Delhi Mayor: హోరాహోరీగా దిల్లీ మేయర్‌ ఎన్నిక.. కొత్త మేయర్‌గా షెల్లీ ఒబెరాయ్‌

దిల్లీ మేయర్‌(Delhi mayor) పీఠాన్ని ఆప్‌ గెలుచుకుంది. హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి రేఖా గుప్తాపై ఆప్‌ అభ్యర్థి షెల్లా ఒబెరాయ్‌(Shelly Oberoi) విజయం సాధించారు.

Updated : 22 Feb 2023 15:53 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ (Delhi)లో హోరాహోరీగా జరిగిన మేయర్‌ ఎన్నిక (Mayor election)ల్లో ఆప్‌ విజయం సాధించింది. భాజపా అభ్యర్థి రేఖా గుప్తాపై 34 ఓట్ల తేడాతో ఆప్‌ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్‌(Shelly Oberoi ) గెలుపొందారు. మొత్తం 266 ఓట్లు పోల్‌ కాగా.. షెల్లీ ఒబెరాయ్‌కు 150 ఓట్లు; రేఖా గుప్తాకు 116 ఓట్లు వచ్చాయి.  దీంతో దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఆప్‌ శ్రేణులు సంబరాల్లో మునిగితేలాయి. కట్టుదిట్టమైన భద్రత మధ్య నిర్వహించిన ఈ ఎన్నికల్లో కొత్త మేయర్‌గా ఎన్నికైన షెల్లీ ఒబేరాయ్‌కు దిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌, డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా అభినందనలు తెలిపారు. ‘‘ ప్రజలు గెలిచారు. దిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో ఆప్‌ను గెలిపించిన కార్యకర్తలు, ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆప్‌ తొలి మేయర్‌ షెల్లీ ఒబేరాయ్‌కు హృదయపూర్వ అభినందనలు’’ అని ట్వీట్‌ చేశారు.

మూడు సార్లు ఎన్నిక వాయిదా.. అసలేం జరిగింది..?

గతేడాది డిసెంబర్‌లో జరిగిన దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్(MCD Polls) ఎన్నికలో ఆప్‌ ఘన విజయం సాధించించిన విషయం తెలిసిందే. మొత్తం 250 వార్డుల్లో మెజార్టీ మార్క్‌(126)ను దాటి.. ఏకంగా 134 స్థానాలను కైవసం చేసుకుంది. మెజారిటీ ప్రకారం మేయర్‌ పదవి ఆప్‌కే దక్కే అవకాశాలు ఉంటాయి. కానీ, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నియమించిన 10 మంది నామినేటెడ్ కౌన్సిలర్లతో ప్రిసైడింగ్‌ అధికారి ప్రమాణ స్వీకారం చేయించడం వివాదానికి దారితీసింది. అయితే దీన్ని ఆప్‌ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ క్రమంలోనే ఆప్ (AAP)‌, భాజపా (BJP) మధ్య వాగ్వాదం జరిగి ఈ ఎన్నిక ప్రక్రియ మూడుసార్లు వాయిదా పడింది. దీంతో మేయర్‌ ఎన్నిక (Mayor Election)ను భాజపా అడ్డుకుంటోందని ఆరోపిస్తూ ఆప్‌ మేయర్‌ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. మేయర్‌ ఎన్నికలో నామినేటెడ్‌ సభ్యులు ఓటు వేయరాదని తేల్చి చెప్పింది. అంతేగాక, దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్ (ఎంసీడీ MCD) సమావేశానికి 24 గంటల్లో నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. దీంతో దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ సమావేశం బుధవారం నిర్వహించేందుకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా (VK Saxena) అనుమతించడంతో తొలి సమావేశంలోనే మేయర్‌ ఎన్నిక నిర్వహించగా ఆప్‌ విజయం సాధించడంతో 15 ఏళ్ల తర్వాత తొలిసారి భాజపా నుంచి మేయర్‌ పీఠం చేజారినట్టయింది.

ఎవరీ షెల్లీ ఒబెరాయ్‌?

షెల్లీ ఒబెరాయ్‌ కాలేజీ ప్రొఫెసర్‌. దిల్లీ యూనివర్సిటీలో విజిటింగ్‌ ప్రొఫెసర్‌గానూ పనిచేస్తున్నారు. ఆమె వయస్సు 39 ఏళ్లు. ఇండియన్‌ కామర్స్‌ అసోసియేషన్‌లో శాశ్వత సభ్యురాలు కూడా. హిమాచల్‌ప్రదేశ్‌ యూనివర్సిటీలో మాస్టర్స్‌ డిగ్రీ చేసిన ఆమె..  ఇగ్నో నుంచి స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. గతేడాది డిసెంబర్‌లో జరిగిన దిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో పటేల్‌ నగర్‌ (తూర్పు) వార్డు నుంచి బరిలో దిగి తొలిసారి కౌన్సిలర్‌గా గెలుపొందారు. ఆమెను ఆప్‌ మేయర్‌ అభ్యర్థిగా బరిలో దించగా.. తాజాగా జరిగిన మేయర్‌ ఎన్నికల్లో షెల్లీ ఒబెరాయ్‌.. భాజపా అభ్యర్థి రేఖా గుప్తాపై విజయం సాధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని