కొవిడ్‌ ఆస్పత్రులపై సుప్రీం కీలక ఆదేశం

కరోనా వైరస్‌ చికిత్స కొనసాగుతున్న ఆస్పత్రులకు సంబంధించి సుప్రీంకోర్టు నేడు కీలక ఆదేశాలను జారీచేసింది.

Published : 18 Dec 2020 13:18 IST

నాలుగు వారాల వ్యవధి ఇచ్చిన ధర్మాసనం

దిల్లీ: కరోనా వైరస్‌ చికిత్స కొనసాగుతున్న ఆస్పత్రులకు సంబంధించి సుప్రీంకోర్టు నేడు కీలక ఆదేశాలను జారీచేసింది. దేశవ్యాప్తంగా కొవిడ్‌-19 చికిత్స అందించే ప్రతి ఆస్పత్రిలోనూ అగ్ని ప్రమాదాల నివారణకు సంబంధించిన ‘ఫైర్‌ సేఫ్టీ ఆడిట్‌’ను నిర్వహించాలని రాష్ట్రాలకు నిర్దేశించింది. సదరు వైద్యారోగ్య సంస్థల్లో అవాంఛిత ఘటనలను, అగ్ని ప్రమాదాలను నివారించేందుకు ఈ చర్య చాలా అవసరమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆయా వైద్యశాలలు నాలుగు వారాల్లోగా అగ్నిమాపక శాఖ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) తీసుకోవాలని.. లేదంటే తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సుప్రీం హెచ్చరించింది.

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో కరోనా చికిత్స కోసం కేటాయించిన ఓ ఆస్పత్రిలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం కారణంగా.. పలువురు రోగులు మరణించిన ఘటనను సుప్రీం పరిగణనలోకి తీసుకుంది. జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలో న్యాయమూర్తులు ఆర్‌.ఎస్.‌ రెడ్డి, ఎం.ఆర్.‌ షాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. అగ్నిమాపక శాఖ ఇచ్చే నిరభ్యంతర పత్రం గడువు ముగిసిన కొవిడ్‌ ఆస్పత్రులు, వాటిని నాలుగు వారాల్లోగా పునరుద్ధరించుకోవాలని ఆదేశించింది. ఇక రాజకీయ ఊరేగింపుల్లో కొవిడ్‌-19 మార్గదర్శకాలను పాటించే అంశాన్ని ఎన్నికల సంఘం పరిశీలిస్తుందని సుప్రీం ధర్మాసనం తెలిపింది.

ఇవీ చదవండి..

రాష్ట్రాల అధికార పరిధిని అతిక్రమిస్తున్నారు

గుజరాత్‌లో మరో ప్రాణాంతక వ్యాధి
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని