రైతులతో కేంద్రం చర్చలు: ప్రతిష్టంభన వీడేనా?

కేంద్రం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా 35 రోజులుగా పోరుబాట కొనసాగిస్తున్న రైతు సంఘాల నేతలతో కేంద్రం ఆరో దఫా చర్చలు ప్రారంభించింది. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ నేతృత్వంలోని..........

Published : 30 Dec 2020 15:55 IST

విజ్ఞాన్‌ భవన్‌లో కొనసాగుతున్న చర్చలు 

దిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన కొత్తసాగు చట్టాలకు వ్యతిరేకంగా 35 రోజులుగా పోరుబాట కొనసాగిస్తున్న రైతు సంఘాల నేతలతో కేంద్రం ఆరో దఫా చర్చలు ప్రారంభించింది. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ నేతృత్వంలోని కేంద్రమంత్రుల బృందం అన్నదాతలతో విజ్ఞాన్‌ భవన్‌లో చర్చలు కొనసాగిస్తోంది. రైతులు లేవనెత్తిన అంశాలపై సమగ్ర చర్చలు జరిగి..  రైతుల ఆందోళన నేటితో ముగిసిపోతుందని కేంద్రమంత్రులు ఆశాభావం వ్యక్తంచేయగా.. నేడు కూడా పరిష్కారం లభించకపోవచ్చని అన్నదాతలు పేర్కొంటున్నారు. దీంతో ఈ దఫా చర్చల్లోనైనా కేంద్రం, అన్నదాతల మధ్య సమస్యల పరిష్కారంపై ప్రతిష్టంభనకు తెరపడుతుందో లేదో చూడాలి. కేంద్రమంత్రులు తోమర్‌తో పాటు పీయూష్‌ గోయల్‌, సోంప్రకాశ్‌  40 రైతు సంఘాల నేతలతో చర్చల్లో పాల్గొన్నారు. 

మరోవైపు, తొలినుంచీ తమ డిమాండ్లపై వెనక్కి తగ్గేది లేదని రైతు సంఘాల నేతలు తేల్చి చెబుతున్నారు. మూడు చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించే అంశాలను అజెండా నుంచి తొలగించే ప్రసక్తే లేదంటున్నారు. దిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన రైతులపై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా వాయునాణ్యత నిర్వహణ కమిషన్‌ ఆర్డినెన్స్‌లో సవరణల అంశంపైనా చర్చించాలని కోరుతున్నాయి. దీంతో పాటు 2020 విద్యుత్‌ సవరణ ముసాయిదా బిల్లులో కూడా చేయాల్సిన మార్పుల అంశాన్ని కూడా అజెండాలో చేర్చాలని డిమాండ్‌ చేస్తున్నాయి. అయితే, ఈ రోజు కొనసాగుతున్న చర్చల్లో పరిష్కారం దొరుకుతుందని తాము భావించడంలేదని కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్‌ కమిటీ కన్వీనర్‌ సుఖ్విందర్‌ సబ్రా పేర్కొంటుండగా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ చర్చల్లో రైతులను సమాధానపరిచి ఆందోళనను విరమించగలమనే ఆశాభావాన్ని వ్యక్తంచేస్తోంది. ఆ దిశగా చర్చలు జరిగి రైతుల ఆందోళన నేటితో ముగియగలదని భావిస్తున్నట్టు కేంద్ర వాణిజ్యశాఖ సహాయ మంత్రి, పంజాబ్‌కు చెందిన ఎంపీ సోం ప్రకాశ్‌ తెలిపారు. కనీస మద్దతు ధర సహా అన్ని అంశాలపైనా చర్చిస్తామని ఆయన అన్నారు. 

ఇదీ చదవండి..

ఆస్ట్రాజెనెకా టీకాకు యూకే అనుమతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని