అమెరికా ఫలితాలు.. ఇంకెంత ఆలస్యం..?

అగ్రరాజ్యాధిపతి ఎవరో నిర్ణయించే ఎన్నికల ఫలితాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటి వరకు 50 రాష్ట్రాలకు గానూ 46 రాష్ట్రాల ఫలితాలు వెలువడగా.. డెమొక్రాట్‌ అభ్యర్థి జో బైడెన్‌ 264 ఎలక్టోరల్‌ ఓట్లతో ముందంజలో......

Updated : 05 Nov 2020 20:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అగ్రరాజ్యాధిపతి ఎవరో నిర్ణయించే ఎన్నికల ఫలితాలపై ఇంకా స్పష్టత రాలేదు. డెమొక్రాట్‌ అభ్యర్థి జో బైడెన్‌ 264 ఎలక్టోరల్‌ ఓట్లతో ముందంజలో ఉన్నారు. రిపబ్లికన్‌ అభ్యర్థి ట్రంప్‌ 214 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించారు. మేజిక్‌ ఫిగర్‌ 270 సాధించిన వారే అధ్యక్షుడు కానున్నారు. ఈ క్రమంలో కీలకమైన పెన్సిల్వేనియా, నెవాడా, నార్త్‌ కరోలినా, జార్జియా రాష్ట్రాల్లో ఫలితాలు వెలువడాల్సి ఉంది. భారీగా పోలైన పోస్టల్‌ బ్యాలెట్స్ (మెయిల్‌- ఇన్‌) ‌ లెక్కింపు చేపట్టాల్సి ఉండడమే ఇందుకు కారణం. మరి ఆయా రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపునకు ఎంత సమయం పట్టనుందో చూద్దాం..

పెన్సిల్వేనియా (20)

మొత్తం 20 ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్న ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు 89 శాతం ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. డొనాల్డ్‌ ట్రంప్‌ 50.7 శాతం ఓట్లతో ముందంజలో ఉండగా.. బైడెన్‌ 48.1 శాతం ఓట్లతో వెనుకబడ్డారు. గతంలో ఈ రాష్ట్రంలో ట్రంపే గెలుపొందారు. ఇక్కడ ఓట్ల లెక్కింపునకు శుక్రవారం (అమెరికా కాలమానం ప్రకారం) వరకు సమయం పట్టే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. మొత్తం 10 లక్షల మెయిల్‌- ఇన్‌ ఓట్లను లెక్కించాలి. ఇక్కడ మెయిల్‌-ఇన్‌ ఓట్లు ఎక్కువగా డెమొక్రాట్లకే పడే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో పెన్సిల్వేనియా ఓట్ల లెక్కింపుపై మూడు పిటిషన్లు దాఖలయ్యాయి.

జార్జియా (16)

గతంలో ట్రంప్‌ గెలుపొందిన రాష్ట్రమిది. ఇక్కడ 16 ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్నాయి. ఇప్పటి వరకు 98 శాతం ఓట్ల లెక్కింపు జరిగింది.  ఇక్కడ 49.6 శాతం ఓట్లతో ట్రంప్‌ ముందంజలో ఉండగా.. బైడెన్‌ 49.2 శాతం ఓట్లతో కాస్త వెనకున్నారు. త్వరలోనే ఈ ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

నార్త్‌ కరోలినా (15)

15 ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్న ఉత్తర కరోలినా కూడా గతంలో ట్రంప్‌ గెలుపొందారు. ఇప్పటి వరకు 94 శాతం ఓట్ల లెక్కింపు చేపట్టగా.. 50.1 శాతం ఓట్లతో ట్రంప్‌ ముందంజలో ఉన్నారు. బైడెన్‌కు 48.7 శాతం ఓట్లు వచ్చాయి. ఎన్నికల తేదీ రోజున వేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు చేరడానికి ఇక్కడ నవంబర్‌ 12 వరకు అనుమతిస్తున్నారు. దీంతో నవంబర్‌ 13 వరకు తుది ఫలితాలు వెల్లడయ్యే అవకాశం కనిపించడం లేదు.

నెవాడా (6)

మొత్తం ఆరు ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్న ఈ రాష్ట్రంలో గతంలో హిల్లరీ క్లింటన్‌ గెలుపొందారు. ఇప్పటి వరకు 75 శాతం ఓట్లు మాత్రమే లెక్కించారు. బైడెన్‌ 49.3 శాతం ఓట్లతో ముందంజలో ఉన్నారు. ట్రంప్‌కు 48.7 శాతం ఓట్లు వచ్చాయి. ఎన్నికల తేదీ రోజు వేసిన పోస్టల్‌ బ్యాలెట్లను ఇక్కడ నవంబర్‌ 10వ తేదీ వరకు అనుమతించనున్నారు. దీంతో ఇక్కడా ఫలితం మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇవీ చదవండి..

అధ్యక్ష పీఠం: రెండోసారి ఓడిపోయిన నేతలు..!

బెర్నీ.. ముందే చెప్పేశాడు ఇవన్నీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని