Vaccine: జనాభాను బట్టి రాష్ట్రాలకు టీకాలు

కేంద్రం అందించే ఉచిత టీకా డోసులను.. రాష్ట్రాల్లోని జనాభా, వ్యాధి తీవ్రత, కేసుల సంఖ్య ప్రాతిపదికన ఆయా రాష్ట్రాలకు కేటాయించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు జాతీయ వ్యాక్సినేషన్‌

Updated : 08 Jun 2021 13:32 IST

వృథా ఎక్కువుంటే కేటాయింపుల్లో కోత

నూతన మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం

దిల్లీ: కేంద్రం అందించే ఉచిత టీకా డోసులను.. జనాభా, వ్యాధి తీవ్రత, కేసుల సంఖ్య ప్రాతిపదికన ఆయా రాష్ట్రాలకు కేటాయించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు జాతీయ వ్యాక్సినేషన్‌ విధానంపై మంగళవారం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు, వ్యాక్సినేషన్‌ సమర్థంగా చేపడుతున్న రాష్ట్రాలకు కేటాయింపుల్లో అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపింది. టీకాల వృథా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు కేటాయింపుల్లో కోత ఉండొచ్చని హెచ్చరించింది. టీకా లభ్యత సమాచారాన్ని ఎప్పటికప్పుడు కేంద్రానికి వెల్లడించాలని సూచించింది. ఈ నూతన మార్గదర్శకాలు జూన్‌ 21 నుంచి అమల్లోకి రానున్నాయి.

టీకా పంపిణీపై నూతన మార్గదర్శకాలివే..

* దేశంలో ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్లలో 75శాతం కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. ఈ టీకాలను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. వీటిని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రాధాన్యత ఆధారంగా ప్రభుత్వ వ్యాక్సిన్‌ కేంద్రాల ద్వారా ప్రజలకు అందిస్తున్నాయి.

* టీకా పంపిణీలో ప్రాధాన్యత ఎలాగంటే.. 1. ఆరోగ్య కార్యకర్తలు 2. ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు 3. 45ఏళ్లు పైబడిన పౌరులు 4. రెండో డోసు వేయించుకోవాల్సిన వారు 5. 18ఏళ్ల పైబడినవారు.

18 ఏళ్లు పైబడిన వారిలో ప్రాధాన్యత క్రమాన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలే సొంతంగా నిర్ణయించుకుని టీకా పంపిణీ షెడ్యూల్‌ చేపట్టాలి.

* కేంద్ర ప్రభుత్వం అందించే టీకా డోసుల్లో రాష్ట్రాల్లోని జనాభా, కేసుల సంఖ్య, వ్యాక్సినేషన్‌లో వృద్ధి వంటి అంశాలను ఆధారంగా చేసుకుని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయిస్తాం. రాష్ట్రాల్లోని టీకా వృథా.. కేటాయింపులపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.

* టీకా డోసుల గురించి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ముందస్తు సమాచారం ఇస్తాం. ఇదే విధంగా రాష్ట్రాలు కూడా ఆయా జిల్లాలు, వ్యాక్సిన్‌ కేంద్రాలకు ముందుగానే డోసుల వివరాలు పంపాలి. ప్రజలకు కూడా తెలియజేయాలి.

* దేశంలో వ్యాక్సిన్‌ ఉత్పత్తిని పెంచేందుకు టీకా తయారీదారులు తమ ఉత్పత్తిలో 25శాతం నేరుగా ప్రైవేటు ఆసుపత్రులకు విక్రయించుకునే వీలు కల్పించాం. ప్రైవేటు ఆసుపత్రులకు ఇచ్చే డోసుల ధరలకు తయారీదారులు ముందుగానే ప్రకటించాలి. టీకాలపై ఛార్జీలను కూడా వెల్లడించాలి. ఇక ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సిన్‌ ధరపై సేవా రుసుం గరిష్ఠంగా రూ.150 మాత్రమే తీసుకోవాలి. దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు పరిశీలించాలి.

* కొవిన్‌ నమోదుతో పాటు వ్యాక్సిన్‌ కేంద్రాల వద్ద ఆన్‌సైట్‌ రిజిస్ట్రేషన్‌ సదుపాయాన్ని కూడా అందుబాటులో ఉంచాలి.

* కాల్‌ సెంటర్లు, కామన్‌ సర్వీసు సెంటర్ల ద్వారా టీకా ముందస్తు బుకింగ్‌ చేసుకునే సదుపాయాన్ని ప్రజలకు కల్పించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని