Mallikarjun Kharge: ‘శునకమైనా చనిపోయిందా?’.. ఖర్గే వ్యాఖ్యలపై దద్దరిల్లిన రాజ్యసభ

కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే వ్యాఖ్యలపై రాజ్యసభ దద్దరిల్లింది. ఆయనవి అభ్యంతరకర వ్యాఖ్యలని, క్షమాపణ చెప్పాల్సిందేనని భాజపా డిమాండ్‌ చేసింది. కానీ, ఇందుకు ఖర్గే ససేమిరా అన్నారు.

Updated : 20 Dec 2022 14:55 IST

135 కోట్ల మంది నవ్వుతున్నారంటూ ఛైర్మన్‌ ఆగ్రహం

దిల్లీ: కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ.. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే చేసిన ‘శునకం’ వ్యాఖ్యలపై రాజ్యసభ దద్దరిల్లింది. ఖర్గే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తూ భాజపా సభ్యులు ఆందోళనకు దిగారు. ఇందుకు కాంగ్రెస్‌ నేత ససేమిరా అనడంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ పరిణామాలపై రాజ్యసభ ఛైర్మన్ జగదీప్‌ దన్‌ఖడ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘భారత్‌ జోడో యాత్ర’లో భాగంగా రాజస్థాన్‌లోని అల్వార్‌లో జరిగిన ర్యాలీలో ఖర్గే మాట్లాడుతూ.. ‘‘దేశం కోసం కాంగ్రెస్‌ ఎంతో చేసింది. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీతోపాటు మరెందరో కాంగ్రెస్ నాయకులు ప్రాణ త్యాగాలు చేశారు. భాజపా దేశం కోసం కనీసం ఒక్క శునకాన్ని కూడా కోల్పోలేదు. అయినా కూడా తాము దేశభక్తులనే వారు చెబుతారు. మేము ఏమైనా అంటే దేశద్రోహులుగా ముద్ర వేస్తారు’’ అని విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారానికి దారితీశాయి. మంగళవారం పార్లమెంట్‌ ప్రారంభం కాగానే.. భాజపా నేతలు ఖర్గే వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆందోళన లేవనెత్తారు. రాజ్యసభలో కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ మాట్లాడుతూ.. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఖర్గే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. అటు లోక్‌సభలోనూ భాజపా, కాంగ్రెస్‌ నేతల మధ్య వాగ్వాదం జరిగింది.

మనం చిన్న పిల్లలమా?: ధన్‌ఖడ్‌ మండిపాటు

ఖర్గే వ్యాఖ్యలతో రాజ్యసభలో కొంతసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్‌ నేత క్షమాపణలు చెప్పాలంటూ భాజపా సభ్యులు నినాదాలు చేశారు. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కొందరు బల్లలపై నిల్చుని నిరసనలు చేశారు. ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ వారించినా వారు వినిపించుకోలేదు. దీంతో ధన్‌ఖడ్‌ అసహనానికి గురయ్యారు. ‘‘సభలో ఇలాంటి ప్రవర్తన మనకు చాలా చెడ్డపేరు తెస్తుంది. సభ నడిచే తీరుతో బయట ప్రజలు నిరుత్సాహానికి గురవుతున్నారు. కనీసం సభాపతి సూచనలను కూడా పట్టించుకోవట్లేదు. ఎంతటి బాధాకర పరిస్థితిని సృష్టిస్తున్నాం. నమ్మండి.. మనల్ని చూసి 135 కోట్ల మంది ప్రజలు నవ్వుతున్నారు’’ అని అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘అది పార్లమెంట్ వెలుపల జరిగింది. దాని గురించి సభలో ఆందోళనలు సరికాదు. పక్షాల మధ్య అభిప్రాయభేదాలు ఉండొచ్చు. కానీ రాజ్యసభ పక్ష నేత మాట్లాడుతున్నప్పుడు ప్రతిపక్ష ఎంపీలు ఆటంకం కలిగించడం.. ప్రతిపక్ష నేత మాట్లాడుతుంటే మరో పక్షం అడ్డుకోవడం.. ఇవన్నీ ఏంటీ? మనమేం పిల్లలం కాదు’’ అని సభ్యులపై మండిపడ్డారు.

క్షమాపణలు చెప్పను: ఖర్గే

భాజపా డిమాండ్‌ మేరకు క్షమాపణలు చెప్పేందుకు ఖర్గే నిరాకరించారు. పార్లమెంట్‌ వెలుపల చేసిన వ్యాఖ్యలపై సభలో చర్చ జరగాల్సిన అవసరం లేదన్నారు. ‘‘దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారిని మీరు క్షమాపణలు అడుగుతున్నారా?’’ అంటూ భాజపాను ప్రశ్నించారు. అనంతరం పలు అంశాల్లో కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ ప్రతిపక్షాలు సభ నుంచి వాకౌట్‌ చేశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని