Anand Mahindra: జో బైడెన్‌పై ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌.. అంగీకరించని నెటిజన్లు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను ఉద్దేశిస్తూ చేసిన ఓ ట్వీట్‌తో ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) విమర్శల పాలయ్యారు. ఇంతకీ మహీంద్రా చేసిన ట్వీట్‌ ఏంటీ? నెటిజన్లు ఆయనను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు..?

Published : 26 Apr 2023 18:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సమకాలీన అంశాలపై ట్వీట్లు, స్ఫూర్తినిచ్చే సందేశాలతో పోస్టులు చేస్తూ నెట్టింట చురుగ్గా ఉంటారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra). ఆయన ట్వీట్లు, వీడియోలకు ప్రశంసలు వెల్లువెత్తడమే గాక.. ఎంతో మంది ప్రేరణ పొందుతుంటారు కూడా. అయితే తాజాగా ఆయన చేసిన ఓ పోస్ట్‌ విమర్శలకు దారితీసింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden)ను కొనియాడుతూ ఆనంద్‌ మహీంద్రా చేసిన ట్వీట్‌కు నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..

అమెరికా అధ్యక్ష పదవికి మరోసారి పోటీ చేయనున్నట్లు అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) మంగళవారం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో బైడెన్‌ వయసు ప్రధానాంశంగా మారింది. 80 ఏళ్లు దాటిన బైడెన్‌.. 2024లో మళ్లీ ఎన్నికైతే అమెరికా చరిత్రలో అత్యంత పెద్ద వయసున్న అధ్యక్షుడవుతారు. దీనిపైనే ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) స్పందిస్తూ బుధవారం ఓ ట్వీట్ చేశారు. ‘‘ఈ వయసులో మరోసారి అధ్యక్ష ఎన్నికలకు పోటీ చేసేందుకు సాహసిస్తున్న బైడెన్‌పై విమర్శలకు లోటు ఉండదు. కానీ, ఆ ధైర్యం నాకు నచ్చింది. యువ ప్రత్యర్థులపై ఆయన గెలవొచ్చు లేదంటే ఓడొచ్చు. కానీ వెనకడుగు వేయని మీ స్ఫూర్తిని నేను అభినందించకుండా ఉండలేకపోతున్నా’’ అని అమెరికా అధ్యక్షుడి (Joe Biden)పై మహీంద్రా ప్రశంసలు కురిపించారు.

అయితే, ఈ ట్వీట్‌పై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు మహీంద్రా ట్వీట్‌కు మద్దతిస్తుండగా.. ఎక్కువ మంది విమర్శిస్తున్నారు. ‘‘ఈ వయసులోనూ పోటీ చేస్తూ యువతరానికి అవకాశం ఇవ్వడం లేదు. బైడెన్‌ది స్ఫూర్తిమంత్రం కాదు.. స్వార్థతంత్రం’’ అని ఓ నెటిజన్‌ అసహనం వ్యక్తం చేశారు. ‘‘రాజకీయాల్లో యువ నేతలు రావాలి. అప్పుడే వారు దేశం కోసం ఎక్కువ శ్రమించగలుగుతారు. అది దేశానికి మంచిది. ఇలాంటి నిర్ణయాలు నేతలు మాత్రమే ఎదిగేందుకు దోహదపడుతాయి’’ అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని