బాంబు బెదిరింపు.. ప్రమాదంలో 236 మంది: వాయుసేన స్పందించిందిలా..

బాంబు బెదిరింపు కారణంగా మాస్కో-గోవా విమానం గుజరాత్‌లోని జామ్‌నగర్‌ మిలిటరీ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యింది. 236 మంది ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేసిన ఈ ఘటనలో భారత వాయుసేన (IAF) ఎంతో సమర్థంగా వ్యవహరించింది.

Updated : 11 Jan 2023 15:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మాస్కో (Moscow) నుంచి గోవా (Goa)కు బయల్దేరిన విమానానికి బాంబు బెదిరింపు తీవ్ర కలకలం రేపింది. ఈ బెదిరింపుతో విమానంలో 236 మంది ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. అలాంటి విపత్కర పరిస్థితుల్లో భారత వాయుసేన (IAF) అత్యంత చాకచక్యంగా వ్యవహరించింది. తక్కువ సమయంలోనూ వేగంగా స్పందించి ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది.

బాంబు బెదిరింపు (Bomb Threat) కారణంగా మాస్కో-గోవా విమానం సోమవారం రాత్రి గుజరాత్‌ (Gujarat)లో అత్యవసరంగా ల్యాండ్‌ అయిన విషయం తెలిసిందే. సాధారణంగా ఇలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు కేంద్ర పౌరవిమానయాన శాఖ నిర్వహించే ఎయిర్‌పోర్టుల్లో విమానాలను దించేస్తారు. కానీ మాస్కో-గోవా విమానాన్ని ముంబయి, గోవా లేదా అహ్మదాబాద్‌కు మళ్లించే సమయం లేకపోవడంతో జామ్‌నగర్‌లోని మిలిటరీ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఈ విమానాన్ని అత్యవసరంగా దించడానికి ఎయిర్‌పోర్టులో అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు ఐఏఎఫ్‌ (IAF)కు కేవలం 50 నిమిషాల రెస్పాన్స్‌ టైం మాత్రమే లభించింది. అయినప్పటికీ వాయుసేన ఎంతో చాకచక్యంగా, చురుగ్గా వ్యవహరించిందని అధికారులు తెలిపారు.

వాయుసేన స్పందించిందిలా..

* అజూర్‌ ఎయిర్‌ విమానంలో బాంబు ఉందంటూ సమాచారం రాగానే రష్యన్‌ ఎంబసీ.. భారత అధికారులను అప్రమత్తం చేసింది. ఆ వెంటనే భారత వాయుసేన అప్రమత్తమై జామ్‌నగర్‌ (Jamnagar) ఎయిర్‌పోర్టులో భద్రతా ప్రొటోకాల్స్‌ను యాక్టివేట్‌ చేసింది.

* అక్కడ విమానాన్ని ఐసోలేటెడ్‌ ప్రాంతానికి తీసుకెళ్లారు. అదే సమయంలో విమానంలో ప్రయాణికులను క్షేమంగా బయటకు తీసుకొచ్చేలా గ్రౌండ్‌ సిబ్బంది, గార్డ్‌ స్పెషల్‌ ఫోర్సెస్‌ సిబ్బందిని ఆదేశించారు. 

* విమానం దిగగానే ఐఏఎఫ్‌ (IAF) సిబ్బంది మొదట ప్రయాణికులను క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. ఆ తర్వాత ఎయిర్‌ కమాండర్‌ ఆనంద్ సోంధీ నేతృత్వంలోని ఐఏఎఫ్‌ అధికారుల బృందం.. ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు.

* అటు ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ప్రత్యేక విమానంలో నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌ (ఎన్‌ఎస్‌జీ NSG) బాంబు నిర్వీర్య దళం ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. విమానంతో పాటు ప్రయాణికుల బ్యాగేజీలను క్షుణ్ణంగా పరీక్షించారు. అర్ధరాత్రి తర్వాత నుంచి చోటుచేసుకున్న ఈ పరిణామాలను వాయుసేన హెడ్‌క్వార్టర్స్‌ నుంచి ఐఏఎఫ్‌ (IAF) ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.

* కొన్ని గంటల పాటు జరిపిన ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లేకపోవడంతో బాంబు బెదిరింపు ఉత్తుత్తిదేనని తేలింది. దీంతో అటు ప్రయాణికులు, ఇటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అలా దాదాపు 15 గంటల తర్వాత మాస్కో విమానం.. గోవా (Goa)లోని గమ్యస్థానానికి బయల్దేరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని