దేశ భద్రతపై వెనకడుగు వేసేది లేదు: రాజ్‌నాథ్‌

షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీవో) సమావేశం వేదికగా చైనా రక్షణ మంత్రితో జరిగిన భేటీలో సరిహద్దు వివాదాలపై భారత్ వైఖరిని మన దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ స్పష్టంగా తెలియజేసినట్లు కేంద్రం వెల్లడించింది.......

Updated : 05 Sep 2020 15:31 IST

చైనా రక్షణ మంత్రితో భేటీలో భారత్‌ స్పష్టీకరణ
వివాదాల్ని శాంతియుతంగా పరిష్కరించుకుందామని ఉద్ఘాటన

దిల్లీ: షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీవో) సమావేశం వేదికగా చైనా రక్షణ మంత్రితో జరిగిన భేటీలో సరిహద్దు వివాదాలపై భారత్ వైఖరిని మన దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ స్పష్టంగా తెలియజేసినట్లు కేంద్రం వెల్లడించింది. గత కొన్ని నెలలుగా సరిహద్దుల్లోని గల్వాన్‌ లోయ సహా వాస్తవాధీన రేఖ వెంట పలు ప్రాంతాల్లో జరిగిన పరిణామాలపై రాజ్‌నాథ్‌ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. భారీ ఎత్తున దళాలను మోహరిస్తూ దూకుడుగా వ్యవహరించడాన్ని వ్యతిరేకించారు. యథాతథ పరిస్థితిని కొనసాగించాలన్న ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నారని నేరుగా ఆ దేశ రక్షణ శాఖ మంత్రికే తెలియజేశారు. పలు దఫాల చర్చల్లో కుదిరిన అవగాహనా ఒప్పందాల మేరకు పరిస్థితులు లేవని స్పష్టం చేశారు. 

సరిహద్దు భద్రత విషయంలో భారత సైన్యం ఎప్పుడూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని రాజ్‌నాథ్‌ ఈ భేటీలో స్పష్టం చేశారు. అయితే, భారత సార్వభౌమత్వానికి, ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగితే ఎలాంటి చర్యకైనా వెనకడుగు వేసేది లేదని తేల్చి చెప్పారు. ఇరు దేశాధినేతల మధ్య కుదిరిన ఏకాభిప్రాయాల్ని ఉభయ పక్షాలూ అమలు చేయాలని సూచించారు. చర్చలు, సంప్రదింపుల ద్వారానే సమస్యల్ని పరిష్కరించడం కొనసాగించాలని తెలిపారు. పదే పదే ఘర్షణలకు దిగకుండా దళాలను నియంత్రించే వ్యవస్థ ను పటిష్ఠం చేయాలని కోరారు. ప్రస్తుత వివాదాల్ని వీలైనంత త్వరగా పరిష్కరించి ఇరు దేశాల మధ్య సత్సంబంధాల్ని పునరుద్ధరించే దిశగా అడుగులు వేయాలని సూచించారు. సరిహద్దుల్లో పరిస్థితులు మరింత దిగజారే, ఉద్రిక్తంగా మారే దిశగా ఎలాంటి చర్యలకు పాల్పడొద్దని స్పష్టం చేశారు. ప్రాంతీయంగా శాంతి, సుస్థిరతను నెలకొల్పేందుకు చైనా వైపు నుంచి సహకారం కావాలని కోరారు. తమ వైపు నుంచి వస్తున్న సమస్యలు, అభ్యంతరాలను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు కృషి చేస్తామని చైనా రక్షణ మంత్రి వెయ్‌ ఫెంఘె హామీ ఇచ్చినట్లు సమాచారం. మంత్రులు సహా అన్ని స్థాయిల్లో నిరంతర చర్చలు జరగాల్సిన అసవరం ఉందని పేర్కొన్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని