‘రాజ్యాంగ బాధ్యతల నిర్వహణలో కేంద్రం విఫలం’

రాజ్యాంగబద్దమైన బాధ్యతలను నిర్విర్తించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్‌ అధినాయకురాలు సోనియాగాంధీ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా సమస్యలపై పోరాడాలని పార్టీ నాయకులకు సోనియా సూచించారు.

Published : 19 Oct 2020 00:41 IST

దిల్లీ: రాజ్యాంగబద్దమైన బాధ్యతలను నిర్విర్తించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్‌ అధినాయకురాలు సోనియాగాంధీ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా సమస్యలపై పోరాడాలని పార్టీ నాయకులకు సోనియా సూచించారు. ఈ మేరకు ఆమె ఆదివారం కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.‘రాజ్యాంగ బద్దమైన బాధ్యతలను నిర్వర్తించడంలో సైతం కేంద్ర ప్రభుత్వం విఫలమవుతోందది. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహార వాటాను ఇవ్వడానికి కేంద్రం నిరాకరిస్తోంది. పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఏవిధంగా సహాయం చేయగలవు. కేంద్రం ఇలా తన రాజ్యాంగపరమైన బాధ్యతలను పట్టించుకోకపోవడం ఏంటి’అని సోనియా ప్రశ్నించారు. 

‘తోటి భారతీయులు, కాంగ్రెస్‌ ప్రభుత్వం శ్రమించి నిర్మించిన భారత ఆర్థిక వ్యవస్థను భాజపా ప్రభుత్వం ఏకకాలంలో కూల్చి వేసింది. దేశ జీడీపీ ఇంతగా దిగజారడం దేశ చరిత్రలోనే లేదు. ఈ రోజు యువతకు ఉద్యోగాలు సైతం లేవు. రైతులకు వ్యతిరేకంగా కేంద్రం మూడు వ్యవసాయ బిల్లులను తీసుకువచ్చి వారిపై కోలుకోలేని దెబ్బ వేసింది. ‘హరిత విప్లవం’ ప్రయోజనాలను దెబ్బతీసేందుకు చేస్తున్న కుట్రే ఇది. దీని ప్రభావం కోట్లాది మంది రైతులు, కూలీలు, చిన్న వ్యాపారులపై పడుతుంది’అని సోనియా కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పటికే ఆమె వ్యవసాయ బిల్లులపై స్పందిస్తూ.. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలు ఆ బిల్లుల అమలుకు నోచుకోకుండా ప్రత్యామ్నాయ బిల్లులు అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని సూచించారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ తీసుకుంటున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలు సహా పార్టీ భవిష్యత్‌ కార్యచరణ గురించి చర్చించినట్లు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఓ ప్రకటనలో తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని