కరోనా మృతుల్లో 70% మంది పురుషులే!

భారత్‌లో కరోనా వైరస్‌ మహిళల కన్నా పురుషులపైనే ఎక్కువ ప్రభావం చూపించినట్టు కేంద్రం తెలిపింది. దేశంలో కరోనా బారిన పడి మృతిచెందిన వారిలో 70శాతం మంది మగవారేనని వెల్లడించింది. కరోనా కాటుకు బలైన వారిలో 55శాతం మంది............

Updated : 29 Dec 2020 18:36 IST

దిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ మహిళల కన్నా పురుషులపైనే ఎక్కువ ప్రభావం చూపించినట్టు కేంద్రం తెలిపింది. దేశంలో కరోనా బారిన పడి మృతిచెందిన వారిలో 70శాతం మంది మగవారేనని వెల్లడించింది. కరోనా కాటుకు బలైన వారిలో 55శాతం మంది 60 ఏళ్లకు పైబడినవారే ఉన్నారు. దేశంలో కరోనా పరిస్థితిపై వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు విడుదల చేశారు. ఆరు నెలల తర్వాత దేశంలో తొలిసారి 17వేల కన్నా తక్కువ పాజిటివ్‌ కేసులు; 300 కన్నా తక్కువ మరణాలు సోమవారం నమోదైనట్టు పేర్కొన్నారు. పాజిటివిటీ రేటు ప్రస్తుతం 6.02శాతంగా ఉన్నట్టు తెలిపారు.


యువతపైనే వైరస్‌ అధిక ప్రభావం..
కొవిడ్‌ బారిన పడినవారిలో 63శాతం మంది పురుషులు కాగా.. 37శాతం మంది మహిళలు ఉన్నారు. వైరస్‌ సోకినవారిలో యువకులే అధికం. వైరస్‌ సోకినవారిలో 52శాతం మంది 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్సువారు ఉండగా.. 60 ఏళ్లు పైబడినవారు 14శాతం, 45 నుంచి 60 ఏళ్ల వయస్సు ఉన్నవారు 26శాతం, 17 ఏళ్లకంటే తక్కువ వయస్సు గలవారు  8శాతంగా ఉన్నారు. 


ఈ 5రాష్ట్రాల్లోనే ఎక్కువ యాక్టివ్‌ కేసులు 
భారత్‌లో తాజాగా నమోదైన కేసులతో (16,423) కలిపి కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,02,24,303కి పెరిగింది. వీరిలో 98,07,569 మంది (95.92శాతం) కోలుకొని డిశ్చార్జి కాగా.. 1,48,153 మంది (1.45శాతం) మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 2,68,581 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఈ యాక్టివ్‌ కేసుల్లో దాదాపు 60శాతం కేవలం ఐదు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. కేరళ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, యూపీ, ఛత్తీస్‌గఢ్‌లలోనే యాక్టివ్‌ కేసులు అధికంగా ఉన్నాయి. ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దగ్గర కొవిడ్‌ కేసుల తీవ్రత తక్కువగానే ఉంది. ప్రతి మిలియన్‌ జనాభాకు భారత్‌లో 7408  కేసులు నమోదు కాగా.. అమెరికాలో ఆ సంఖ్య  56,879గా ఉంది. అలాగే,  ఫ్రాన్స్‌లో 38,550, బ్రెజిల్‌లో 35,123, ఇటలీలో 33,867, యూకే 33,708, రష్యాలో 21,091 చొప్పున కేసులు నమోదయ్యాయి. 


ఇదీ చదవండి..

విదేశాల నుంచి వచ్చిన అందరికీ ‘జీనోమ్‌’

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని