CBSE 12th Exams: జులై 15-ఆగస్టు 26 మధ్య పరీక్షలు?

సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షల నిర్వహణపై కేంద్ర విద్యాశాఖ తర్జనభర్జనలు పడుతోంది. విద్యార్థుల భద్రతకే తొలి ప్రాధాన్యమంటున్న కేంద్రం.. ఇప్పటికే ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాన్ని కోరింది....

Published : 24 May 2021 16:04 IST

దిల్లీ: సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షల నిర్వహణపై కేంద్ర విద్యాశాఖ తర్జనభర్జనలు పడుతోంది. విద్యార్థుల భద్రతకే తొలి ప్రాధాన్యమంటున్న కేంద్రం.. ఇప్పటికే ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాన్ని కోరింది. తుది నిర్ణయం జూన్‌ 1వ తేదీలోపు ఎప్పుడైనా ప్రకటిస్తామని తెలిపింది. అయితే, ఈ అంశంపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన నిన్న జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఓ కీలక ప్రతిపాదన ముందుకు వచ్చినట్లు సమాచారం. సొంత కేంద్రాల్లో, కేవలం 90 నిమిషాల్లో మల్టిపుల్‌ ఛాయిస్‌, షార్ట్‌ క్వశ్చన్స్‌ విధానంలో పరీక్షలు నిర్వహించడానికి  అనేక రాష్ట్రాలు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది.

ఈ నేపథ్యంలో ఒకవేళ పరీక్షలు నిర్వహిస్తే జులై 15, ఆగస్టు 26 మధ్య నిర్వహించాలని యోచిస్తున్నట్లు సమాచారం. సమావేశంలో ప్రతిపాదించినట్లుగా కొత్త విధానంలోనే పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఫలితాలు సెప్టెంబరులో ప్రకటించనున్నారట! ఈ షెడ్యూల్‌ని జూన్‌ 1న అధికారికంగా ప్రకటించనున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. జులై 15- ఆగస్టు 1 మధ్య తొలి దశ, ఆగస్టు 8-26 మధ్య రెండో దశ పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. అవసరమైతే ఆదివారం రోజు కూడా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే కొన్ని సబ్జెక్టులను పరీక్షల నుంచి మినహాయించాలని కూడా ఆలోచిస్తున్నారని సమాచారం. ఏదేమైనా ఒకవేళ పరీక్షలు నిర్వహిస్తే 15 రోజుల ముందే షెడ్యూల్‌ ప్రకటిస్తామని విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

మరోవైపు.. దేశంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితులు ఉన్నందున, పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ తల్లిదండ్రుల సంఘాలు ప్రధానమంత్రికి ఇప్పటికే లేఖ రాశాయి. ఈ విషయాన్ని నెలల తరబడి నాన్చకుండా విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేయాలని కాంగ్రెస్‌ సహా పలు విపక్ష పార్టీలు సైతం డిమాండ్ చేస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని