
ప్రతిపక్షాలను ఏకం చేసే దిశగా పవార్!
ముంబయి: ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ దేశంలో ప్రతిపక్షాలను ఏకం చేసే దిశగా పనిచేయనున్నారని ఆ పార్టీ నేత నవాబ్ మాలిక్ వెల్లడించారు. ఓ వైపు యూపీఏ కూటమికి పవార్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయంటూ ఇప్పటికే వార్తలు వస్తున్న తరుణంలో మాలిక్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. శనివారం పవార్ 80వ జన్మదినం సందర్భంగా ఆయన ఈవిధంగా వ్యాఖ్యలు చేశారు.
‘శరద్‌పవార్ దేశంలో ప్రతిపక్షాలను ఏకం చేసే దిశగా పనిచేయనున్నారు. ఆ కూటమికి నాయకత్వం ఎవరు వహిస్తారనేది ఇప్పుడు ముఖ్యం కాదు. నాయకత్వంపై సీనియర్ నాయకులు తర్వాత నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడైతే ప్రతిపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉంది. ప్రజల సమస్యల్ని వెలుగులోకి తేవడానికి ప్రతిపక్షాల్ని ఏకం చేసే దిశగా తాను పనిచేస్తున్నట్లు పవార్ ఇటీవల చెప్పారు. 2014లోనూ ఆయన యూపీఏ వైఫల్యానికి గల కారణాలను ప్రస్తావించారు’ అని మాలిక్ వెల్లడించారు.
పవార్ జన్మదినం సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు శుభాకాంక్షలు చెప్పిన విషయం గురించి మాలిక్‌ను ప్రశ్నించగా.. ‘పవార్ 60ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. మహారాష్ట్ర సీఎంగా, కేంద్రమంత్రిగా పలు కీలక పదవులు అధిరోహించారు. దీంతో ఆయనకు అన్ని పార్టీలతో మంచి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి సీనియర్ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడం సహజమే’ అని పేర్కొన్నారు.
సిద్ధాంతాల విషయంలో రాజీ పడకూడదు: పవార్
రాజకీయ కార్యకర్తలు పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాలని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. తన 80వ జన్మదినం సందర్భంగా పార్టీ తరపున నిర్వహించిన సమావేశంలో ఆయన కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. ‘రాజకీయ పార్టీల కార్యకర్తలు తమ సిద్ధాంతాల విషయంలో ఎప్పుడూ రాజీపడకూడదు. మంచి రాజకీయ నాయకులను, కార్యకర్తలను సృష్టించడం ద్వారా రాష్ట్ర, దేశ భవిష్యత్తును బలోపేతం చేసినట్లవుతాం. కొత్త తరం రాజకీయ కార్యకర్తలు మహాత్మా జ్యోతిబాపూలే, బీఆర్ అంబేద్కర్, ఛత్రపతి సాహు మహారాజ్‌ల ప్రగతిశీల భావజాలాన్ని అనుసరించాలి. సామాజిక అభివృద్ధి విషయంలో రాజకీయ నాయకులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సమాజంలో అందరికన్నా పేదవాడి అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనిచేసినప్పుడే మంచి మార్గంలో పయనించగలరు. గత ఐదు దశాబ్దాలుగా ప్రజలు నాకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించారు.
ఇదీ చదవండి..
రైతుల ఆదాయం పెంచడానికే కొత్త చట్టాలు: మోదీ
తమన్నా హార్ట్ బ్రేక్ చేసింది ఎవరు?