
Assam CM: అదో పెద్ద వార్తా? అంతా కపట రాజకీయమే..
ఇండియా టుడే-2021 కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న అస్సాం సీఎం
దిల్లీ: కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రాపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ విమర్శలు గుప్పించారు. ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరిలో జరిగిన ఘటనలో మరణించిన రైతు కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన ప్రియాంక గాంధీని పోలీసులు అడ్డుకొని గృహనిర్బంధం చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆమె అక్కడ చీపురు పట్టి గదిని శుభ్రం చేశారు. ఒక గదిని శుభ్రం చేయడం అనేది రోజువారీ ఇంటి పనులో భాగమేనని.. ఇది పెద్ద వార్త ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఇండియా టుడే కాన్‌క్లేవ్ 2021లో పాల్గొని పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. దేశ ప్రజలు మారిపోయారని.. రాజకీయ నాయకుల చేసే ఇటువంటి కపట నాటకాలపై వారు దృష్టి నిలపరని తెలిపారు. ‘‘ఒక చీపురు పట్టి నేలను శుభ్రం చేయడం వార్త ఎలా అవుతుందో నాకు తెలియదు. ప్రతి ఇంట్లో ఇది సర్వ సాధారణమే. ’’ అని హిమంత అన్నారు.
ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఇళ్ల నిర్మాణం చేపట్టిన ఆక్రమణదారులను తొలగించడానికి అస్సాం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి సమాధానమిస్తూ.. ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన విదేశీయులకు వ్యతిరేకంగా తొలగింపు ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. 1,000 కుటుంబాలు 77 వేల ఎకరాల భూమిని స్వాధీన పరచుకోవడం చాలా అక్రమమని దీన్ని అంగీకరించబోమన్నారు. తొలగింపు ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. 1947కి ముందు చాలా మంది అస్సాంకు వలస వచ్చారని ఆ క్రమంలో పెద్ద ఎత్తున భూమిని ఆక్రమించి నివాసాలను ఏర్పాటు చేసుకున్నారన్నారు. దీనివల్ల చాలా సమస్యలు తలెత్తాయని పేర్కొన్నారు. వలస వచ్చిన వారి ఓట్లు తనకు అక్కర్లేదని చెప్పిన వివాదాస్పద వ్యాఖ్యల గురించి అడగగా.. ‘‘వారు భాజపాకి ఓటు వెయ్యరని నాకు తెలుసు. ప్రచార సమయాల్లో వారిని కలిసి సమయం వృథా చేసుకోలేను. కానీ, వారు ఉన్న ప్రాంతాల్లో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తాను. అస్సాంలో నిర్మించనున్న ఏడు లక్షల ఉచిత ఇళ్లలో 4.5 లక్షల మంది వలసదారులకు కేటాయించడమే దీనికి ఉదాహరణ’’ అని సీఎం హిమంత బిశ్వశర్మ వెల్లడించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.