ఇక పిల్లలపై క్లినికల్‌ ట్రయల్స్‌!

కరోనా టీకాలను చిన్నారులు, టీనేజీ పిల్లలపై జరిపేందుకు చైనా సంస్థ సినోవాక్‌ సిద్ధమైంది. మూడు నుంచి 17ఏళ్ల వయస్సు కలిగిన వారిలో తొలి, రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు ఏర్పాట్లు చేస్తోంది.

Published : 18 Sep 2020 15:52 IST

తొలి, రెండో దశ ప్రయోగాలకు సిద్ధమైన చైనా సంస్థ సినోవాక్‌

బీజింగ్‌: మానవాళిని వణికిస్తోన్న కరోనా వైరస్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్‌ అభివృద్ధిలో ప్రపంచదేశాలు ఇప్పటికే నిమగ్నమయ్యాయి. అయితే, ప్రస్తుతం ఈ ప్రయోగాలన్నీ వయోజనులపైనే జరుగుతున్నాయి. తాజాగా వీటిని చిన్నారులు, టీనేజీ పిల్లలపై జరిపేందుకు చైనా సంస్థ సినోవాక్‌ సిద్ధమైంది. మూడు నుంచి 17ఏళ్ల వయస్సు కలిగిన వారిలో తొలి, రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు సన్నాహాలు చేస్తోంది.

ఈ వ్యాక్సిన్‌లు ప్రపంచంలో అన్ని వయస్సుల వారిలో వైరస్‌ను సమర్థవంతంగా నిరోధించగలిగినప్పుడు మాత్రమే ఈ మహమ్మారి నుంచి పూర్తిగా బయటపడే పరిస్థితి నెలకొంది. దీనిలో భాగంగా అన్ని వయస్సుల వారిపై పరిశోధనలు జరగాల్సి ఉంది. కరోనా వైరస్‌ బయటపడ్డ తర్వాత చిన్నారులతో పోల్చితే పెద్దవారికే ఈ వైరస్‌ ముప్పు ఎక్కువగా ఉన్నట్లు ఇప్పటి వరకు తేలింది. దీంతో, ప్రస్తుతం వైరస్‌ ముప్పు ఎక్కువగా ఉన్న పెద్దవారిని కాపాడటమే లక్ష్యంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. అయితే, కొన్ని సందర్భాల్లో వైరస్‌ సోకిన చిన్నారులను కూడా ఐసీయూ చికిత్స అందిచాల్సి వస్తోందని ప్రపంచ ఆరోగ్యసంస్థ ఇది వరకే నివేదించింది. అమెరికాలో వందల మంది చిన్నారులు వైరస్‌ బారినపడిన పడినప్పటికీ, కొందరిలో మాత్రం తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తినట్లు డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. ఈ సమయంలో చిన్నారులకు కూడా వ్యాక్సిన్‌ తొందరగా తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది.

ఈ సమయంలో చైనాకు చెందిన సినోవాక్స్‌ చిన్నారులపై వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం మూడు నుంచి 17ఏళ్ల ఆరోగ్యవంతమైన 552 మంది చిన్నారులను ఎంపిక చేసుకొంది. వీరిపై వ్యాక్సిన్ తొలి, రెండో దశ ప్రయోగాలను సెప్టెంబర్‌ 28న మొదలుపెట్టనుంది. వీటికి చైనాలోని నియంత్రణ సంస్థలు కూడా ఆమోదముద్ర వేసినట్లు సినోవాక్‌ అధికార ప్రతినిధి వెల్లడించింది. వీటి ప్రాథమిక ఫలితాలు మాత్రం వచ్చే జనవరిలో తెలిసే అవకాశం ఉన్నట్లు కంపెనీ అంచనా వేస్తోంది.

క్లినికల్‌ ట్రయల్స్‌లో భాగంగా సినోవాక్‌ తయారుచేసిన వ్యాక్సిన్‌ను ఇప్పటికే వేలమందిపై ప్రయోగిస్తున్నారు. మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌ బ్రెజిల్‌, ఇండోనేషియా, టర్కీలో జరుగుతున్నాయి. వీటితోపాటు సినోవాక్‌ కంపెనీ సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల్లో దాదాపు 90శాతం మందికి టీకాలు వేసినట్లు ఇప్పటికే ఆ సంస్థ‌ ప్రకటించింది. అయితే, ఇప్పటివరకు తమ వ్యాక్సిన్‌ ‘కరోనావాక్‌’ సురక్షితంగానే కనిపిస్తోందని, పెద్దవారిలో కూడా యాంటీబాడీలు కూడా ఉత్పత్తి అవుతున్నట్లు గుర్తించామని పేర్కొంది. ఈ సమయంలో చిన్నారుల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించడం ఆసక్తికరంగా మారింది. ఇదిలాఉంటే, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే పలు వ్యాక్సిన్‌లు తుదిదశ క్లినికల్‌ ట్రయల్స్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. మూడోదశ ప్రయోగాల కోసం ఒక్కో కంపెనీ 30వేల మందికి పైగా వాలంటీర్లపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తున్నాయి. రష్యా, చైనా టీకాలతోపాటు ఆక్స్‌ఫర్డ్‌, మోడెర్నా, ఫైజర్‌ తయారుచేసిన టీకాలు ప్రయోగదశల్లో ముందున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు