West Bengal: తృణమూల్‌ నేత ఇంట్లో బాంబు పేలుడు.. ముగ్గురి మృతి

పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ నేత ఇంట్లో బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో ముగ్గరు ప్రాణాలు కోల్పోయారు.

Updated : 03 Dec 2022 12:20 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో పేలుడు ఘటన కలకలం సృష్టించింది. తూర్పు మేదినీపూర్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన ఓ నేత ఇంట్లో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ చేపట్టనున్న ర్యాలీ వేదికకు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

తూర్పు మేదినీపూర్‌ జిల్లాలోని భూపతినగర్‌ ప్రాంతంలో టీఎంసీ నేత ఇంట్లో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఈ పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రతకు ఇంటి పైకప్పు పూర్తిగా కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. మరికొందరు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. పేలుడుకు గల కారణాలు తెలియరాలేదు. ఇంట్లోకి బాంబులు ఎలా వచ్చాయి అన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

టీఎంసీ సీనియర్‌ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ శనివారం తూర్పు మేదినీపూర్‌లో పర్యటించనున్నారు. అభిషేక్‌ బహిరంగ సభ నిర్వహించే వేదికకు కేవలం 1.5కిలోమీటర్ల దూరంలోనే ఈ పేలుడు సంభవించింది. కాగా.. ఈ ఘటనపై ప్రతిపక్షాలు విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి. ఆ తృణమూల్‌ నేత ఇంట్లో నాటు బాంబులు తయారు చేస్తున్నారని భాజపా ఆరోపించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని