Amit Shah: ‘జడ్‌’ కేటగిరీ భద్రత తీసుకోండి: అసదుద్దీన్‌కు అమిత్‌ షా విజ్ఞప్తి

ఇటీవల ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ వాహనంపై కాల్పుల ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రాజ్యసభలో ప్రకటన చేశారు. అసదుద్దీన్‌ యూపీలోని హాపూర్ జిల్లా పర్యటన ముందుగా.......

Updated : 07 Feb 2022 16:02 IST

దిల్లీ: ఇటీవల ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ వాహనంపై కాల్పుల ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రాజ్యసభలో ప్రకటన చేశారు. అసదుద్దీన్‌ యూపీలోని హాపూర్ జిల్లా పర్యటన ముందుగా షెడ్యూల్‌ చేసుకున్నది కాదన్నారు. ఆయన పర్యటన గురించి ఆ జిల్లా కంట్రోల్‌రూమ్‌కు ముందుగా సమాచారం కూడా ఇవ్వలేదని వెల్లడించారు. కారుపై కాల్పుల ఘటన తర్వాత ఆయన సురక్షితంగా బయటపడి దిల్లీకి చేరుకున్నారని చెప్పారు. సత్వరమే పోలీసులు రంగంలోకి దిగి ఇద్దరు నిందితులను అరెస్టు చేసి.. వారి నుంచి రెండు తుపాకులు, ఆల్టో కారు స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు.  ఘటన జరిగిన ప్రదేశాన్ని ఫోరెన్సిక్‌ బృందం సునిశితంగా పరిశీలించి ఆధారాలు సేకరించిందన్నారు. 

ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి హోంశాఖ నివేదిక తీసుకుందని అమిత్‌ షా చెప్పారు. గతంలో కేంద్ర భద్రతా సంస్థల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా అసదుద్దీన్‌కు భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. కానీ భద్రత తీసుకొనేందుకు ఆయన నిరాకరించారన్నారు. ఒవైసీకి ఇప్పటికీ ముప్పు ఉందన్న సమాచారంతో ఆయనకు బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనం, జడ్‌ కేటగిరీ భద్రతను కేంద్రం కల్పించిందని చెప్పారు. కానీ దాన్ని తిరస్కరిస్తున్నట్టు ఆయన మౌఖికంగా చెప్పారన్నారు. కేంద్ర కల్పించిన భద్రతను తీసుకోవాలని రాజ్యసభ ద్వారా అసదుద్దీన్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా విజ్ఞప్తి చేశారు.

కేంద్ర ప్రభుత్వం తనకు కల్పించిన ‘జడ్‌’ కేటగిరీ భద్రతను తిరస్కరిస్తున్నట్లు అసదుద్దీన్‌ ఒవైసీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. తాను స్వేచ్ఛగా జీవించాలనుకుంటున్నానని.. ఆంక్షల మధ్య కాదని పేర్కొన్నారు. తనపై కాల్పులు జరిపిన వ్యక్తులు, వారిని ఉసిగొల్పిన వారిపై ఉపా చట్టం కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒవైసీ వాహనంపై దుండగులు కాల్పులు జరిపిన నేపథ్యంలో ఆయనకు ‘జడ్‌ ప్లస్‌ 2’ కేటగిరీ భద్రత కల్పిస్తున్నట్లు అధికారవర్గాలు వెల్లడించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని