Vaccination: 2 కోట్ల మంది టీనేజర్లకు రెండు డోసులూ పూర్తి

వ్యాక్సినేషన్‌లో భారత్‌ మరో ఘనత సాధించింది. ఇప్పటివరకు 2కోట్ల మందికి పైగా 15-18 సంవత్సరాలవారికి వ్యాక్సిన్‌ రెండు డోసులూ......

Updated : 19 Feb 2022 08:39 IST

దిల్లీ: వ్యాక్సినేషన్‌లో భారత్‌ మరో మైలురాయి అందుకుంది. దేశంలోని 80 శాతం మంది వయోజనులు రెండు డోసుల టీకాలు తీసుకున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ వెల్లడించారు. ‘దేశంలోని అర్హత కలిగిన 80 శాతం మంది వయోజనులకు రెండు డోసుల వ్యాక్సిన్‌లను అందించి చారిత్రక మైలురాయిని అధిగమించాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం 100 శాతం వ్యాక్సినేషన్ సాధించే దిశగా వేగంగా ముందుకు సాగుతోంది’ అంటూ ట్విటర్‌ వేదికగా పేర్కొన్నారు.

2కోట్ల మంది టీనేజర్లకు రెండు డోసులు

జనవరి 3 నుంచి టీనేజర్లకు ప్రారంభించిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో భాగంగా 2కోట్ల మంది రెండు డోసులు తీసుకున్నారు. ఇప్పటివరకు 2కోట్ల మందికి పైగా 15-18 సంవత్సరాలవారికి వ్యాక్సిన్‌ రెండు డోసులూ పూర్తయినట్టు మాండవీయ వెల్లడించారు.‘ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను యువ భారతం మరోస్థాయికి తీసుకువెళుతోంది. 15-18 ఏళ్ల మధ్య వయసున్న 2 కోట్ల మంది యువత పూర్తి స్థాయిలో కొవిడ్‌ టీకాలు తీసుకున్నారు’ అంటూ మరో ట్వీట్‌ చేశారు.

కొవిడ్‌ థర్డ్‌వేవ్‌ నుంచి భారత్‌ కోలుకుంటోంది. కేసులు క్రమంగా అదుపులోకి వస్తున్నాయి. కొత్త కేసులు తగ్గుముఖం పడుతూ.. 25 వేలకు దిగొచ్చాయి. గురువారం 25,920 మందికి వైరస్ నిర్ధరణ అయ్యింది. ముందురోజు కంటే 4,837 కేసులు తక్కువగా నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 2.07 శాతానికి తగ్గిపోయింది.  492 మంది మృతిచెందారు. దేశంలో ఇప్పటివరకు 4.27 కోట్ల మందికి కరోనా సోకగా.. మొత్తం మరణాల సంఖ్య  5.10 లక్షలు దాటింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని