Tit for Tat: దిల్లీలోని బ్రిటన్‌ హైకమిషన్‌ బయట బారికేడ్లు తొలగింపు..!

బ్రిటన్‌లోని భారత రాయబార కార్యాలయం వద్ద ఖలిస్థాన్‌ మద్దతుదారులు చేసిన దుశ్చర్య, భారత దౌత్య కార్యాలయం వద్ద భద్రత పట్ల యూకే ప్రభుత్వ ఉదాసీనతను భారత్‌ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ క్రమంలో దిల్లీలోని బ్రిటన్‌ హైకమిషన్‌ బయట బారికేడ్లను తొలగించడం చర్చనీయాంశమయ్యింది.

Published : 22 Mar 2023 15:43 IST

దిల్లీ: లండన్‌లోని భారత హైకమిషన్‌పై ఖలిస్థాన్‌ (Khalistan) మద్దతుదారులు చేసిన దుశ్చర్యను భారత్‌ తీవ్రంగా పరిగణిస్తోంది. భారత హైకమిషన్‌ వద్ద భద్రతా వైఫల్యంపై తీవ్రంగా మండిపడ్డ భారత్‌.. అటువంటి కార్యకలాపాలకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని బ్రిటన్‌ రాయబారికి సమన్లు కూడా జారీ చేసింది. ఈ పరిణామాల నడుమ భారత్‌ ప్రతిచర్యకు దిగినట్లు కనిపిస్తోంది. దిల్లీ చాణక్యపురిలోని శాంతిపథ్‌లో ఉన్న బ్రిటన్‌ హైకమిషన్‌ (UK High commission) కార్యాలయం బయట బారికేడ్లను తొలగించింది. అయితే, భద్రతా సిబ్బందిలో మాత్రం ఎటువంటి మార్పు లేదని.. మునుపటి మాదిరిగానే భద్రత కొనసాగిస్తున్నట్లు సమాచారం.

లండన్‌లోని భారత్‌ హైకమిషన్‌ భవనంపై ఎగురవేసిన జాతీయ జెండాను ఖలిస్థాన్‌ అనుకూలవాదులు కిందికి దింపేసి అగౌరవ పరచిన సంగతి తెలిసిందే. ఆ దుశ్చర్యపై భారత్‌ తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ విషయంపై దిల్లీలోని బ్రిటన్‌ సీనియర్‌ దౌత్యవేత్తకు సమన్లు కూడా జారీ చేసింది. నిరసనకారులు భారత హైకమిషన్‌కు వచ్చేంత వరకు అక్కడి భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని బ్రిటన్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. భారత దౌత్య కార్యాలయ ప్రాంగణం, అక్కడి సిబ్బంది భద్రత పట్ల యూకే ప్రభుత్వ ఉదాసీనత ఆమోదయోగ్యం కాదని తెలిపింది. మరోవైపు ఖలిస్థానీ సానుభూతిపరుడు, పరారీలో ఉన్న ‘వారిస్‌ పంజాబ్‌ దే’ నాయకుడు అమృత్‌పాల్‌ సింగ్‌ ఆచూకీ కోసం పంజాబ్‌ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని