Joshimath: జమ్ముకశ్మీర్‌లో కుంగిన భూమి.. ఎన్జీటీ ప్యానల్‌ ఏర్పాటు

ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్ (Joshimath) తరహా పరిస్థితులు జమ్మూకశ్మీర్‌లోనూ ఏర్పడటంపై నేషనల్‌ హరిత ట్రైబ్యునల్‌ (NGT) స్పందించింది. భూమి కుంగిపోతున్న దోడా (Doda) జిల్లాల్లో పూర్తిస్థాయిలో అధ్యయనం చేపట్టాలని ఆదేశిస్తూ.. ఓ కమిటీని ఏర్పాటు చేసింది.

Published : 21 Feb 2023 23:55 IST

దిల్లీ: జోషిమఠ్‌ తరహా పరిస్థితులు జమ్మూ కశ్మీర్‌లో కూడా ఎదురవుతుండటంపై జాతీయ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) స్పందించింది. దీనిపై పూర్తిస్థాయిలో అధ్యయనం నిర్వహించి, ప్రకృతిపరమైన నష్టాన్ని నివారించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలో తెలియజేసేందుకు ఓ ప్యానల్‌ను ఏర్పాటు చేసింది. జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాలో భూమి కుంగిపోవడంపై మీడియాలో వస్తున్న కథనాలను సుమోటోగా తీసుకున్న ఎన్జీటీ దీనిపై మంగళవారం విచారణ చేపట్టింది. 

దోడా జిల్లాలో పలుచోట్ల భూమి కుంగిపోవడంతో కొందరు స్థానికులు ఆందోళనతో అక్కడి నుంచి వేరే ఊళ్లకు వెళ్లిపోతున్నారంటూ మీడియాలో కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో జస్టిస్‌ ఏకే గోయల్‌ నేతృత్వంలోని బెంచ్‌ విచారణ చేపట్టింది.ఈ ప్రాంతంలో జియోలాజికల్ సర్వే నిర్వహించాలని ఆదేశిస్తూ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ కమిటీకి నేతృత్వం వహించాలన్న ఎన్‌జీటీ..  సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు, వాడియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హిమాలయన్‌ జియాలజీ, కోవింద్‌ బల్లబ్‌ పంత్ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ హిమాలయ అండ్‌ ఎన్విరాన్‌మెంట్, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆప్‌ హైడ్రాలజీ సంస్థలతోపాటు కుమోన్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ జేఎస్‌ రావత్‌లను సభ్యులుగా చేర్చింది.

ఈ కమిటీ నిర్దిష్ట సమయంలోగా అధ్యయనం నిర్వహించి, తగిన సూచలనలు, సలహాలు ఇవ్వాలని కోరింది. అవసరమైతే ఇతర సంస్థలకు చెందిన అనుభవజ్ఞులైన నిపుణుల అభిప్రాయాలను కూడా తీసుకోవాలని ఆదేశిస్తూ.. మే 15 నాటికి నివేదిక సమర్పించాలని కోరింది. ఈ లోగా అత్యవసర పరిస్థితులు ఏర్పడితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అవసరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ.. తదుపరి విచారణను మే 25కి వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని