ఆస్ట్రేలియా జనాభా కంటే ఆ బానిసలే ఎక్కువ!

వెట్టిచాకిరి(డెట్ బాండేజ్‌), నిర్బంధ చాకిరి, బలవంతపు వివాహాలు, దాస్యం(డొమెస్టిక్‌ సర్విట్యూడ్‌) కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 2.9 కోట్ల మంది మహిళలు, బాలికలు ఆధునిక బానిసత్వంలో మగ్గుతున్నారని ఓ నివేదిక అంచనా వేసింది.

Published : 11 Oct 2020 01:01 IST

ఆధునిక బానిసత్వంలో 2.9 కోట్ల మంది మహిళలు, బాలికలు

న్యూయార్క్: వెట్టిచాకిరి(డెట్ బాండేజ్‌), నిర్బంధ చాకిరి, బలవంతపు వివాహాలు, దాస్యం(డొమెస్టిక్‌ సర్విట్యూడ్‌) కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 2.9 కోట్ల మంది మహిళలు, బాలికలు ఆధునిక బానిసత్వంలో మగ్గుతున్నారని ఓ నివేదిక అంచనా వేసింది. ప్రతి 130 మందిలో ఒకరు ఈ దోపిడీకి గురవుతున్నట్లు వాక్‌ ఫ్రీ యాంటీ స్లేవరీ సహ వ్యవస్థాపకురాలు గ్రేస్‌ ఫొరెస్ట్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్న వారి సంఖ్య ఆస్ట్రేలియా జనాభా కంటే ఎక్కువగా ఉండటం ఆందోళనకర పరిణామమన్నారు. మానవ చరిత్రలో ఏ సమయంలోనూ ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు బానిసత్వ సంకెళ్లలో లేరని ఐరాసలో మీడియా సమావేశంలో ఆమె వాస్తవాలను వెల్లడించారు. కాగా, ఈ సంస్థతో పాటు ఐరాస అనుబంధ సంస్థలైన ఇంటర్నేషనల్ లేబర్‌ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఫర్ మైగ్రేషన్‌ సంయుక్తంగా ఈ సర్వేను నిర్వహించి, ‘స్టేక్‌డ్‌ ఆడ్స్‌’ పేరుతో ఈ నివేదికను వెలువరించాయి. 

వ్యక్తిగత, ఆర్థిక లాభం కోసం ఒక వ్యక్తిని మరో వ్యక్తి స్వేచ్ఛను క్రమంగా దోచుకోవడమే ఆధునిక బానిసత్వమని వాక్‌ ఫ్రీ సంస్థ నిర్వచించినట్లు గ్రేస్‌ వివరించారు. తల్లి గర్భంలో ప్రాణం పోసుకున్నప్పటి నుంచే మహిళలు లింగ అసమానతలను ఎదుర్కొంటున్నారని ఆమె వాపోయారు. కొవిడ్ కారణంగా ఈ పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యాయని వాస్తవాలను వెల్లడించారు. ఆధునిక బానిసత్వాన్ని నిర్మూలించాలని డిమాండ్ చేస్తూ వాక్‌ ఫ్రీ, మహిళలు, చిన్నారులకు సంబంధించిన ఐరాస కార్యక్రమాలు ప్రచారాన్ని ప్రారంభిస్తున్నాయన్నారు. బలవంతపు, బాల్య వివాహాల అంతానికి ఈ ప్రచారం దోహదం చేస్తుందని, అయితే 136 దేశాల్లో బాల్య వివాహాలు చేయడం నేరం కాదని ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు. చట్టబద్ధ దోపిడీ వ్యవస్థ అయిన కెఫాలా నిర్మూలనను ఈ ప్రచారంలో భాగం చేస్తామని ఆమె తెలిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని