తించేలా, వాటిపై దాడికి దిగేలా చేయటం వీటి ఉద్దేశం. కొన్ని నెలల వ్యవధిలో ఒక్కొక్కరికీ మొత్తం 9 టీకాలు ఇచ్చారు. ఎనిమిది మోతాదుల టీకా ఇచ్చిన తర్వాత ప్రామాణిక కీమోథెరపీ కూడా అందించారు. చికిత్స పూర్తయిన ఒకటిన్నర సంవత్సరాల తర్వాత 8 మందిలో క్యాన్సర్‌ పూర్తిగా నయం కావటం విశేషం. వీరిలో టీకాకు బలమైన రోగనిరోధక ప్రతిస్పందన పుట్టుకొచ్చింది. మిగతావారిలో ఎందుకు అంత బలంగా రోగనిరోధక ప్రతిస్పందన ఏర్పడలేదనేది తెలుసుకోవటం మీద శాస్త్రవేత్తలు ఇప్పుడు దృష్టి సారించారు. ఈ టీకాలపై పెద్దఎత్తున ప్రయోగ పరీక్షలకూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయా వ్యక్తులకు అనుగుణంగా తయారుచేసిన ఈ టీకాలు క్లోమక్యాన్సర్‌తో పోరాడేలా రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతుండటం ఆసక్తి కలిగిస్తోందని అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్‌ వినోద్‌ బాలచంద్రన్‌ పేర్కొంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని