Pandora Papers: చరిత్రలోనే అనైతిక సంపాదన వివరాల అతిపెద్ద లీకేజీ..! 

పాండోరా పేపర్లు ప్రపంచ వ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సొంత దేశాన్ని  కాదని పన్నుతక్కువ ఉన్న విదేశాలకు సంపద తరలించిన వారి వివరాల గుట్లు రట్టైంది.

Updated : 04 Oct 2021 11:49 IST

* అత్యంత సంక్లిష్టమైన ఆపరేషన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

పాండోరా పేపర్లు ప్రపంచవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సొంత దేశాన్ని కాదని పన్నుతక్కువ ఉన్న విదేశాలకు సంపద తరలించిన వారి వివరాల గుట్టు రట్టైంది. ఇంటర్నేషనల్‌ కన్సార్షియం ఆఫ్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్స్‌(ఐసీఐజే) విడుదల చేసిన ఈ పేపర్లను బట్టి ప్రపంచ వ్యాప్తంగా విదేశాల్లో దాచిన సొమ్ము మొత్తం విలువ కనీసం 5.6 ట్రిలియన్‌ డాలర్ల నుంచి అత్యధికంగా 32 ట్రిలియన్‌ డాలర్ల వరకూ ఉంటుందని ఐసీఐజే అంచనా వేసింది. పన్ను తక్కువ ఉన్న దేశాలకు తరలించే సంపద వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాలకు ఏటా 600 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతున్నట్లు అంచనా. 117 దేశాల్లోని 600 మంది జర్నలిస్టుల సమష్టిగా పనిచేసి ఈ గుట్టు రట్టు చేశారు.

డేటా సునామీ..

మొత్తం 14 సోర్సుల నుంచి 64,06,119 పత్రాలు, 29,37,513 చిత్రాలు, 12,05,716 ఈమెయిల్స్‌, 4,67,405 స్ప్రెడ్‌షీట్లు, 8,86,923  ఇతర ఆధారాలను ఐసీఐజే బహిర్గతం చేసింది. ఈ డేటా మొత్తం 2.94 టెరాబైట్లు ఉంది.

ఇది ఎందుకు భిన్నమైంది? 

2016లో విడుదలైన పనామా పేపర్ల డేటా 2.6 టెరాబైట్లు మాత్రమే. ఈ డేటా కూడా ఒక్కేఒక్క సోర్స్‌ నుంచి వచ్చింది. ఇక 2017లో ప్యారడైజ్‌ పేపర్లలో 1.4 టెరాబైట్ల డేటా బయటకు వచ్చింది. ఇది కూడా విదేశాల్లోని ఒక లా కంపెనీ నుంచి సంపాదించినదే. కానీ, ఈ సారి 14 సోర్సుల నుంచి వివిధ మార్గాల్లో సమాచారాన్ని జాగ్రత్తగా సమీకరించారు. మొత్తం 27 వేల కంపెనీల్లోని 29వేల మంది లబ్ధిదారులను గుర్తించారు. ఈ సంఖ్య పనామా పేపర్లతో పోలిస్తే రెట్టింపు. ఈ సమాచారం ఇంగ్లిష్‌, స్పానిష్‌, రష్యన్‌, ఫ్రెంచి, అరబిక్‌, కొరియాన్‌ భాషల్లో ఉంది. భారత్‌ నుంచి ఆరుగురు రాజకీయ నాయకుల పేర్లు ఇందులో ఉన్నట్లు ఐసీఐజే వెబ్‌సైట్‌ పేర్కొంది. 

ఆఫ్‌షోర్‌ కంపెనీలు ఏమిటీ..?

ఈ పేపర్లలో అత్యంత క్లిష్టమైన కంపెనీల నెట్‌వర్క్‌లను వెలుగులోకి తీసుకొచ్చారు. వాస్తవానికి ఈ కంపెనీల సంపద, యాజమాన్యాల వివరాలు చాలా గోప్యంగా ఉంటాయి. ఉదాహరణకు ఒక వ్యక్తికి యూకేలో ఒక ఆస్తి ఉంది. కానీ, విదేశాల్లో ఉన్న గొలుసుకట్టు కంపెనీల లావాదేవీలతో దానిని సొంతం చేసుకోవచ్చు. ఈ విదేశీ కంపెనీలను ‘ఆఫ్‌షోర్‌’గా వ్యవహరిస్తారు.

ఈ ఆఫ్‌షోర్‌ కంపెనీల ఏర్పాటుకు కొన్ని రకాల దేశాలను ఎంచుకొంటారు. కంపెనీ ఏర్పాటు నిబంధనలు సులభతరంగా ఉండాలి, కంపెనీ యాజమాన్యాలను గుర్తించకుండా కఠిన చట్టాలు ఉండాలి. కార్పొరేట్‌ పన్ను అతి తక్కువ లేదా అసలు ఉండకూడదు. సింగపూర్‌, స్విట్జర్లాండ్‌, బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌, కైమన్‌ ఐలాండ్స్‌ వంటి దేశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.

ఆయా దేశాల్లోని చట్టాల్లోని లొసుగులను వాడుకొని కంపెనీలను ఈ దేశాలకు తరలిస్తారు. చాలా చోట్ల చట్టపరంగా ఇది తప్పుకాకపోయినా.. అనైతికం. ఈ దేశాల్లో కేవలం పేర్లతో పేపర్లపై కంపెనీలను సృష్టిస్తారు. ఇలాంటి సేవలు అందించడానికి ప్రత్యేకంగా కంపెనీలు ఉన్నాయి.

గత దశాబ్ద కాలంలో కీలక లీకులు..

* నవంబర్‌ 2012, ఏప్రిల్‌ 2013ల్లో బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌, కుక్‌ ఐలాండ్స్‌లో పెట్టుబడులపై ఇద్దరు ఫైనాన్షియల్‌ ప్రొవైడర్ల నుంచి సంపాదించిన డేటాను ఐసీఐజే లీక్‌ చేసింది. 25లక్షల ఫైల్స్‌లో 1,20,000 కంపెనీల గుట్టు ఉంది.

* నవంబర్‌ 2014లో ఐసీఐజే లక్సమ్‌బర్గ్‌ లీక్స్‌ పేరిట కొన్ని పత్రాలను విడుదల చేసింది. వీటిల్లో ప్రైస్‌వాటర్‌హౌస్‌ కూపర్స్‌ సంస్థ చాలా ఎంఎన్‌సీలకు 2002 నుంచి 2010 వరకు లక్సమ్‌బర్గ్‌లో పన్ను రాయితీలను ఇప్పించిన జాబితా ఇది. వీటిల్లో ఐకియా,పెప్సీ,ఏఐజీ,దాయిషే బ్యాంక్‌ వంటి దిగ్గజాలు ఉన్నాయి.

* ఐసీఐజే 2015లో స్విస్‌ లీక్‌ పేరుతో బహిర్గతం చేసిన 200 దేశాల్లో లక్ష మంది వ్యక్తులు, అక్రమ కంపెనీల డేటా దీనిలో ఉంది. ఆయుధ డీలర్లు, వెనుకబడిన దేశాల్లోని నియంతలు, వజ్రాల అక్రమ రవాణాదారుల వివరాలు ఉన్నాయి. ఈజిప్ట్‌ అధ్యక్షుడు హోస్నిముబారక్‌, సిరియా నేత బషర్‌ అల్‌ అసద్‌ పేర్లున్నాయి.

2016లో లీకైన పనామా పేపర్లు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. 2010 డిప్లొమాటిక్‌ వికీలీక్స్‌ కేబుల్స్‌ కంటే 1500 రెట్లు అధిక డేటాను బహిర్గతం చేసింది. మొస్సాక్‌ ఫొన్సెకా అనే సంస్థ నుంచి సంపాదించిన 2.6 టెరాబైట్ల డేటా ఇది. రష్యా అధినేత పుతిన్‌ సన్నిహితులు, డజను మంది ప్రపంచ నేతలు, 120 రాజకీయ నాయకులు, లెక్కలేనంత మంది బిలియనర్ల వివరాలు దీనిలో ఉన్నాయి.

* 2017లో ఆఫ్‌షోర్‌ లా సంస్థ యాపిల్‌బై, 19 దేశాల్లోని కార్పొరేట్‌ రిజిస్ట్రీల వివరాలను ప్యారడైజ్‌ పేపర్ల పేరిట విడుదల చేశారు. వీటిల్లో  రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, కార్పొరేట్‌ దిగ్గజాలు, బిజినెస్‌ టైకూన్ల లావాదేవీలు ఉన్నాయి.

* సెప్టెంబర్‌ 2020లో ఫిన్‌సిన్‌ ఫైల్స్‌ పేరిట ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు దిగ్గజ బ్యాంకులు.. మనీలాండరింగ్‌, నేరాలకు ఆర్థిక సహకారం అడ్డుకోవడంలో ఎలా విఫలమయ్యాయో వివరాలను లీక్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని