Dhruv Chopper Fleet: ధ్రువ్ హెలికాప్టర్లకు క్లియరెన్స్ పునరుద్ధరించిన సైన్యం
ధ్రువ్ హెలికాప్టర్ల వినియోగానికి సైన్యం నుంచి షరతులతో కూడిన అనుమతులు లభించాయి. ఈ నెల మొదట్లో జమ్మూకశ్మీర్‌లో ప్రమాదం చోటు చేసుకోవడంతో సైన్యం వీటిని తాత్కాలికంగా పక్కనపెట్టింది.
ఇంటర్నెట్‌డెస్క్: భారత సైన్యం(Indian Army)లో ధ్రువ్(Dhruv) హెలికాప్టర్లకు క్లియరెన్స్‌ను సైన్యం పునరుద్ధరించింది. దాదాపు నెలరోజులుగా ఈ దేశీయ హెలికాప్టర్లను సైన్యం వినియోగించడంలేదు. తాజాగా కొన్ని షరతులతో కూడిన క్లియరెన్స్‌ను జారీ చేశారు. దీంతో కేవలం కొన్ని పరిమిత, అత్యవసర ఆపరేషన్ల కోసం మాత్రమే దీనిని వినియోగించే అవకాశం ఉంది. అంతేకాదు.. ఈ హెలికాప్టర్లను పూర్తిగా తనిఖీలు చేసి అవసరమైన ఫిట్‌నెస్ ధ్రువీకరణ లభించిన తర్వాత మాత్రమే ఎగరాలని నిబంధనల్లో పేర్కొన్నారు.
ప్రస్తుతం సైన్యం వద్ద దేశీయంగా తయారు చేసిన 145 ధ్రువ్ హెలికాప్టర్లు ఉండగా.. వాయసేన వద్ద 70, నౌకాదళం వద్ద 18, కోస్టుగార్డ్ వద్ద 20 వరకు ఉన్నాయి. తాజా నిబంధనల ప్రకారం హెలికాప్టర్లకు హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి ఫిట్‌నెస్ లభించిన తర్వాతే వినియోగంలోకి తీసుకురావాల్సి ఉంటుంది.
మే4 తేదీన జమ్ము కశ్మీర్‌లో జరిగిన ధ్రువ్ హెలికాప్టర్ ప్రమాదంలో ఒక టెక్నిషియన్ మృతి చెందగా ఇద్దరు పైలట్లు గాయపడ్డారు. ఈ ప్రమాదం తర్వాత నిబంధనల ప్రకారం సైన్యం ధ్రువ్‌ల వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. అంతకు ముందే రెండు ప్రమాదాలు చోటు చేసుకోవడంతో నౌకాదళం, కోస్టు గార్డ్ కూడా నెలరోజులపాటు ధ్రువ్‌ల వినియోగాన్ని నిలిపివేశాయి. ధ్రువ్ హెలికాప్టర్లు భారత సాయుధ దళాలకు ప్రధాన సాధనంగా ఉన్నాయి. సియాచిన్, లద్ధాఖ్ వంటి అత్యధిక ఎత్తైన ప్రాంతాల్లోని సైనికులకు ఇవి సేవలు అందిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.